Advertisement

Advertisement


Home > Movies - Movie News

గొప్ప గాయ‌కుడు, గుర్తుండిపోయే న‌టుడు ఎస్పీబీ!

గొప్ప గాయ‌కుడు, గుర్తుండిపోయే న‌టుడు ఎస్పీబీ!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప‌లువురు గాయ‌కులు న‌ట‌న‌లోనూ త‌మ ప్ర‌తిభాపాట‌వాల‌ను చాటారు. హిందీలో బ్లాక్ అండ్ వైట్ యుగంలో గాయ‌కులు న‌టులుగా కూడా కొన‌సాగారు. ఈ విష‌యంలో దేశంలోనే గాయ‌కులంద‌రిలోనూ ముందుంటారు ఎస్పీబీ. న‌టుడిగా కూడా ఆయ‌న క‌నిపించిన సినిమాల సంఖ్య వంద‌కు పైనే ఉంటాయి. 

త‌న కెరీర్ ఆరంభ కాలం నుంచినే ఆయ‌న తెర‌పై క‌నిపిస్తూ వ‌చ్చారు. 'మ‌హ్మ‌ద్ బీన్ తుగ్ల‌క్' సినిమాలో బాలూ త‌ను పాడిన పాట‌ను త‌నే అభిన‌యించారు. అలా గెస్ట్ అప్పీరియ‌న్స్ ఇచ్చారు. త‌మిళ డ‌బ్బింగ్ సినిమా ఓ పాపా లాలీ, వెంక‌టేష్ హీరో గా న‌టించిన ప్రేమ సినిమాలో ఒక కీల‌క పాత్ర‌లో న‌టించారాయ‌న‌. వీటి క‌న్నా ముందే చంద్రమోహ‌న్ హీరోగా న‌టించిన 'ప‌క్కింట‌మ్మాయి' సినిమాలో హీరో స్నేహితుడి పాత్ర‌లో బాలూ విజృంభించారు. బాలూ పాట‌లు పాడుతూ, చంద్ర‌మోహ‌న్ వాటికి అభిన‌యిస్తూ ఆ సినిమాను గొప్ప ఎంట‌ర్ టైనర్ గా మార్చారు. ఆ సినిమాలోనే ధిగ్గ‌జ సంగీత ద‌ర్శ‌కుడు చ‌క్ర‌వ‌ర్తి కూడా ఒక స‌ర‌దా పాత్ర‌లో క‌నిపించి అల‌రిస్తారు.

ఆ త‌ర్వాత ఒక ద‌శ‌లో బాలూ హీరోల‌కు తండ్రి పాత్ర‌ల్లో వ‌ర‌స‌గా అగుపిస్తూ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు. ప్రేమికుడు, ర‌క్ష‌కుడు, ప‌విత్ర‌బంధం, జాలీ, మెరుపు క‌ల‌లు వంటి సినిమాల్లో బాలూ హీరో తండ్రి పాత్ర‌లను అద్భుతంగా పోషించారు.

త‌మిళంలో జ‌న‌క్ రాజ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఒక సినిమా రూపొందింది. తెలుగులో దాన్నే 'మామ‌గారు' పేరుతో రీమేక్ చేశారు. ఈ వెర్ష‌న్ దాస‌రి నారాయ‌ణ‌రావు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించ‌గా, క‌న్న‌డ‌లో ఆ సినిమాలో ఎస్పీబీ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందింది. ఇంద్ర సినిమాలో త‌న రియ‌ల్ లైఫ్ పాత్ర‌లోనే బాలూ క‌నిపించి ఎంట‌ర్ టైన్ చేస్తారు. రాజా హీరోగా న‌టించిన మాయాబ‌జార్ సినిమాలో కుభేరుడి పాత్ర‌ను బాలూ పండించిన తీరు అభినంద‌నీయంగా ఉంటుంది.  నేటి త‌రం స్టార్ హీరోల సినిమాల్లో కూడా బాలూ క‌నిపించారు. 

గొప్ప గాయ‌కుడిగా, చిర‌కాలం గుర్తుండిపోయే న‌టుడుగా బాలూ ద‌క్షిణాది సినిమాల‌పై త‌న‌దైన ముద్ర‌ను వేశారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?