ఆస్కార్ ఎంట్రీ.. పోటీలో త‌మిళ‌, మ‌ల‌యాళీ సినిమాలు!

ఒక‌వైపు తెలుగులో సినిమా అంటే పాన్ ఇండియా అంటున్నారు! అన్ని భాష‌ల్లో విడుద‌ల‌, ఇన్ని భాష‌ల్లో విడుద‌ల అంటారు, బాహుబ‌లితో ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి, ఖ్యాతి అంటుంటారు! క‌ట్ చేస్తే.. మంచి సినిమాల పోటీలో మాత్రం…

ఒక‌వైపు తెలుగులో సినిమా అంటే పాన్ ఇండియా అంటున్నారు! అన్ని భాష‌ల్లో విడుద‌ల‌, ఇన్ని భాష‌ల్లో విడుద‌ల అంటారు, బాహుబ‌లితో ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి, ఖ్యాతి అంటుంటారు! క‌ట్ చేస్తే.. మంచి సినిమాల పోటీలో మాత్రం మ‌నోళ్లు అడ్ర‌స్ క‌న‌ప‌డ‌రు. ఈ ఏడాద‌నే కాదు.. ప్ర‌తి యేడాదీ ఇదే క‌థ‌. ఇండియా త‌ర‌ఫు నుంచి ఆస్కార్ అవార్డ్స్ పోటీకి.. తెలుగు సినిమాలు చాలా దూర‌దూరంగానే నిలిచిపోతాయ్. 

టాలీవుడ్ నుంచి బాహుబ‌లి విడుద‌ల అయిన సంవ‌త్స‌రంలో కూడా త‌మిళం నుంచి ఒక చోటా సినిమా ఆస్కార్ టికెట్ పొందింది. భారీత‌నం, బ‌డ్జెట్లు, విడుద‌ల‌య్యే థియేట‌ర్ల సంఖ్య‌, వంద‌ల కోట్ల వ‌సూళ్లు.. ఇవేవీ మంచి సినిమా నిర్వ‌చ‌నానికి అర్హ‌త‌లు కాద‌ని టాలీవుడ్ కు తెలిసినా ప‌ట్టించుకోదంతే!

ఇక ఈ ఏడాది ఆస్కార్ లో ఇండియ‌న్ ఎంట్రీగా ఏ సినిమా వెళ్తుంద‌నేందుకు జ‌రుగుతున్న స్క్రీనింగ్స్ లో తెలుగు సినిమాల జాడ క‌నిపించ‌డం లేదు. అయితే త‌మిళ‌, మ‌ల‌యాళీలు మాత్రం ఈ సారి కూడా ఉనికిని చాటుకుంటున్నారు. మ‌ల‌యాళ సినిమా న‌య‌ట్టు, త‌మిళ సినిమా  మండేలాలు షార్ట్ లిస్టులో ఉన్నాయి. వీటితో పాటు హిందీ సినిమాలు షేర్నీ, స‌ర్దార్ ఉద‌మ్ లు కూడా ప‌రిశీల‌న‌లో ఉన్నాయ‌. విద్యాబాల‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన షేర్నీ ప్ర‌శంస‌లు అందుకుంది. ఇక స‌ర్దార్ ఉద‌మ్ దేశ‌భ‌క్తి ప‌వనం. 

ఇండియ‌న్ పోలిస్ వ్య‌వ‌స్థ‌పై చూడ‌చ‌క్క‌ని వాస్త‌విక సినిమా న‌య‌ట్టు. పోలీసులు మాట్లాడే భాష ద‌గ్గ‌ర నుంచి వారు అనునిత్యం ఎదుర్కొనే ప‌రిస్థితులు ఎలా ఉంటాయో క‌ళ్ల‌కు క‌ట్టే సినిమా. ఎస్సీ అట్రాసిటీ చ‌ట్టం, పోలీసులు, రాజ‌కీయ నేత‌లు.. ఈ అంశాల చుట్టూ అల్లుకున్న కథ‌. ఈ క‌థ‌తో మ‌ల‌యాళీలు మ‌రోసారి ప్ర‌శంస‌లు పొందారు. ఈ సినిమా కూడా ఆస్కార్ ఎంట్రీకి త‌గిన‌దే అవుతుంది. 

ఇక భార‌తీయ సామాజిక‌, కుల వ్య‌వ‌స్థ పై వాస్త‌విక‌, వ్యంగ్య సినిమాల‌ను తీయ‌డంలో త‌మిళులు ప్ర‌తియేటా ఏదో ర‌కంగా స‌త్తా చూపుతున్నారు. ఆ సినిమాల‌ను తెలుగు వాళ్లు రీమేక్ చేసుకుంటూ.. వాటిల్లో ధైర్యంగా చ‌ర్చించిన కులం అంశాన్ని దాచేస్తారు. 

పేద‌రికానికి కులం లేదంటూ త‌మ కంఫ‌ర్ట్ నీతులు చెబుతున్నారు టాలీవుడ్ వాళ్లు. కుల వ్య‌వ‌స్థ‌, వివ‌క్ష గురించి చ‌ర్చించ‌డానికి త‌మిళులు వెనుకాడ‌రు. ఆ క్ర‌మంలోనే వ‌చ్చిన సినిమా మండేలా. ఈ వ్యంగ్యాత్మ‌క సినిమా కూడా ఇప్పుడు ఆస్కార్ ఎంట్రీ పొందే పోటీలో ఉంది.