cloudfront

Advertisement


Home > Movies - Movie News

తాత అయిన అక్కినేని నాగార్జున!

తాత అయిన అక్కినేని నాగార్జున!

అక్కినేని నాగార్జున తాతకావడం అంటే.. ఇది నిజజీవితంలో కాదులెండి. అలాగని సినిమాలో కూడాకాదు. కేవలం ఒక యాడ్‌కోసం. తాత అయ్యాడు నాగార్జున. తను మొదటి నుంచి ప్రమోట్‌ చేస్తున్న నగలదుకాణం వారి తాజా యాడ్‌కోసం నాగార్జున తాతవేషంలో అగుపిస్తున్నాడు. పూర్తిగా నెరిసిన గడ్డంతో, ముడతల చర్మంతో, కాస్త వణుకుతున్న కంఠంతో నాగ్‌ ఇలా తాత వేషంలో కనిపించాడు. ఆయనవెంట మనవరాలిని కూడా పెట్టారు యాడ్‌ మేకర్లు. ఒకవైపు సినిమాల్లో ఇంకా గ్లామరస్‌ వేషాలు, సోగ్గాడి వేషాలే వేస్తున్న నాగార్జున ఉన్న ఫలంగా ఇలా తాత వేషంలో అగుపించడం విశేషమే.

అయితే నాగార్జునకు ఇలాంటి వెరైటీ ప్రయోగాలు కొత్త ఏమీకాదు. దశాబ్దాల కిందటే 'అన్నమయ్య' సినిమాలో వృద్ధుడుగా అగుపించాడు కింగ్‌. అన్నమయ్య చరమాంకం ఎపిసోడ్స్‌లో, అన్నమయ్య క్లైమాక్స్‌లో నాగార్జున వృద్ధ అన్నమయ్యగా అదరగొట్టాడు. 'అంతర్యామి.. ' అంటూ సాగే అన్నయ్య కీర్తనలో నాగార్జున బ్రహ్మాండంగా నటించాడు. నిజంగా అన్నమయ్య అలాగే వెంకటేశ్వరుడిలోకి ఐక్యం అయిపోయాడనేంత స్థాయిలో ఆ సీన్లకు ప్రాణంపోశాడు నాగార్జున. ఇన్నేళ్ల తర్వాత నాగార్జున మళ్లీ వృద్ధుడి రూపంలో కనిపిస్తున్నాడు.

మరో విశేషం ఏమిటంటే.. ఇదే యాడ్‌ వేరే భాషల వెర్షన్లలో మరోనటుడు వృద్ధుడిగా కనిపిస్తున్నాడు. ఆయన మరెవరో కాదు బిగ్‌బి అమితాబ్‌, ఈ యాడ్‌ మలయాళ వెర్షన్లో అమితాబ్‌ బచ్చన్‌ ముసలాయనగా కనిపిస్తున్నాడు. అమితాబ్‌కు కూడా ఇలాంటి పాత్రలు కొత్త ఏమీకాదు. అయితే అమితాబ్‌ వయసుకు తగ్గపాత్రే ఇది. టీనేజ్‌లోకి వచ్చిన మనవరాలు ఉంది అమితాబ్‌కు. ఆయన కుమార్తె కూతురూ త్వరలోనే హీరోయిన్‌గా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. సినిమాల్లో మేకప్‌తో కనిపించినా అమితాబ్‌ వయసుకు ఈ వృద్ధ పాత్ర సబబుగానే కనిపిస్తుంది.

నాగార్జున మాత్రం ఇమేజ్‌ భయం ఏమీలేకుండా తాతయ్య పాత్రలో యాడ్‌ చేసినట్టుగా ఉన్నాడు. ప్రయోగాత్మక పాత్రలకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు ఈ హీరో. యాడ్‌లో వెరైటీగా కనిపించి.. ప్రయోగాత్మక పాత్రలతో రమ్మని యంగ్‌ మూవీ మేకర్లకు సిగ్నల్స్‌ ఇచ్చినట్టుగా ఉన్నాడు.