Advertisement

Advertisement


Home > Movies - Movie News

టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఆ పెద్ద హీరోనే...

టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఆ పెద్ద హీరోనే...

క‌రోనా రూపంలో ప్ర‌పంచాన్ని ఓ పెద్ద విప‌త్తు గ‌జ‌గ‌జ‌లాడిస్తున్న త‌రుణంలో మెగాస్టార్ చిరంజీవి అద్వితీయ‌మైన పాత్ర పోషిస్తున్నాడు. ‘కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలున్నాయి. నాకెందుకులే’ అని ఆయ‌న అనుకోలేదు. క‌రోనాపై పోరాటానికి త‌న వంతు క‌ర్త‌వ్యంగా చిరంజీవి రూ.కోటి విరాళం ఇచ్చాడు. అంత‌టితో త‌న బాధ్య‌త పూర్త‌యింద‌ని ఆయ‌న ఏ మాత్రం భావించ‌లేదు. చేతులు ముడుచుకుని ఇంట్లో కూర్చోలేదు.

క‌రోనాపై జ‌నాల్లో చైత‌న్యం తీసుకొచ్చేందుకు బుల్లితెర‌పై ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. క‌రోనాను పార‌దోలేందుకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల స‌ల‌హాలు, సూచ‌న‌లు పాటించాల‌ని, చేతులు శుభ్రంగా క‌డుక్కోవాల‌ని...ఇలా అనేక సూచ‌న‌లు చేస్తున్నారు. అలాగే కరోనా గురించి భయపడవద్దు.. అలాగని అశ్రద్ద వహించవద్దు అంటూ..  చిరంజీవి అందరినీ సున్నితంగా హెచ్చ‌రిస్తూ అప్ర‌మ‌త్తం చేస్తున్నారు.

మ‌రోవైపు లాక్‌డౌన్ కార‌ణంగా ఉపాధి కోల్పోయి క‌ష్టాల్లో ఉన్న సినీ కార్మికుల‌ను ఆదుకునేందుకు హీరోలు, ద‌ర్శ‌క‌నిర్మాత‌లు క‌లిసి చిరంజీవి నాయ‌క‌త్వంలో ‘సి.సి.సి. మ‌న‌కోసం’ (క‌రోనా క్రైసిస్ చారిటీ మ‌న‌కోసం) అనే చారిటీని ఏర్పాటు చేశారు. ఈ సంస్థ‌కు చిరంజీవి మ‌రో కోటి రూపాయ‌ల‌ను విరాళంగా అంద‌జేసి తోటి హీరోలు, ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు స్ఫూర్తిగా నిలిచాడు. ఈ సంద‌ర్భంగా యువ హీరో కార్తికేయ ట్వీట్‌ను ప‌రిశీలిద్దాం.

‘ఇలా ప్రోత్సహించండి బాస్.. మేము దేనికైనా రెడీ’ అంటూ త‌న‌వంతుగా రూ.2 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించాడు.   ఈ సందర్భంగా చిరంజీవిని ప్రశంసిస్తూ ‘మీరు శాసించాలి.. మేము పాటించాలి’ అంటూ కార్తికేయ చేసిన ట్వీట్ మెగాస్టార్‌పై న‌మ్మ‌కాన్ని, గౌర‌వాన్ని తెలియ‌జేస్తోంది.

తాజాగా కరోనా మహమ్మారి గురించి జాగ్రత్తలు చెబుతూ సంగీత దర్శకుడు కోటి ఓ పాటను కంపోజ్ చేశారు. దీనికి శ్రీనివాస్ మౌళి సాహిత్యం అందించిన ఈ పాటను స్వయంగా కోటినే పాడారు.  ఈ పాట‌లో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సుప్రీం హీరో సాయితేజ్ కూడా గొంతు కల‌ప‌డంతో పాటు  నటించడం విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విప‌త్తు స‌మ‌యంలో పెద్ద మ‌న‌సుతో ఎప్ప‌టిక‌ప్పుడు స్పందిస్తున్న చిరంజీవి....టాలీవుడ్‌కు పెద్ద దిక్కు అయ్యాడ‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు.

ఏప్రిల్ 14 తో అయిపోతుంది అనుకోవద్దు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?