కరోనా ఫస్ట్ వేవ్‌తోనే పీడ వదిలిపోయిందనుకుంటే, అంతకంటే ఘోరంగా సెకెండ్ వేవ్ పరిణమించింది. సెకెండ్ వేవ్ ప్రభావం పిల్లల చదువుపై దారుణంగా పడింది. దేశ వ్యాప్తంగా బడులన్నీ మూతకు గురయ్యాయి. ఆన్‌లైన్ చదువులకే పరిమితం కావాల్సి వచ్చింది. మరోవైపు ఆన్‌లైన్‌లో అంటే మొక్కు”బడి” వ్యవహారమే అనే అభిప్రాయాలు తల్లిదండ్రుల్లో బలంగా నాటుకున్నాయి.
ఈ నేపథ్యంలో డబ్బుతో ఇబ్బంది లేని వాళ్లు పిల్లల చదువు కోసం ప్రత్యామ్నాయం వెతుకుతున్నారు. ఇందుకోసం ఎక్కడికి వెళ్లడానికైనా సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ నిర్ణయం ఆకట్టుకుంటోంది. దుబ్బాయ్‌లో హాయిగా పిల్లలు బడికెళ్లి చదువుకుంటుండంతో తాను కూడా కుటుంబంతో మకాం మార్చేందుకు ఆయన సిద్ధమయ్యారు.
తన భార్య అలియా, పిల్లలు షోరా, యానీతో కలిసి నవాజుద్దీన్ సిద్ధిఖీ దుబాయ్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తమ పిల్లల్ని కూడా స్కూల్‌కు పంపి చదివించేందుకు నవాజుద్దీన్, అలియా దంపతులు డిసైడ్ అయ్యారు. తమ నిర్ణయాన్ని అలియా ప్రకటించారు.
“ఆన్‌లైన్ క్లాసుల వల్ల పిల్లల ప్రవర్తనలో తేడా వస్తోంది. అందుకే వచ్చే నెల్లో దుబాయ్ వెళ్లిపోవాలనుకుంటున్నాం. మా బంధువులు అక్కడ ఉన్నారు. స్కూల్ అడ్మిషన్స్ వ్యవహారాలు వాళ్లే చూసుకుంటున్నారు. పిల్లల్ని విదేశాల్లో చదివించాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. కరోనా వల్ల అది కాస్త ముందుకు వచ్చింది’ అని అలియా పేర్కొన్నారు.