టాలీవుడ్ హీరోయిన్‌గా అంజలి 15 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఎలాంటి నేపథ్యం లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రేక్షకాదరణ పొందారు. దీనికి ఆమె స్వయంకృషి, పట్టుదలే కారణం. ఒక్క టాలీవుడ్ అనే కాకుండా దక్షిణాది భాషల్లో కూడా కథానాయికగా తన సత్తా చాటుతున్నారు.
ఈ నెల 9న పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ విడుదల కానుంది. టాలీవుడ్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమాలో అంజలి ఓ కీలక పాత్రలో నటించారు. సినిమా విడుదల సందర్భంగా మీడియాతో తన అనుభవాలను ఆమె పంచుకున్నారు. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.
దక్షిణాదిలో ఇప్పటి వరకూ 48 సినిమాల్లో నటించినట్టు అంజలి తెలిపారు. మరో 5 చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయన్నారు. తనకు పరిశ్రమలో తెలిసినవాళ్లెవరూ లేరన్నారు. కానీ వచ్చిన తర్వాత ఎవరితో ఎలా ఉండాలో అనుభవాలే నేర్పాయన్నారు.
తమిళంలో తన మొదటి చిత్రం ‘కట్రదు తమిళ్’, తెలుగులో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ చేసుండకపోతే ఓ పది సినిమాల తర్వాత ఇంటికి వెళ్లిపోయేదాన్నని అంజలి చెప్పడం విశేషం. ఇదంతా తన స్వశక్తితో నిర్మించుకున్న చిత్ర సామ్రాజ్యం అని ఆమె గర్వంగా ప్రకటించారు.
పవన్‌కల్యాణ్ లాంటి అగ్రనటుడితో కలిసి నటించిన సినిమా విడుదల సహజంగా ఉద్వేగాన్ని కలిగిస్తోందన్నారు. హిందీలో పెద్ద హిట్ సినిమాకు ఇది రీమేక్ అనే విషయం తెలిసిందే అన్నారు. గొప్ప అవకాశాలు అప్పుడప్పుడు వస్తుంటాయని, వాటిని అందిపుచ్చుకోవాలని, అలాంటి గొప్ప అవకాశం తనకు వకీల్‌సాబ్ రూపంలో వచ్చినట్టు అంజలి తెలిపారు. దీంతో తన కల నిజమైందని ఆనందంగా చెప్పుకొచ్చారు.
వకీల్‌సాబ్‌లో తన క్యారెక్టర్‌కు ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. మెరుపు తీగలాంటి పాత్రకు తాను ప్రాధాన్యం ఇవ్వనన్నారు. ఈ విషయం వకీల్‌సాబ్‌లో తన క్యారెక్టర్ చూసిన తర్వాత ఎవరికైనా ఇదే అభిప్రాయం కలుగుతుందన్నారు. ఇక పవన్‌కల్యాణ్ గారితో కలిసి పనిచేసిన అనుభవాలను తప్పక పంచుకోవాలన్నారు. ఆయన సెట్లో అడుగు పెడితే అంతా నిశబ్దమే అన్నారు. ఆయనతో మాట్లాడ్డానికి తనకు 15 రోజులు పట్టిందన్నారు. నటనపై ఆయన అంకిత భావం తనకెంతో నచ్చినట్టు అంజలి చెప్పుకొచ్చారు.
ఆయనతో కలిసి 15 రోజులకుపైనే పనిచేసినట్టు తెలిపారు. తన కెరీర్‌లో ఇది అద్భుతమైన ప్రయాణమని ఆమె చెప్పుకొచ్చారు. కోర్ట్ సీన్ చేశాక… ఆ సీన్ బాగా వచ్చిందని పవన్‌కల్యాణ్ చప్పట్లు కొట్టి అభినందించడాన్ని తానెప్పటికీ మరిచిపోలేనని ఆనందం వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా తానో పెద్ద స్టార్ అనే భావన పవన్‌లో ఏ మాత్రం కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు.
ఇక వ్యక్తిగత విషయాలు కూడా ఆమె పంచుకున్నారు. తన ప్రేమ సంగతుల్ని కూడా వెల్లడించారు. తాను ప్రేమలో పడలేదని చెబితే అది అబద్దం అవుతుందని నిజాయతీగా చెప్పారు. కానీ తన ప్రేమ వర్కౌట్ కాలేదన్నారు. తన ప్రేమ సక్సెస్ అయ్యి వుంటే తన ప్రియుడిని పరిచయం చేసేదాన్ననన్నారు. కానీ ప్రేమ విషయంలో అనుకున్నట్టు జరగకపోవడంతో ఆవేదన మిగిలిందన్నారు.
ఏ ఆడపిల్లైనా ప్రేమలో విఫలమైతే ఆ బాధ తట్టుకోవడం చాలా కష్టమని అంజలి స్వీయ అనుభవంతో చెప్పుకొచ్చారు. ఎందుకంటే అమ్మాయి గుండెలు చాలా సున్నతమైనవన్నారు. అమ్మ సపోర్ట్‌తో ఆ బాధ నుంచి తాను త్వరగానే కోలుకున్నట్టు తెలిపారు. తాను మెంటల్‌గా చాలా స్ట్రాంగ్ అని అంజలి వెల్లడించారు.
అమ్మ ఇచ్చిన ధైర్యంతో సంతోషంగా కెరీర్ కొనసాగిస్తున్నట్టు అంజలి తెలిపారు. ఇక తన పెళ్లి గురించి జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదన్నారు. ఏకంగా తనకు ఐదు సార్లు పెళ్లి చేశారని నవ్వుతూ చెప్పారు. పెళ్ళిళ్లతో ఆగలేదని, ఏకంగా పిల్లలు కూడా పుట్టారని రాశారన్నారు. దయచేసి తన తన భర్తని, పిల్లల్ని చూపించాలని, అప్పుడు ఆనందిస్తానని అంజలి కోరడం విశేషం.