Advertisement

Advertisement


Home > Movies - Movie News

వాయిస్ ఆఫ్ సౌత్ సినిమా.. ఎస్పీబీ!

వాయిస్ ఆఫ్ సౌత్ సినిమా.. ఎస్పీబీ!

ఎన్టీఆర్ కు పాడితే ఎన్టీఆరే పాడిన‌ట్టు ఉంటుంది. నాగేశ్వ‌ర‌రావుకు పాడితే ఆయ‌న ఇలా పాడ‌గ‌ల‌డా అనుకుంటాడు అమాయ‌క ప్రేక్ష‌కుడు. అక్క‌డితో మొద‌లుపెడితే.. ఈ త‌రం హీరోల వ‌ర‌కూ అంద‌రూ కూడా గాయ‌కులేమో అనే భావ‌న‌ను పంచిన గాత్రం ఆయ‌న‌ది!  

అది మిమిక్రీనా? అని ఒక త‌మిళ ఇంట‌ర్వ్యూలో ఎస్పీబీని అడిగితే, అదేం కాదంటారాయ‌న‌. కేవ‌లం ఆ హీరోలు ఎలా మాట్లాడ‌తారో గ‌మ‌నించి వారి కోసం త‌ను పాడిన‌ట్టుగా చెప్పారాయ‌న‌. అందులో త‌మిళ హీరోల‌ను ఆయ‌న ఉదాహ‌రించారు. వారెలా మాట్లాడ‌తారు.. వారి డైలాగ్ డెలివ‌రీని ప‌రిశీలించి త‌ను వారికి త‌గిన‌ట్టుగా పాడిన‌ట్టుగా ఆ ఇంట‌ర్వ్యూలో బాలూ అస‌లు గుట్టును వివ‌రించారు.

తమిళం క‌న్నా బాలూ తెలుగులో కెరీర్ ముందు మొద‌లుపెట్టారు. అవ‌కాశాలు కావాల‌ని ఒక త‌మిళ సంగీత ద‌ర్శ‌కుడిని క‌ల‌వ‌గా, ముందు త‌మిళం బాగా నేర్చుకోవాల‌ని ఆయ‌న సూచించార‌ని, అప్ప‌టికే కొంత వ‌ర‌కూ వ‌చ్చిన త‌మిళాన్ని పూర్తిగా నేర్చుకుని త‌మిళ సినిమా అవ‌కాశాల‌ను పొందిన‌ట్టుగా బాలూ వివ‌రించారు.

అలా ఆ భాష‌ను నేర్చుకుని వెళ్లిన వ్య‌క్తే అయినా.. తెలుగు వాళ్ల‌కు ఎంత ప్రియమైన గాయ‌కుడు అయ్యారో, త‌మిళుల‌కూ అంతే ఇష్టుడ‌య్యారు. డ‌బ్బింగ్ ల, రీమేక్ ల యుగంలో బాలూ రెండు భాష‌ల్లోనూ దాదాపు స‌మాన‌మైన ప‌ని చేశారు.  తెలుగు లో స్టార్ హీరోలు బాలూకూ దూరం అయినా త‌మిళ స్టార్ హీరోలు మాత్రం బాలూతో త‌మ అనుబంధాన్ని కొన‌సాగించారు. క‌మ‌ల్, ర‌జ‌నీ సినిమాల్లో అయితే ఈ మ‌ధ్య కాలంలో వ‌చ్చిన సినిమాల్లో కూడా బాలూ గాత్రం త‌ప్ప‌నిస‌రిగా కొన‌సాగింది.

దాదాపు నెల రోజులుగా బాలూ ఆసుప‌త్రిలో చికిత్స పొందిన స‌మ‌యంలో కూడా తెలుగువారి క‌న్నా ఎక్కువ‌గా స్పందించింది త‌మిళులే. త‌మిళ సోష‌ల్ మీడియా పేజ్ ల‌లో బాలూ ఇంట‌ర్వ్యూలు, బాలూ చెప్పిన ముచ్చ‌ట్లు నెల నుంచి ట్రెండింగ్ లో ఉన్నాయి. బాలూ కోలుకోవాల‌ని తెలుగు స్టార్ హీరోలూ స్పందించారు, తెలుగు ప్ర‌జ‌లూ ఆకాంక్షించారు. అయితే తెలుగు వారి క‌న్నా బాలూపై త‌మిళులు మ‌రింత ఎక్కువ మ‌మ‌కార‌మే చూపించారు.

ఆయ‌న గురించి త‌మ అనుభూతుల‌ను పంచుకుంటూ.. ఆయ‌న కోలుకోవాల‌ని మ‌ళ్లీ పాడాల‌ని ఆకాంక్షించారు. అయితే సంపూర్ణ జీవితాన్ని చ‌వి చూసిన ఎస్పీబీ భువిపై ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన‌ది చాలించి, దివికేగారు.

పవన్ ఇంటర్వ్యూ.. పరస్పర సహకార ఒప్పందం

కొరటాల కథ కొట్టేసింది బోయపాటేనా? 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?