కొందరు దర్శకులకు, కొంతమంది హీరోయిన్లంటే చాలా ఇష్టం. వాళ్లనే రిపీట్ చేస్తుంటారు. అది సెంటిమెంట్ అని కూడా అనుకోవచ్చు. త్రివిక్రమ్ ఎలాగైతే పూజాహెగ్డేను రిపీట్ చేస్తుంటాడో.. మరో దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా అంతే. శృతిహాసన్ ను మాత్రమే తీసుకోవాలని తెగ ట్రై చేస్తుంటాడు.
కానీ ఆశ్చర్యంగా ఇప్పుడీ ఇద్దరు దర్శకులు తమ సెంటిమెంట్ పక్కనపెట్టినట్టు కనిపిస్తోంది. త్రివిక్రమ్ సంగతి అందరికీ తెలిసిందే. మహేష్ బాబుతో చేస్తున్న గుంటూరు కారం సినిమా కోసం మరో ఆలోచన లేకుండా పూజా హెగ్డేను తీసుకున్నాడు. అయితే రోజులు గడిచేకొద్దీ పరిస్థితులు మారిపోయాయి.
మహేష్-త్రివిక్రమ్ సినిమా నుంచి పూజాహెగ్డే తప్పుకుంది. ఆమె స్వచ్చంధంగా తప్పుకుందా లేక యూనిట్ ఆమెను తొలిగించిందా అనేది ఇక్కడ అప్రస్తుతం. పూజాహెగ్డే లేకుండా త్రివిక్రమ్ ఓ సినిమా చేస్తున్నాడనేది ఇక్కడ మేటర్. ఇంతకుముందు త్రివిక్రమ్ తీసిన 2 సినిమాల్లో పూజానే హీరోయిన్. ఈసారి మాత్రం ఆమె లేదు.
మరో దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా తన సెంటిమెంట్ ను పక్కనపెట్టినట్టు కనిపిస్తోంది. ఇతగాడికి శృతిహాసన్ అంటే సెంటిమెంట్. అయితే తాజా చిత్రం కోసం మాత్రం మరో హీరోయిన్ ను ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది.
రవితేజ, గోపీచంద్ మలినేని కాంబోలో సినిమా తీయబోతున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్ ఈమధ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. వీళ్ల కాంబినేషన్ అంటే కచ్చితంగా శృతిహాసన్ హీరోయిన్ గా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ గోపీచంద్ మాత్రం ఇప్పుడు వేరే హీరోయిన్ల కోసం ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా పూజాహెగ్డే పేరు వినిపిస్తోంది.
ఇంతకుముందు శృతిహాసన్ తో బలుపు, క్రాక్, వీరసింహారెడ్డి సినిమాలు చేశాడు గోపీచంద్ మలినేని. ఈసారి మాత్రం ఆమెను రిపీట్ చేయాలని అనుకోవడం లేదంట.