cloudfront

Advertisement


Home > Movies - Movie News

ఈ వీకెండ్.. చిన్న సినిమాలకు పండగే పండగ

ఈ వీకెండ్.. చిన్న సినిమాలకు పండగే పండగ

ఓవైపు శైలజారెడ్డి అల్లుడు వాయిదాపడింది. మరోవైపు గీతగోవిందం సినిమా వచ్చి 2 వారాలు దాటిపోయింది. థియేటర్లలో కొత్త సరుకు కోసం ఆడియన్స్ వెయిటింగ్. సరిగ్గా ఇలాంటి గ్యాప్ లో థియేటర్లలోకి వస్తున్నాయి 5 సినిమాలు. ఇవన్నీ చిన్న సినిమాలే. కానీ కంటెంట్ బాగుంటే వీటిలో ఏదో ఒక సినిమా పెద్ద హిట్టయ్యే అవకాశాలు ప్రస్తుతం మార్కెట్లో ఉన్నాయి. 

30న నర్తనశాల థియేటర్లలోకి వస్తోంది. నాగశౌర్య హీరోగా నటించిన ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. సొంత బ్యానర్ లో నాగశౌర్య చేసిన రెండో సినిమా ఇది. మొదటి సినిమా ఛలో హిట్ అవ్వడంతో, ఆ క్రేజ్ కారణంగా నర్తనశాలకు మంచి బిజినెస్ జరిగింది. మరోవైపు శాటిలైట్ కూడా అమ్మేశారు. ఇలా ఫుల్ సేఫ్ జోన్ లో థియేటర్లలోకి అడుగుపెడుతోంది నర్తనశాల. రిజల్ట్ ఒక్కటే పెండింగ్.

నర్తనశాల థియేటర్లలోకి వచ్చిన 24 గంటల గ్యాప్ లో మిగతా 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో 2 స్ట్రయిట్ సినిమాలుంటే, మిగతా రెండు డబ్బింగ్ సినిమాలు. ముందుగా స్ట్రయిట్ సినిమాల సంగతి చూస్తే, వీటిలో కాస్తోకూస్తో ఎట్రాక్ట్ చేస్తున్న మూవీ పేపర్ బాయ్. మహేష్, ప్రభాస్ లాంటి హీరోలు ఈ సినిమా ట్రయిలర్ చూసి మెచ్చుకోవడంతో, పేపర్ బాయ్ పై అందరి దృష్టిపడింది. మరో సినిమా సమీరమ్ వస్తుందనే విషయమే చాలామందికి తెలీదు.

ఇక డబ్బింగ్ సినిమాల జాబితాలో కోకో కోకిల, క్రైమ్-23 సినిమాలున్నాయి. కోలీవుడ్ లో ప్రస్తుతం హిట్ టాక్ తో నడుస్తున్న కొలమావు కోకిల సినిమా కోకో కోకిలగా తెలుగులోకి వస్తోంది. మరోవైపు అరుణ్ విజయ్ హీరోగా నటించిన క్రైమ్-23 సినిమా కూడా లిస్ట్ లో ఉంది. ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్న ఈ 5 సినిమాల్లో ఏది జాక్ పాట్ కొడుతుందో చూడాలి. లేదంటే గీతగోవిందానికి మరోవారం అదనంగా దొరికినట్టే.