Advertisement

Advertisement


Home > Movies - Movie News

నవంబర్ బాక్సాఫీస్.. చిన్న సినిమాల పెద్ద మెరుపులు

నవంబర్ బాక్సాఫీస్.. చిన్న సినిమాల పెద్ద మెరుపులు

నవంబర్ నెలలో పెద్ద సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా రిలీజ్ అవ్వలేదు. సమంత నటించిన యశోద సినిమానే నెల మొత్తానికి పెద్ద సినిమాగా నిలిచింది. ఈ సంగతి పక్కనపెడితే.. ఈ నెలలో చిన్న సినిమాలు కొన్ని తమ సత్తా చాటాయి. కొన్ని మెరుపులు మెరిపించగా, మరికొన్ని బ్లాక్ బస్టర్ బాంబ్స్ పేల్చాయి

నవంబర్ మొదటివారంలో... అల్లు శిరీష్ హీరోగా నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా రిలీజైంది. పూర్తిగా యూత్ ను టార్గెట్ చేసి తీసిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఎట్టకేలకు అల్లు శిరీష్ కు ఓ సక్సెస్ వచ్చిందనే ఇమేజ్ ను కట్టబెట్టింది. అయితే కమర్షియల్ గా చూసుకుంటే మాత్రం ఇది సక్సెస్ కాదు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. థియేట్రికల్ సిస్టమ్, ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోవడంతో, అల్లు శిరీష్ కోసం థియేటర్లకు వెళ్లేందుకు ఆడియన్స్ ఆసక్తి చూపించలేదు. ఫలితంగా అల్లు శిరీష్ కు ఆనందం, బయ్యర్లకు బాధ మిగిలింది.

ఈ సినిమాతో పాటు జెట్టి, బొమ్మ బ్లాక్ బస్టర్, బనారస్, లైక్ షేర్ & సబ్ స్క్రైబ్, సారధి, తగ్గేదేలే, ఆకాశం సినిమాలు కూడా ఒకేసారి పొలోమంటూ థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో ఏ ఒక్కటి ఆకట్టుకోలేకపోయింది. చివరికి సంతోష్ శోభన్, మేర్లపాక గాంధీ కాంబోలో వచ్చిన లైక్ షేర్ & సబ్ స్క్రైబ్ కూడా డిజాస్టర్ అయింది.

నవంబర్ రెండో వారంలో.. సమంత నటించిన యశోద సినిమా వచ్చింది. ఓ మోస్తరు అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఆ అంచనాల్ని నిలబెట్టుకుంది. సమంత కెరీర్ లో మరో సక్సెస్ ఫుల్ సినిమాగా నిలిచింది యశోద. ఇకపై కూడా ఫిమేల్ లీడ్ మూవీస్ కొనసాగించవచ్చనే భరోసాను సమంతకు ఇచ్చింది ఈ సినిమా. ఈ మూవీతో పాటు వచ్చిన నచ్చింది గర్ల్ ఫ్రెండ్, మది, ఇన్ సెక్యూర్, క్లూ, ఆధారం సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

మూడో వారంలో.. సుడిగాలి సుధీర్ నటించిన గాలోడు వచ్చింది. దీంతో పాటు మసూద అనే హారర్ థ్రిల్లర్ కూడా వచ్చింది. ఈ రెండూ సక్సెస్ అయ్యాయి. గాలోడు సినిమా సుడిగాలి సుధీర్ రేంజ్ ను మించి వసూళ్లు సాధించగా.. హారర్ జానర్ ఇష్టపడే ప్రేక్షకులకు మసూద విపరీతంగా నచ్చింది. ఈ రెండు సినిమాలు కాకుండా, ఈ వారంలో వచ్చిన అలిపిరికి అల్లంతదూరంలో, సీతారామపురంలో, బెస్ట్ కపుల్, భారతపుత్రులు లాంటి సినిమాలన్నీ ఫెయిల్ అయ్యాయి.

ఇక నవంబర్ నెలకు ఫినిషింగ్ టచ్ ఇస్తూ రిలీజ్ అయింది లవ్ టుడే మూవీ. ఈ నెలలో సర్ ప్రైజ్ హిట్ ఏదైనా ఉందంటే అది ఈ తమిళ డబ్బింగ్ సినిమా మాత్రమే. పూర్తిగా యూత్ ను టార్గెట్ చేసిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ కూడా దాటేసి, లాభాల్లోకి వచ్చేసింది.

అల్లరినరేష్ నటించిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాకు మొదటి రోజు డీసెంట్ టాక్ వచ్చినప్పటికీ, లవ్ టుడే ప్రభంజనం ముందు నిలబడలేకపోయింది. రిలీజైన 3 రోజులుకే డీసెంట్ టాక్ నుంచి కమర్షియల్ ఫెయిల్యూర్ దిశగా మళ్లింది. ఇక తోడేలు, రణస్థలి, వల, మన్నించవా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

ఈ స్ట్రయిట్, డబ్బింగ్ సినిమాల మధ్యలో రీ-రిలీజెస్ కూడా ఉన్నాయి. నువ్వే నువ్వే, ప్రతిబింబాలు, వర్షం, రెబల్, బాద్ షా సినిమాలు లిమిటెడ్ థియేటర్లలో రిలీజయ్యాయి. అయితే వాటి ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఓవరాల్ గా నవంబర్ నెలలో లవ్ టుడే, యశోద, గాలోడు సినిమాలు అందర్నీ ఎట్రాక్ట్ చేయగా, మసూద సినిమా ఓ సెక్షన్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది.

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా