Advertisement


Home > Movies - Movie News
టాలీవుడ్ ఉగాది హంగామా

ఎప్పట్లానే ఈ ఉగాదికి కూడా టాలీవుడ్ లో హంగామా రెడీ అవుతోంది. ఇప్పటికే పలు సినిమాలు ఉగాది డేట్ ను లాక్ చేసుకోగా, ఈ లిస్ట్ లో మరిన్ని సినిమాలు చేరబోతున్నాయి. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సిన సినిమా రంగస్థలం. 

ఉగాది సందర్భంగా విశాఖ సాగర తీరాన రంగస్థలం ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఆటపాటలతో పాటు ఉత్తరాంధ్రకు చెందిన మరెన్నో సంప్రదాయ, జానపద కళల్ని ప్రదర్శించబోతున్నారు. ఈ వేడుకకు చిరంజీవి ప్రత్యేక అతిథిగా వస్తున్నాడనేది పక్కా. రాజమౌళి, బోయపాటి కూడా వస్తారనే ప్రచారం నడుస్తోంది.

ఇక ఉగాదికి రవితేజ సినిమా కూడా హంగామా చేయబోతోంది. ప్రస్తుతం కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నేలటిక్కెట్ అనే సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ మూవీ ఫస్ట్ లుక్ ను ఉగాది రోజున విడుదల చేయబోతున్నారు. నేలటిక్కెట్ అనేది వర్కింగ్ టైటిల్ మాత్రమే. అదే టైటిల్ ను కొనసాగిస్తారా లేక మరో టైటిల్ పెట్టబోతున్నారా అనే విషయం ఆరోజు తేలిపోతుంది.

ఇక మహేష్ బాబు నటిస్తున్న భరత్ అనే నేను పాటల హంగామా కూడా ఉగాది నుంచే షురూ కాబోతోంది. ఉగాది పచ్చడితో పాటు మహేష్ సినిమా పాటతో ఆరోజు పండగ చేసుకుందామంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ స్టార్ట్ అయింది. కొరటాల దర్శకత్వంలో వస్తున్న భరత్ అనే నేను సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. ఉగాది నుంచి దశలవారీగా ఈ సాంగ్స్ విడుదల కానున్నాయి.

పండగల్ని అస్సలు మిస్ అవ్వని బన్నీ కూడా ఉగాది స్పెషల్ రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ కు కొనసాగింపుగా మరో సింగిల్ ను రిలీజ్ చేయాలా? లేక సినిమాకు సంబంధించి ఏదైనా ఒక హైలెట్ తో వీడియో రిలీజ్ చేయాలా అనే ఆలోచనలో యూనిట్ ఉంది. ఏదో ఒకటి రావడం మాత్రం గ్యారెంటీ. 

అటు సవ్యసాచి యూనిట్ కూడా మార్చి 18న తమ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. ఈ సినిమాలతో పాటు కృష్ణార్జున యుద్ధం, సాక్ష్యం, టాక్సీవాలా సినిమాల నుంచి కూడా ఉగాది రోజున స్పెషల్స్ రాబోతున్నాయి.