cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

వకీల్ సాబ్: నా ఘర్ కా నా ఘాట్ కా

వకీల్ సాబ్: నా ఘర్ కా నా ఘాట్ కా

అప్పుడే వకీల్ సాబ్ సినిమా చూసి వచ్చిన యోగి "మగువా మగువా" అంటూ పాడుతూ సీన్ లోకి ఎంటర్ అవుతాడు.

ఆ పాట విన్న జోగి పకాలున నవ్వుతాడు.

యోగి: పాట వినగానే నీకు అంత కామెడీ గా అనిపిస్తుందా?

జోగి: ఏం లేదురా.. మగువల మీద పవన్ కళ్యాణ్ ట్రాక్ రికార్డ్ తెలిసి కూడా డైరెక్టర్ ఆ పాట పవన్ మీద పెట్టాడు అంటే సూపరేహే...

యోగి: బయటి జీవితానికి సినిమాకి పోలికలు  ఏమిటిరా??

జోగి: పోలికలు నేను కాదు ఆ డైరెక్టరే పెట్టాడు. ఒరిజినల్ సినిమాకి సంబంధం లేనివన్ని పెడుతూ..

యోగి: సినిమాలో ఫైట్లు అదిరాయి రా!

జోగి: అవి చూసే అనుకున్నాను నేను, ఈయన వకీల్ సాబా? లేక రౌడీ సాబా? అని.

యోగి: కోర్టు మధ్యలో టాయిలెట్ ఫైట్ అదుర్స్ కదరా?

జోగి: అంత బాగా ఫైట్లు వచ్చిన వకీల్ సాబ్ ఇంకా కోర్టులో వాదించడం ఎందుకురా? ఆ కుర్రాళ్లను నాలుగు తంతే వాళ్లే దారిలోకి వచ్చేస్తారు కదా!

యోగి: చాల్లేరా.. నీ వెటకారం అయినా శృతి హాసన్ తో ఫ్లాష్ బ్యాక్ సీన్లు బావున్నాయి కదరా జోగి..

జోగి: ఏంటి ఆ సీన్లు ఇంకా తీయలేదా? ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్లు చూసి ఫ్యాన్సే గోల పెడుతున్నారు కదరా! అవి కట్ చేయమని ట్విట్టర్ లో మొత్తుకుంటున్నారు.

యోగి: పవన్ కి, ప్రకాష్ రాజ్ కి మధ్య సీన్లు మళ్ళీ బద్రి సినిమాను గుర్తుకు తెచ్చాయి.

జోగి: నేనూ అదే భయపడ్డాను. పవన్ అంత ఉద్రేకంగా డైలాగులు చెబుతూ "నువ్వు నందా అయితే ఏంటి నేను బద్రి, బద్రి నాథ్ అంటూ ఎక్కడ ప్రకాష్ రాజ్ ని కోర్టులోనే కొట్టేస్తాడేమో అని భయ పడ్డాను. అదృష్టవశాత్తూ డైరెక్టర్ అలాంటి సీన్లు పెట్టలేదు.

యోగి: ఏది ఏమైనా "నువ్వు జనాలకు కావాలి" అని లాస్ట్ లో డైలాగ్ శరత్ బాబు చేత చెప్పించారు చూడు అది భలే నచ్చేసింది రా నాకు.

జోగి: అలాంటి బిల్డ్ ఆప్  డైలాగులు ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చే ముందు సినిమాల్లో పెట్టుకుంటే కాస్త గిట్టుబాటు అవుతాయి. ప్రస్తుతం రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పెర్ఫార్మన్స్ చూస్తూనే ఉన్నాం కదా. అలాంటి డైలాగులు వింటే మా లాంటి సగటు ప్రేక్షకులు నవ్వుకోరా??

యోగి: నువ్వన్నీ అలానే అంటావ్ లేరా.. అయినా కాలేజీ స్టూడెంట్ గా నాయకుడిగా పవన్ కళ్యాణ్ అదరగొట్టేసాడు కదా!

జోగి: బయట పవన్ ని రాజకీయ నాయకుడిగానే చూడలేకపోతున్నామంటే ఆ డైరెక్టర్ అంత లేటు వయసులో పవన్ ని కాలేజి స్టూడెంట్ గా చూపించాడు. చూస్తుంటే రేపు చిరంజీవి ని, రజినీకాంత్ ని కూడా కాలేజి స్టూడెంట్ గా చూపించడానికి మనల్ని ప్రిపేర్ చేస్తున్నట్లు గా ఉంది ఈ డైరెక్టర్లు.

యోగి: నేను చిరంజీవి, రజినీకాంత్ అభిమానిని అయినా వాళ్ళని కాలేజీ స్టూడెంట్ గా చూడాలి అంటే కష్టం లేరా.

జోగి: నేను పవన్ కళ్యాణ్ ని స్టూడెంట్ గా చూసినప్పుడు కూడా అదే ఫీల్ అయ్యాను.

యోగి: అయినా నీ ప్రాబ్లెమ్ ఏంటి రా?? సినిమాలో పవన్ కళ్యాణ్ అంత బాగా చేస్తే.

జోగి: నా ప్రాబ్లెమ్ సరిగ్గా అదేరా. హిందీలో పింక్ రిలీజ్ అయినప్పుడు అందరూ ఆ సినిమా ఇచ్చిన మెసేజ్ గురుంచి చర్చించారు. కానీ మన తెలుగులో మాత్రం పవన్ కళ్యాణ్ గురుంచి చర్చిస్తున్నారు. అక్కడే అర్థం కావడం లేదా?  సినిమా ఇచ్చిన మెసేజ్ పూర్తిగా డైల్యూట్ అయిందని.

యోగి: పవన్ కళ్యాణ్ చేస్తే ఆ మాత్రం చర్చ కామన్ కదా!

జోగి: నేను చెప్పేది కూడా అదే! కేవలం పాటలు, ఫైట్లు, హీరోని చూడడానికి వచ్చే వర్గం ప్రేక్షకుల సినిమా అది కానే కాదు. కాస్త బుర్ర పెట్టి ఆలోచించే వర్గం ప్రేక్షకులకు సంబంధించిన సినిమా అది. 

యోగి: అదంతా కాదు రా. సినిమా పై నీ అభిప్రాయం ఒక్క ముక్కలో చెప్పు.

జోగి: వకీల్ సాబ్: నా ఘర్ కా నా ఘాట్ కా.

యోగి: అంటే??

జోగి: వకీల్ సాబ్ ఎటుకి చెందలేదు అని హిందీ సామెత ఉపయోగించి చెప్పాను. నిజానికి పింక్ సినిమా ఎలా పడితే అలా మార్చి తీసే సినిమా కానే కాదు.

తమిళ్ లో కూడా అజిత్ సినిమా మార్చకుండానే తీసాడు. తెలుగుకి వచ్చేసరికి ఆ సినిమాకు ఒక అర్థం అంటూ లేకుండా పోయింది.

యోగి: AP ప్రభుత్వం సినిమా టికెట్స్ రేట్స్ తగ్గించి పాపం సినిమా వాళ్లకు అన్యాయం చేసింది కదరా.

జోగి: టికెట్ రేట్ పెంచాలా? లేక తగ్గించాలా అన్నది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. హై కోర్టు డివిజన్ బెంచ్ కూడా అదే చెప్పింది. అయినా ప్రేక్షకులకు ఆ నిర్ణయం మంచిదే కదా!

యోగి: పాపం నిర్మాత, డిస్ట్రీబ్యూటర్స్ మట్టి కొట్టుకుపోతారు కదా!

జోగి: హీరో రెమ్యునరేషన్ తప్ప ఆ సినిమాకు ఖర్చు ఏముందిరా? అయినా వంద కోట్లకు అమ్మేసి, టికెట్ రేట్ లు పెంచేసి మన నుండి సొమ్ము కొట్టేద్దామనుకోవడం దురాశ కాదూ?? పోనీ బాహుబలి రేంజ్ లో తీస్తే అదో మాట.

యోగి: ఏది ఏమైనా మా బాస్ మళ్ళీ సిన్మాలలోకి రాడేమోనని భయపడ్డాను కానీ అలా జరగలేదు.

జోగి: పవన్ కళ్యాణ్ కూడా ఆ తానులోని ముక్కే!

యోగి: సరిగా చెప్పేహే.. అర్థం కాలేదు.

జోగి: రాజకీయ నాయకులు ఎవరూ సాధారణంగా మాట మీద నిలబడరు. పవన్ కళ్యాణ్ కూడా సినిమాలు చేయను అని మాట ఇచ్చి తప్పాడు. అందుకే అంటున్నాను.. పవన్ కూడా ఆ తాను లోని ముక్కే! అని.

యోగి: నీకు పవన్ అంటే పడదు అందుకే ఇలా అంటున్నావు.

జోగి: నేను నిజాలు చెబుతున్నాను. నీకు అలా అనిపిస్తే నేనేం చేయను??

యోగి: ఇంతకీ ఆ డైరెక్టర్ కి లేదా పవన్ కి ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఏమైనా సలహా ఇద్దామని అనుకుంటున్నవా??

జోగి: ఒకటైతే నాకు అనిపించింది. హిందీలో ఈ సినిమాకు పింక్ (రంగు) అని పేరు పెట్టారు. తెలుగులో ఈ సినిమాకు "కాషాయం" అని పెట్టి ఉంటే సరిగ్గా సరిపోయి ఉండేది. ఇటు సినిమాకు ఒక రంగు పేరు పెట్టినట్లు అవుతుంది అటు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగాను ఉండేది.

యోగి: నీకు వెటకారం మాములుగా లేదు రా! సరే గాని నాకు టైం అయింది.. నేను వెళ్తున్నాను.

జోగి: ఎక్కడికిరా??

యోగి: వకీల్ సాబ్ రెండవసారి చూడడానికి.

జోగి: మిమ్మల్ని ఎవరూ బాగు చేయలేరు.

భాస్కర్ కిల్లి.

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×