బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తన సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయ్యారు. బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య తర్వాత నెపోటిజంపై అందరి కంటే ముందుగా కంగనానే తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అప్పుడు చెలరేగిన గొడవ ఇంతింతై అన్నట్టుగా రాజకీయ టర్న్ తీసుకొంది. ప్రస్తుతం శివసేన వర్సెస్ కంగనా అన్నట్టు పరిస్థితి తయారైంది.
ఈ నేపథ్యంలో సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మ వరుస ట్వీట్లు ఆసక్తికరంగా మారాయి. వ్యంగ్యంతో కూడిన ఆ ట్వీట్లు…కంగనాను తిడుతున్నట్టా? పొగుడుతున్నట్టా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంగనా, మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదం గురించి వర్మ వరుస ట్వీట్లు చేశారు.
“పరిస్థితి చూస్తుంటే మహారాష్ట్రకు కంగన కాబోయే సీఎమ్ అనిపిస్తోంది. అదే జరిగితే బాలీవుడ్ అంతా టింబక్‌టూ (నైగర్ నది ఒడ్డున ఉన్న ఓ ప్రాంతం)కు మకాం మార్చాలి” అని ట్వీట్ చేశారు.
అలాగే మరో ట్వీట్‌లో జాతీయ జర్నలిస్టును కూడా కలిపారు. ఆ ట్వీట్‌లో ఏముందంటే….“కంగన సీఎమ్, అర్ణాబ్ గోస్వామి పీఎమ్ అయిన తర్వాత శివసేన పూర్తిగా అంతర్థానమవుతుంది. ముంబై పోలీసులను రిపబ్లిక్ టీవీ రీప్లేస్ చేస్తుంది. కాంగ్రెస్ ఇటలీకి పారిపోతోంది” అని పేర్కొన్నారు.
అలాగే ఏకవాక్యంలో ఉన్న మరో ట్వీట్ శివసేనపై అదిరిపోయే పంచ్‌గా పేర్కొనవచ్చు. “కరోనా సోకిన భారత్‌కు, కంగన సోకిన శివసేనకు వ్యాక్సిన్ లేదు” అని వర్మ ట్వీట్ చేశారు. శివసేన పాలిట కంగనా ఎంత ప్రమాదకరంగా మారిందో వర్మ పోలికే ప్రతిబింబిస్తోంది. కంగనా, మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం ఎప్పటికి సర్దుమణుగుతుందో తెలియని పరిస్థితి.