గతంలో నారప్ప సినిమా నేరుగా ఓటీటీలో రిలీజైనప్పుడు చాలా ఫీల్ అయ్యాడు వెంకటేష్. ఏకంగా అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పాడు. అదే టైమ్ లో నిర్మాత సురేష్ బాబు కూడా తెగ ఇదైపోయాడు. కట్ చేస్తే, ఇప్పుడు వెంకీ నటించిన మరో సినిమా దృశ్యం-2 కూడా నేరుగా ఓటీటీలోకే వచ్చేస్తోంది. అయితే ఈసారి మాత్రం వెంకటేష్ ఫీల్ అవ్వలేదు, అభిమానులకు సారీ కూడా చెప్పలేదు. ఇది చాలా కామన్ అన్నట్టు వ్యవహరించాడు.
“సినిమాలు తీశామా? రిలీజ్ చేశామా? అంతే.. ఎంజాయ్ చేసే వాళ్లు ఎంజాయ్ చేస్తారు. థియేటర్లో కూడా ఎన్నో సినిమాలు వచ్చాయి. మనం ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచించాలి. ఇలాంటి చిత్రాలు ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. ఎంత మంది చూస్తారు అని కాదు కానీ.. ఈ బడ్జెట్‌కు ఓటీటీ బెస్ట్ అని నిర్మాతలు అనుకున్నారేమో.”
ఇలా దృశ్యం-2 ఓటీటీ రిలీజ్ ను సమర్థించుకున్నాడు వెంకీ. అక్కడితో ఆగలేదు కూడా. ఈసారికి ఇలా సరిపెట్టుకోవాలన్నాడు. అభిమానులు హర్ట్ అయినా చేసేదేం లేదన్నట్టు స్పందించాడు.
“సినిమా చేయడం వరకే నా బాధ్యత. విడుదల విషయంలో నేను ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వను. తప్పూ ఒప్పూ అని ఏమి ఉండదు. పరిస్థితులకు తగ్గట్టుగా వెళ్లిపోవాలి. ఇంకా చాలా సినిమాలు థియేటర్లో కూడా వస్తాయి. నా అభిమానులు కాస్త హర్ట్ అవుతారేమో కానీ.. నెక్ట్స్ సినిమాలతో థియేటర్లోకి వస్తాను అని వాళ్లకు తెలుసు. అన్నింటికి ఓపిగ్గా ఉండాలి. ఈ సారి ఇలా జరిగిందంతే.”
తన సినిమాలన్నీ ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయనే బాధ ఎఫ్3తో తీరిపోతుందంటున్నాడు వెంకీ. అనీల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఎఫ్3 సినిమా కచ్చితంగా థియేటర్లలోనే రిలీజ్ అవుతుందని, అప్పటివరకు తన అభిమానులు ఓపిగ్గా ఉండాలని కోరాడు.