బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ఇంటికి ఓ యువహీరో ఆదివారం అర్ధరాత్రి వేళ ముసుగేసుకుని వెళ్లాడు. అయితే ఆ విషయం ఎలాగోలా బట్టబయలైంది. దీంతో వాళ్లిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ బాలీవుడ్ గుసగుసలాడుతోంది. ఇక ఆ వివరాల్లోకి వెళ్దాం.
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్, యువహీరో విక్కీ కౌశల్ మధ్య ఏదో కెమిస్ట్రీ నడుస్తోందనే అనుమానాలు చాలా రోజులుగా వ్యక్తమవుతున్నాయి. ఏమీ లేకున్నా….ఏదో ఉందనే అనుమానాలు వ్యక్తమయ్యే ఈ రోజుల్లో, సన్నిహితంగా మెలిగే కత్రినా, విక్కీ కౌశల్ మధ్య ఏమీ లేదంటూ ఎవరూ నమ్మలేని పరిస్థితి. ఇదిలా ఉంటే వాళ్లిద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారనే ప్రచారం వరకు వెళ్లిందంటే…అంతోఇంతో నిజం లేకుండా ఉంటుందా అనే ప్రశ్నలు తలెత్తాయి. కానీ పెళ్లి వార్తలను విక్కీ కొట్టిపడేశాడు.
విక్కీ ఎంత కాదంటున్నా….కత్రినాతో విక్కీ చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నాడని బాలీవుడ్‌లో ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. అప్పుడప్పుడు కత్రినా, విక్కీ మధ్య సత్సంబంధాలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాళ్లిద్దరి మధ్య ప్రేమ ప్రయాణం గురించి ఎక్కడో ఒక చోట తెలుస్తూనే ఉంది. ఎందుకంటే ప్రేమను దాచడం అంటే తమను తాము మోసం చేసుకోవడమే కాబట్టి.
తాజాగా వాళ్లిద్దరి ప్రేమకు సంబంధించి ఓ వ్యవహారం గుప్పుమంది. అది కూడా అర్థరాత్రి వేళ లోకమంతా గాఢ నిద్రలో చోటు చేసుకున్న ప్రణయ వ్యవహారం. విక్కీ ముసుగేసుకొని తననెవరూ గుర్తించకుండా అర్ధరాత్రి వేళ కత్రినా ఇంటికి వెళ్లాడు. తలకు క్యాప్, ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌజు ధరించిన విక్కీ.. ఆదివారం రాత్రి ముంబైలోని బాలీవుడ్ బ్యూటీ కత్రినా ఇంట్లో కనిపించాడు.
మూడో కంట పడకూడదనే ఉద్దేశంతో హడావిడిగా కారు దిగి లోపలికి వెళ్లిపోయాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ ఫొటోలు చాలవా…వాళ్లిద్దరి మధ్య పెనవేసుకున్నప్రణయ బంధం గురించి ఎంతైనా రాయడానికి?