“సంక్రాంతి సీజన్ లో మార్కెట్ పెద్దగా ఉంటుంది. 3 పెద్ద సినిమాలు ఒకేసారి వచ్చినా తట్టుకునేంత స్టామినా బాక్సాఫీస్ కు ఉంటుంది. ఏ ఒక్క సినిమా నష్టపోదు” అంటుంటారు టాలీవుడ్ నిర్మాతలు. ఇది నిజమే కావొచ్చు. కానీ ఈసారి అలాంటి పరిస్థితి ఉందా అంటే అనుమానమే. ఎందుకంటే అక్కడున్నది ఆర్ఆర్ఆర్.
ఆర్ఆర్ఆర్ సినిమా కేవలం మల్టీస్టారర్ మూవీ మాత్రమే కాదు. ఇండియన్ స్క్రీన్ పైనే అతిభారీ బడ్జెట్ సినిమా. దీని బడ్జెట్ అక్షరాలా 400 కోట్ల రూపాయలు. ఇలాంటి సినిమాకు, ఇప్పుడున్న పరిస్థితుల్లో భారీ వసూళ్లు రావాలంటే బరిలో ఇంకో పెద్ద సినిమా ఉండకూడదు. దాదాపు 90శాతం థియేటర్లు దీనికే కేటాయించాలి. పైగా మొదటి వారం రోజులు టిక్కెట్ రేట్లను పెంచుకునే వెసులుబాటు ఉండాలి.
థియేటర్ల సంఖ్య, ఆక్యుపెన్సీ, టిక్కెట్ రేట్ల సంగతి పక్కనపెడితే.. అసలు సంక్రాంతి బరి నుంచి ఎవరు తప్పుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే, రాజమౌళి సినిమా కంటే ముందే.. మహేష్, పవన్ కల్యాణ్, ప్రభాస్.. తమ సినిమాల్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
ముందుగా మహేష్ విషయానికొద్దాం.. పైకి కనిపించడు కానీ, మహేష్ భలే మొండి. తను ఒక రిలీజ్ డేట్ అనుకుంటే, ఆ టైమ్ లో ఏ సినిమా ఉన్నా వెనక్కి తగ్గడు. మహేష్ సినిమాలకు సంబంధించి రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన తర్వాత వెనక్కి తగ్గిన సందర్భాలు చాలా తక్కువ. దానికి కారణం మహేష్ వ్యవహార శైలే అంటారు తెలిసినవాళ్లు. కానీ ఈసారి మహేష్ కాస్త తగ్గాడు. దానికి కారణం అతడు తన నెక్ట్స్ మూవీని రాజమౌళి దర్శకత్వంలోనే చేయాల్సి ఉంది. అలా సర్కారువారి పాట సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకొని, ఉగాది రిలీజ్ కోసం చూస్తోంది.
ఇక మిగిలిన సినిమాలు భీమ్లానాయక్, రాధేశ్యామ్. వీటికి సంబంధించి కూడా ఆల్రెడీ డేట్స్ ఇచ్చేశారు. భీమ్లా నాయక్ యూనిట్ అయితే తాము సంక్రాంతికి వచ్చేది పక్కా అంటూ ఇప్పటికే ఒకటికి రెండు సార్లు ప్రకటించుకుంది. కానీ ఆ సినిమానే బరి నుంచి తప్పుకునేలా ఉందని సమాచారం. ఇప్పటికే బాగా ఆలస్యమైన రాధేశ్యామ్ ను మాత్రం సంక్రాంతి బరి నుంచి తప్పించడం లేదు. పైగా ఇది పాన్ ఇండియా మూవీ కావడంతో తప్పించడం చాలా కష్టం.
అలా ఈసారి సంక్రాంతికి ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ రూపంలో 2 పాన్ ఇండియా సినిమాలు పోటీపడబోతున్నాయి. నిజానికి ఆర్ఆర్ఆర్ ను జనవరి 12కు అనుకున్నారు. కానీ రాధేశ్యామ్ తప్పుకోవడం లేదని క్లారిటీ వచ్చిన తర్వాత, వీళ్లు 7వ తేదీకి షిఫ్ట్ అయ్యారు.