Advertisement

Advertisement


Home > Movies - Movie News

నాగబాబు రాజకీయాల నుంచి తప్పుకున్నట్టేనా..?

నాగబాబు రాజకీయాల నుంచి తప్పుకున్నట్టేనా..?

ఇప్పటివరకూ మనం సీరియస్ పొలిటీషియన్లు, సీజనల్ పొలిటీషియన్ల గురించే విన్నాం. కానీ నాగబాబు లాంటివారిని చూస్తే అకేషనల్ పొటిలీషియన్ అనాలేమో. ఆయనకు ప్రజా సేవ చేయాలని ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వచ్చేస్తారు, మూడ్ మారిపోతే ఇంటికెళ్లి తలుపేసుకుంటారు. 

ప్రజారాజ్యం టైమ్ కంటే.. జనసేన హయాంలోనే బాబుకి బాగా జ్ఞానోదయం అయినట్టుంది. అందుకే ఆయన ప్రత్యక్ష రాజకీయాలకి, ట్విట్టర్ విమర్శలకి పూర్తిగా దూరమైపోతున్నారు. ఎటొచ్చి ఈ దఫా చిరంజీవి రంగంలోకి దిగే అవకాశం ఉంది కానీ, నాగబాబు మాత్రం ఇంటికే పరిమితం అవుతారని అంటున్నారు.

మెగా బ్రదర్ అలకబూనారా..?

ప్రజారాజ్యం సమయంలో మెగాస్టార్ అభిమానులందర్నీ ఏకం చేసే బాధ్యత తీసుకున్నారు నాగబాబు. ప్రతి నియోజకవర్గంలోనూ అభిమానులతో కలసి మీటింగ్ లు పెట్టారు. పార్టీ ప్రకటన వచ్చేనాటికి నాగబాబు టూర్లు పూర్తి చేసుకుని అంతా సిద్ధం చేశారు. పార్టీలో కీలకంగా వ్యవహరించారు. అయితే పార్టీ పెట్టాక నాగబాబు కాస్త సైడ్ అయ్యారు, అల్లు అరవింద్ హవా పెరిగింది. 

చివరకు ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసే సమయంలో కూడా అరవింద్ మాటే నెగ్గిందని అంటారు. దీంతో నాగబాబుకి మొదటిసారి రాజకీయాలపై విరక్తి వచ్చింది. ఆ తర్వాత జనసేనలోకి కూడా నాగబాబు లేట్ ఎంట్రీ ఇచ్చారు. ఈసారి తమ్ముడి పక్కన కాస్త హడావిడి ఎక్కువ చేశారు. అప్పుడు అన్నపై ఈగవాలనీయకుండా చేసిన నాగబాబు, ఇప్పుడు తమ్ముడు పవన్ కల్యాణ్ ని ఎవరేమన్నా అంతెత్తున ఎగిరిపడేవారు. ట్వీట్లతో చెలరేగిపోయేవారు. 

పార్టీ ఓడిపోయినా, తమ్ముడు ఓడిపోయినా, చివరకు తాను ఓడిపోయినా కూడా పెద్దగా బాధపడని నాగబాబు, తాను వేసిన ఓ ట్వీట్ పై తమ్ముడు రియాక్ట్ అయ్యే సరికి నొచ్చుకున్నారు. అప్పట్నుంచి సైలెంట్ అయ్యారు. జనసేనలో తనకంటే నాదెండ్ల మనోహర్ కే ఎక్కువ ప్రయారిటీ ఉందనే విషయం గ్రహించి పార్టీకి దూరం జరిగారు.

ప్రస్తుత పరిస్థితి ఏంటి..?

పార్టీ మూసేసిన చిరంజీవి అటు హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నారు, ఇటు కొత్త పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ కూడా సినిమాలతో బిజీగా ఉన్నారు. రాగా పోగా.. రాజకీయాలంటూ అత్యుత్సాహం ప్రదర్శించిన నాగబాబే ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. కనీసం నిర్మాతగా సినిమాలు చేద్దామన్నా కూడా కుదరని పరిస్థితి. 

అటు అన్నయ్యకి సొంత బ్యానర్ ఉంది, ఇటు తమ్ముడు పూర్తిగా కమర్షియల్. ఎవరూ కాల్షీట్లు ఇవ్వరు. జబర్దస్త్ కూడా లేకపోవడంతో ఇప్పుడు నాగబాబు మీడియాకి కూడా దూరమయ్యారు. అన్నదమ్ముల కోసం అంతలా కష్టపడ్డ మెగా బ్రదర్, ఇప్పుడు ఒంటరివారయ్యారు. 

సొంత యూట్యూబ్ ఛానెల్ తో కాలక్షేపం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల సీజన్ నాటికి ఈ అకేషనల్ పొలిటీషియన్ మరోసారి రాజకీయ ముఖచిత్రంపైకి వస్తారు. కాస్త హంగామా కూడా చేస్తారు. అందులో ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. కాకపోతే ఈసారి నాగబాబుకు జనసేనలో ఏ మేరకు ప్రాధాన్యం దక్కుతుందనేది తేలాల్సిన అంశం. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?