సినీ రచయిత వైరముత్తుపై ప్రముఖ తమిళ చానల్ ఉద్యోగిని తీవ్ర ఆరోపణలు చేశారు. తనను చెన్నైలోని ఓ ప్రాంతానికి రావాలని వేధించేవాడని ఆమె తన ఆవేదనను ప్రముఖ గాయని చిన్మయితో పంచుకున్నారు. గాయని చిన్మయికి తన ఆవేదనను సదరు చానల్ బాధితురాలు పంపడం, దాన్ని సోషల్ మీడియా వేదికగా ఆమె బహిర్గతం చేయడం , అది వైరల్ కావడం అంతా చకాచకా జరిగిపోయాయి.
రచయిత వైరముత్తుపై గాయని లైంగిక ఆరోపణలు చేయడం ఇదే ప్రథమం కాదు. గతంలో ‘మీటూ’ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పుడు చిన్మయి తొలిసారి వైరముత్తుపై ఆరోపణలు చేశారు. ఓ కార్యక్రమానికి విదేశానికి వెళ్లినప్పుడు తనను గదికి రమ్మని వైరముత్తు మరో మహిళతో చెప్పి పంపాడని ఆరోపణలు చేయడం అప్పట్లో తీవ్ర సంచలనమైంది.
తాజాగా వైరముత్తుపై ఆరోపణలు చేస్తూ ఓ మహిళ తనకు పంపిన సందేశాలను ప్రముఖ గాయని చిన్మయి బయట పెట్టారు. అయితే తన పేరు, వ్యక్తిగత వివరాలను బయటపెట్టొద్దని సదరు మహిళ తనను కోరినట్టు చిన్మయి తెలిపారు. ఆ వివరాలతో కూడిన స్క్రీన్‌షాట్స్‌ను గాయని సోషల్‌మీడియాలో పంచుకున్నారు.
‘దాదాపు రెండేళ్లు పూర్తయింది.. అయినా ఇంకా ‘మీటూ’ ఆరోపణల పరంపర కొనసాగుతోంది. ఈ మహిళ తనకు ఎదురైన వేధింపులు నాకు చెప్పడానికి రెండేళ్ల సమయం పట్టింది. కుటుంబ సభ్యుల మద్దతు లేకపోవడం వల్ల ఇన్నాళ్లూ మౌనంగా ఉంది.
ఆమె నాకు చాలా కాలం నుంచి తెలుసు. అయినా.. ఇలాంటి సమస్యల్ని మన సమాజం, ప్రజలు పట్టించుకోరు కదా?’ అని చిన్మయి అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే సదరు బాధితురాలు చిన్మయికి పంపిన సందేశాల్లో ఏముందో తెలుసుకుందాం.
‘మీటూ’ ఉద్యమం నుంచి మీకు (చిన్మయిని ఉద్దేశిస్తూ) ఈ విషయం చెప్పాలనుకుంటున్నా. కానీ మా అత్తామామలు అంగీకరించకపోవడంతో మౌనాన్ని ఆశ్రయించాను. నేను కాలేజీ విద్యార్థినిగా ఓ పుస్తకం ఆవిష్కరణకు వెళ్లా. అక్కడ వైరముత్తు ఆటోగ్రాఫ్ తీసుకున్నా.
ఆయన ఫోన్ నెంబరు కూడా రాశాడు. చిన్న వయసు కావడంతో నెంబరు ఎందుకిచ్చారో అర్థం చేసుకోలేకపోయా. దీంతో నేను పట్టించుకోలేదు. ఆ తర్వాత కొన్నేళ్లకు ఓ ప్రముఖ తమిళ చానల్‌లో ఉద్యోగిగా చేరాను. విధి నిర్వహణలో ఉండగా వైరముత్తు నన్ను కలిశాడు. నా ఫోన్ నెంబరు అడిగాడు. అయితే అతను ఫోన్ చేసి వేధిస్తాడని అసలు ఊహించలేదు.
నాకు తరచూ ఫోన్ చేస్తూ, సందేశాలు పంపుతూ వేధిస్తూనే ఉన్నాడు. అతని ఛేష్టలకు షాక్ అయ్యా. మౌంట్ రోడ్డు దగ్గరున్న ఓ చోటుకు రమ్మని పిలుస్తూనే ఉన్నాడు. నేను పట్టించుకోవడం మానేశా.
గంట వ్యవధిలో 50 సార్లు ఫోన్ చేసేవాడు. ఈ విషయాన్ని చానల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాను. ఆ తర్వాత మా చానల్ యాజమాన్యం కల్పించుకుని ఆయన భార్య దృష్టికి తీసుకెళ్లింది. ఆమె జోక్యం చేసుకుని మొగుడి నోరు మూయించింది’ అని బాధిత మహిళ తన గోడు వెల్లడించారు.
చిన్మయి ఈ సందేశాలను సోషల్ మీడియాలో పెట్టడంతో మరోసారి వైరముత్తు వ్యవహారంపై చర్చ సాగుతోంది. ఎక్కువ మంది నెటిజన్లు అతని వైఖరిపై మండిపడుతున్నారు. ఇదేం రోగమంటూ కామెంట్స్ పెడుతున్నారు.