cloudfront

Advertisement


Home > Movies - Movie News

'యాత్ర' డైరెక్టర్ దమ్మున్నోడు

'యాత్ర' డైరెక్టర్ దమ్మున్నోడు

తను నమ్మిన ఓ విషయాన్ని బలంగా చెప్పడానికి సినిమా అనే ఓ 'మార్గాన్ని' ఎంచుకున్నాడు దర్శకుడు మహి వి రాఘవ్‌. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పట్ల అమితమైన అభిమానం, అపారమైన గౌరవం వున్న మహి వి రాఘవ్‌, 'యాత్ర' సినిమా తెరకెక్కిస్తున్న సమయంలోనే కొంత వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు.. వైఎస్సార్‌ హేటర్స్‌ నుంచి. కానీ, ఎక్కడా మహి వెనక్కి తగ్గలేదు.

'ఇది సినిమా మాత్రమేకాదు, ఇదొక చరిత్ర..' అంటూ చెబుతూ వచ్చిన మహి, అలాగని ఎక్కడా ఇతరుల్ని కించపర్చేలా వ్యవహరించలేదు. తెలుగు జాతికి స్వర్గీయ ఎన్టీఆర్‌, స్వర్గీయ వైఎస్సార్‌ ఎంతో మేలుచేశారని చెప్తూ వచ్చారాయన. చంద్రబాబు అంటే వ్యతిరేకత లేదనీ, చిరంజీవిని అభిమానిస్తాననీ చెబుతూ వచ్చినా, హేటర్స్‌ మాత్రం తగ్గలేదు. 'యాత్ర' విడుదలకు దగ్గరయ్యేకొద్దీ హేటర్స్‌, మహిపై విద్వేషాన్ని పెంచుకున్నారు. 'యాత్ర' విడుదలయ్యాక అది మరింత పీక్స్‌కి చేరుకుంది.

ఈ నేపథ్యంలోనే మహి వి రాఘవ నుంచి ఓ ప్రకటన బయటకొచ్చింది.. అదీ సోషల్‌ మీడియా ద్వారా. తనను అభిమానిస్తోన్నవారందరికీ, తనను అభినందిస్తోన్నవారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూనే, హేటర్స్‌కి గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. 'నేను నమ్మాను.. అదే చూపించాను.. రాజశేఖర్‌రెడ్డికి నేను ఇవ్వగలిగిన గౌరవం ఈ సినిమా ద్వారా ఇచ్చాననే అనుకుంటున్నాను..' అంటూ ఉద్వేగంగా పేర్కొన్నాడు మహి వి రాఘవ్‌.

'క్రిటిసిజమ్‌ని గౌరవిస్తాను. కానీ, నా నమ్మకాలు, నా చర్యలను తప్పుపట్టేవారి ముందు తలవంచే ప్రసక్తేలేదు..' అని మహి వి రాఘవ్‌ తేల్చిచెప్పిన వైనం ఇప్పుడు అంతటా చర్చనీయాంశమవుతోంది. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన ప్రజా ప్రస్థానం ఓ చరిత్ర. తెలుగునాట రాజకీయాల్లో అదొక సంచలనం.

తెలుగు ప్రజలతో ఆయన ఆ పాదయాత్ర ద్వారా మమేకమైన తీరు ఓ అద్భుతం. ఆ చారిత్రక ఘట్టాన్ని, ఆ మహనీయుడి ఆలోచనల్నీ అద్భుతంగా తెరకెక్కించేందుకు ప్రయత్నించిన మహి వి రాఘవని అభినందించి తీరాల్సిందే. సినిమా నచ్చడం, నచ్చకపోవడం అన్నది వేరే విషయం.

కానీ, వైఎస్సార్‌ అభిమాని గనుక.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టాన్ని 'యాత్ర' సినిమాగా తెరకెక్కించాడు గనుక, మహి వి రాఘవ్‌ని ద్వేషిస్తామని ఎవరైనా అంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకొకటుండదు. 

'గెలవడం అసాధ్యం' అనే లెవల్‌ నుంచి వైఎస్‌ఆర్‌ ఎలా గెలిచారు

డబ్బుంటేనే గెలిచేస్తారా? ఈ ఘనత నిస్సందేహంగా చంద్రబాబుదే!