దశాబ్దాల తర్వాత మెగాఫోన్ చేతిలో పడుతున్నట్టుగా ఉన్నారు ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్. పాపులర్ నవలా రచయిత అయిన యండమూరి గతంలో మెగాస్టార్ చిరంజీవినే హీరోగా పెట్టి ఒక సినిమాను రూపొందించాడు. తను రాసిన స్టువర్ట్ పురం పోలిస్ స్టేషన్ నవల ఆధారంగా అదే టైటిల్ తో సినిమాను రూపొందించారు యండమూరి.
అయితే ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. యండమూరి రాసిన బోలెడు నవలలు సినిమాలుగా రూపొందినా, ఆ తర్వాత పెద్దగా దర్శకత్వం జోలికి వెళ్లలేదు ఆయన. వేరే దర్శకులు ఆయన నవలలకు తగు న్యాయం చేస్తూ హిట్ సినిమాలను రూపొందించారు.
దర్శకత్వం విషయంలో తను ఫెయిల్ అన్నట్టుగా పలుసార్లు చెప్పుకున్నారు యండమూరి. అయితే ఇప్పుడు ఆయన మరోసారి దర్శకత్వం వహిస్తున్నారు. విశేషం ఏమిటంటే.. ఇది కూడా ఆయన పాత నవల ఒక దాని టైటిల్ తోనే రూపొందుతోంది. అతడు ఆమె ప్రియుడు పేరుతో గతంలో యండమూరి ఒక నవల రాశారు. ఇప్పుడు అదే టైటిల్ తో ఆయన ఒక సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రారంభోత్సవానికి సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డితో పాటు, ఆ మధ్య యండమూరిని దూషించిన నటుడు నాగబాబు కూడా హాజరయ్యారు. తన పాత నవలనే ఈ తరానికి తగినట్టుగా రూపొందిస్తున్నారో లేక పాత టైటిల్ తో పూర్తి కొత్త కథతో వస్తున్నారో ఆ సీనియర్ రచయిత.