కొన్నాళ్ల కిందటి సంగతి. ఊహించని విధంగా బ్రో సినిమా పవన్ సినిమాల లిస్ట్ లోకి వచ్చి చేరింది. తెరవెనక అన్నీ తానై త్రివిక్రమ్ ఆ ప్రాజెక్టును ముందుకు నడిపించారు. పవన్ చేస్తున్న మిగతా సినిమాల్ని పక్కనపెట్టి మరీ బ్రో సినిమాను ముందుకు జరిపారు.
అది 'జీ గ్రూప్' సినిమా. బ్రో సినిమా కథ వాళ్లదే. దీంతో తెరపై పీపుల్ మీడియా పేరు కనిపించినప్పటికీ, తెరవెనక మాత్రం మేజర్ ఫండింగ్ జీ గ్రూప్ దే. ఇప్పుడీ సంస్థ మరోసారి ఇదే తరహాలో సినిమా చేయాలనే ఆలోచన చేస్తోంది.
గతంలోలా త్రివిక్రమ్ ను మధ్యలో పెట్టి, పవన్ కల్యాణ్ తో సినిమా చేయాలనేది ఈ గ్రూప్ ఆలోచన. దీనికి సంబంధించి ఆల్రెడీ చర్చలు మొదలయ్యాయి. ఈసారి ఓ రీమేక్ కథతో పాటు ఫ్రెష్ స్టోరీ కూడా సిద్ధంగా ఉంది. పవన్ దేనికి ఓకే అంటే దాంతోనే ముందుకెళ్లాలనేది ప్లాన్.
ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. త్రివిక్రమ్ ఎలాగూ ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కాబట్టి, కుదిరితే ఆయన దర్శకత్వంలోనే ఆ సినిమా చేయాలనే ప్రతిపాదనను కూడా ముందుపెట్టింది.
ప్రస్తుతం పవన్ సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆయన మళ్లీ సెట్స్ పైకి రావాలనుకుంటే ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. మధ్యలో త్రివిక్రమ్ సినిమా చేరిందంటే, పైన చెప్పుకున్న వాటిలో ఏదో ఒకటి మరింత ఆలస్యం కావడం ఖాయం.