Advertisement


Home > Movies - Press Releases
కళ్యాణ గీతం ఖరీదు 60 లక్షలు

ఈ రోజులో పెళ్లి పాటలు, సంగీత్ వ్యవహారాలు అంటే లక్షలతో పనే. అలాంటివి సినిమాల్లో చూపించాలన్నా కూడా కాస్త ఖరీదైన వ్యవహారమే. ఛలో సినిమాతో హిట్ కొట్టి... మళ్లీ తన స్వంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై @నర్తనశాల అంటూ వెరైటీ సినిమా చేస్తున్నాడు హీరో నాగశౌర్య. ఈ సినిమా అస్సలు గ్యాప్ లేకుండా షూట్ చేసుకుంటూ దాదాపు 80శాతం వర్క్ పూర్తిచేసారు. రామోజీ ఫిలింసిటీలో, శంషాబాద్ దగ్గర పురాతన ఆలయంలో, ఇంకా మరికొన్ని లోకల్ స్పాట్స్ లో సినిమాను ఫినిష్ చేసారు.

అయితే సినిమాలోకి కీలక సంగీత్ పాట కోసం మాత్రం కాస్త భారీగా సెట్ వేసారు. అన్నపూర్ణలో దాదాపు నెలరోజుల పాటు వర్క్ చేయించి భారీ సెట్ వేయడం విశేషం. ఈ సెట్ కోసం 60 లక్షలకు పైగా ఖర్చు చేసారు. అదికాక చిత్రీకరణ కోసం బోలెడు మంది జూనియర్ ఆర్టిస్టులను ఎంగేజ్ చేసారు. 

రచయిత కులశేఖర్ బావమరిచి శ్రీనివాస్ చక్రవర్తి ఈ సినిమాతో తొలిసారి డైరక్టర్ గా మారుతున్నారు. సినిమాలో మిగిలిన టాకీని త్వరగా పూర్తిచేసి, మిగిలిన పాటలను షూట్ చేసేందుకు ఇటలీ వెళ్తున్నారు. ఛలో సినిమాను మీడియం బడ్జెట్ లో ఫినిష్ చేసిన యూనిట్ ఈ సినిమా కోసం మాత్రం కాస్త భారీగానే ఖర్చు చేస్తుండడం విశేషం.

సినిమాను నైజాం ఏరియా పంపిణీకి ఆసియన్ సునీల్ తీసుకుని, మూడుకోట్ల అడ్వాన్స్ ఇవ్వడం విశేషమని నిర్మాత శంకర్ ప్రసాద్ తెలిపారు. అన్నిపనులు పూర్తి చేసుకుని ఆగస్టు 27న విడుదలకు రెడీ అవుతున్నామని ఆయన వెల్లడించారు. తొలి సినిమా ఇచ్చిన ప్రోత్సాహంతో రెండు మంచి స్క్రిప్ట్ లు లాక్ చేసామని, అందులో ఒకటి నర్తనశాల అని, ఇది పూర్తయిన తరువాత బయట నిర్మాతలకు ఓ సినిమా చేసి, ఆ పైన మళ్లీ స్వంత బ్యానర్ లో రెండో స్క్రిప్ట్ ను తెరకెక్కిస్తామన్నారు.

శౌర్య బయట బ్యానర్లలో సినిమా చేసినపుడు తమ స్వంత బ్యానర్ పై వేరే హీరోలతో సినిమా చేసే ఆలోచన వుందన్నారు. అన్నపూర్ణలో వేసిన సంగీత్ సెట్ ను పలువురు సినిమా ప్రముఖులు చూసి అప్రిసియేట్ చేయడం ఆనందం కలిగించిందన్నారు.