Advertisement


Home > Movies - Press Releases
కష్టపడి, ఇష్టపడి తీసిన సినిమా 'వైశాఖం'

'చంటిగాడు', 'గుండమ్మగారి మనవడు', 'లవ్‌లీ' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను రూపొందించి మహిళా దర్శకురాలుగా తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు  లేడీ డైరెక్టర్‌ జయ బి. తాజాగా హరీష్‌, అవంతిక జంటగా ఆర్‌.జె.సినిమాస్‌ బేనర్‌పై బి.ఎ.రాజు నిర్మాతగా జయ బి. రూపొందించిన లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'వైశాఖం'. అపార్ట్‌మెంట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో క్యూట్‌ లవ్‌స్టోరీతోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌ని కూడా సమపాళ్ళలో ఎలివేట్‌ చేస్తూ రూపొందిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూలై 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి.తో జరిపిన ఇంటర్వ్యూ.

'వైశాఖం' జర్నీ ఎలా వుంది?

- ఇది చాలా టఫ్‌ జర్నీ అనే చెప్పాలి. చాలా అప్‌ అండ్‌ డౌన్స్‌ చూశాను. నేను అనుకున్నది అనుకున్నట్టు రావాలంటే చాలా విషయాలు కలవాలి. అలా జరగడం కోసం చాలా కష్టపడ్డాను. ఉదాహరణకి కజక్‌స్తాన్‌ టూరిస్ట్‌గా వెళ్ళడమే కష్టం. అలాంటిది 23 మంది యూనిట్‌తో 400 కేజీల లగేజ్‌తో 15 రోజులు ట్రావెల్‌ చేసి సాంగ్స్‌ తీశానంటే ఎలా వుంటుందో ఊహించుకోండి. కేవలం ప్రాసెస్‌ అయి పాస్‌పోర్టులు రావడానికే మూడు నెలలు పైన పట్టింది. అక్కడ షూట్‌ చెయ్యడం చాలా కష్టం. మూడు రోజులకోసారి పాస్‌పోర్ట్‌ స్టాంపింగ్‌ చేయించుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే మూడునెలలు జైలు తప్పదు.

ఈనెల 21న సినిమా రిలీజ్‌ అవుతోంది. మీకెలా అనిపిస్తోంది?

- గత రెండు నెలలుగా సినిమా ఎప్పుడు రిలీజ్‌ అని అందరూ ఎంతో ఆసక్తిగా అడుగుతున్నారు. ఫైనల్‌గా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అయింది. మీలాగే నేను కూడా సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా? ప్రేక్షకుల మధ్యలో కూర్చొని ఎప్పుడు చూడాలా? అనే ఆతృత నాక్కూడా వుంది. దానికి కారణం వుంది. గత సంవత్సరంగా ఈ సినిమాతో నేను ట్రావెల్‌ చేశాను.

హీరో, హీరోయిన్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఎలా వుంటుంది?

- సినిమాలో నటించిన ఆర్టిస్టులంతా ఎంతో బాగా చేశారు. ముఖ్యంగా హీరో, హీరోయిన్లు. చాలా మంచి పేరు తెచ్చుకుంటారు. కొత్త హీరో, హీరోయిన్‌లను చూస్తున్నామన్న ఫీలింగ్‌ మీకు ఎక్కడా రాదు.

'వైశాఖం' ఆడియన్స్‌కి ఎలాంటి అనుభూతిని కలిగిస్తుంది?

- ఒక సినిమా చూస్తున్నామన్న ఫీలింగ్‌ ఆడియన్స్‌ ఒక స్టేజ్‌లో మర్చిపోతారు. జీవితాన్ని, రియల్‌ లైఫ్‌ని ఫాలో అవుతున్నాం అనుకుంటారు. క్యారెక్టర్స్‌తో పాటు మీరూ ట్రావెల్‌ అవుతారు. అది మాత్రం నేను ఖచ్ఛితంగా చెప్పగలను. ఎప్పుడూ కొత్తవారిని ఇంట్రడ్యూస్‌ చెయ్యడానికి ఇంట్రెస్ట్‌ చూపిస్తాను. ఈ సినిమాలో కూడా కొత్తవారు వున్నారు. ఫైనల్‌గా సినిమా బాగా వచ్చింది. బాగా వచ్చిందనేది నేను చెప్పడం కాదు. పాటలు చూసినవారు, సినిమాను చూసిన సెన్సార్‌ వారు చెప్పారు.  ఇది మంచి ఫ్యామిలీ సినిమా. యు ఇవ్వమని అడిగాము. మీ మిగతా సినిమాలకన్నా ఈ సినిమాలో రొమాన్స్‌ ఎక్కువ దట్టించారు. కాబట్టి యు/ఎ ఇవ్వాల్సిందేనని నవ్వుతూ చెప్పారు. అంటే ఈ సినిమాలో ఒక సాంగ్‌ చాలా రొమాంటిక్‌గా వుంటుంది. కొన్ని రొమాంటిక్‌ సీన్స్‌ కూడా వుంటాయి. ఇది బేసిక్‌గా ఇంటెన్స్‌ లవ్‌స్టోరీ. సినిమాలో సింగిల్‌ కట్‌ కూడా చెప్పలేదు. మీరు తీసిన సినిమాని ఇలాగే జనం చూడాలి. నేను కట్‌ చేసేది ఏమీ లేదు అన్నారు. దాన్ని బట్టి సినిమా ఏ రేంజ్‌లో వుందో అర్థం చేసుకోవచ్చు.

మీ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా బడ్జెట్‌ ఎక్కువైంది?

- ఇది వాస్తవం. ఈసారి బడ్జెట్‌ ఎక్కువైంది. ఎందుకంటే ఇది ఛాలెంజింగ్‌గా తీసుకున్న సినిమా. ప్రేక్షకులు, ఇండస్ట్రీ 'వైశాఖం' చాలా బాగుంది, చాలా గ్రాండ్‌గా వుంది అని చెప్పుకోవాలి అనే ఇంటెన్షన్‌తో తీసిన సినిమా.

అపార్ట్‌మెంట్‌ బ్యాక్‌డ్రాప్‌లో కథ చెప్పడానికి రీజన్‌ ఏదైనా వుందా?

- ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు. అన్నీ మినీ ఫ్యామిలీసే. పల్లెటూళ్ళో కూడా అపార్ట్‌మెంట్‌ కల్చర్‌ వచ్చింది. ఇండివిడ్యువల్‌ ఇళ్ళు మెయిన్‌టెయిన్‌ చేసే కెపాసిటీ తగ్గింది. అందరూ అపార్ట్‌మెంట్స్‌నే ప్రిఫర్‌ చేస్తున్నారు. ఈ అపార్ట్‌మెంట్స్‌లో రకరకాల మనుషులు వుంటారు. వాళ్ళ మధ్య వచ్చే క్లాషెస్‌, వాళ్ళ మధ్య వుండే రిలేషన్స్‌షిప్స్‌ అనేవి ఎలా వుంటాయి అనేది ఒక రియాలిటీ. అంటే ఒక యదార్థ గాధని ఈ సినిమా ద్వారా చెప్పదలుచుకున్నాను.

ఎడిటింగ్‌ కూడా మీరే చెయ్యడానికి కారణం?

- 'లవ్‌లీ' నేనే చేశాను, ఈ సినిమా కూడా నేనే చేశాను. ఇది నా కథ, నా స్క్రీన్‌ప్లే. ఇందులో మ్యాగ్జిమమ్‌ నేను రాసిన మాటలే వుంటాయి. క్యారెక్టరైజేషన్‌, ఫ్రేమింగ్‌, కెమెరా వర్క్‌ అన్నీ నా చేతుల్లో నుంచి వెళ్ళినవి. సినిమా ఎలా వుండాలి అనేది నాకు తెలుసు. దానికి అనుగుణంగా నేను ఎడిటింగ్‌ చేసుకునేటపుడు నాకు సౌకర్యంగా వుంటుంది.

దర్శకుడు, నిర్మాత భారాభర్తల్లాంటివారు అంటుంటారు. మీరు రియల్‌గా భార్యాభర్తలు. ఈ కోఆపరేషన్‌ ఎలా వుంది?

- సినిమా విషయంలో ఆయనెప్పుడూ కోఆపరేటివ్‌గానే వుంటారు. బడ్జెట్‌ విషయంలో ఎక్కువైపోతుందని నేనే బాధపడతాను. కానీ, ఆయన మాత్రం సినిమా బాగా రావాలి, ఎంత ఖర్చయినా ఫర్వాలేదు అంటారు. మరో ప్రొడ్యూసర్‌ అయితే పాటల కోసం కజక్‌స్తాన్‌ వెళ్తానంటే ఒప్పుకునేవారు కాదు. ఇక్కడే తియ్యమనేవారు.