cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: 'ఎఫ్.సి.యు.కె'

సినిమా రివ్యూ: 'ఎఫ్.సి.యు.కె'

చిత్రం: ఎఫ్.సి.యు.కె
రేటింగ్‍: 1/5
తారాగణం: రాం కార్తిక్, అమ్ము అభిరామి, జగపతిబాబు, బ్రహ్మాజి, శ్రీలక్ష్మి, కృష్ణభగవాన్, ఆలి, మాస్టర్ భరత్ తదితరులు.
ఎడిటింగ్‍: మద్దాలి కిషోర్
సంగీతం: భీంస్
ఛాయాగ్రహణం: జి. శివ
నిర్మాత: దామోదర్ ప్రసాద్
రచన, దర్శకత్వం: విద్యాసాగర్ రాజు
విడుదల తేదీ: ఫిబ్రవరి 12, 2021

"అట్ట చూసి పుస్తకంలో ఏముందో ఊహించకు" అంటారు. అలాగే "పోస్టర్ చూసి థియేటర్లోకి దూరకూడదు", అనే జ్ఞానోదయాన్ని  కలిగించే చిత్రరాజమే "ఎఫ్.సి.యు.కె" (ఫాదర్-చిట్టి-ఉమ-కార్తిక్). హీరో హీరోయిన్లు కొత్త మొహాలే అయినా జగపతిబాబు, బ్రహ్మాజి, కృష్ణభగవాన్, ఆలి, అలనాటి శ్రీలక్ష్మి పేర్లు వినపడే సరికి కాస్త చూడదగ్గ సినిమాయే అయ్యుంటుందని వెళ్లిన వాళ్లకి పిచ్చెక్కించి సగంలోని బయటికి తన్నేసింది. ఇక వృత్తిపరంగా సమీక్షలు రాసేవాళ్లకి తప్పదు కాబట్టి ఆ రౌరవ నరకాన్ని భరించడం తప్పదు.  కడ్రాయరుతో పరుగెత్తే హీరో గారి మీద సినిమా ఓపెన్ అవుతుంది. అలా దిశమొలతో ఎందుకు పరుగెడుతున్నాడో తెలుసుకోవాలంటే అతని ఫ్లాష్ బ్యాక్ తెలుసుకోవాలి అనే వాయిసోవర్ వినపడుతుంది.

ఆ కథేంటంటే ...ఉమ అనే ఒకమ్మాయి పబ్బులో తన స్నేహితురాలి బలవంతం మీద ఐదారు షాట్లు తాగేసి బాత్రూం కి వెళ్తుంది. అదే టైములో కార్తీక్ అనబడే మన హీరో గారు కూడా యూరినల్స్ లోకి వెళ్లి ఏదో పాట పాడుతుంటూ "పాట" పాడతాడు. ఆ పాట ఆ గోడ పక్కనే లేడీస్ టాయలెట్లో "పాట" పాడుతున్న హీరోయిన్ కి వినిపించి గొంతు కలుపుతుంది. తర్వాత బయటికొచ్చి జనం మధ్యలో ఇద్దరూ అనుకోకుండా హత్తుకోవాల్సి వస్తుంది..మందు మత్తులో ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటూ ఆ హగ్గుని ఎంజాయ్ చేసుకుంటారు. కానీ ఒకరి మొహాలు ఒకరు చూసుకోరు..

ఇలా టేకాఫ్ అయిన కథకి నెక్స్ట్ సీనులో ఆ హీరోయిన్ ఒక బాధ్యతాయుతమైన డాక్టరని ప్రేక్షకులకి తెలుస్తుంది. ఎంత బాధ్యతాయుతమంటే...తన హాస్పిటల్ కి వర్జిన్ టెస్ట్ చేయించడానికి తన గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొచ్చిన ఒకతన్ని నిలబెట్టి హాస్పిటల్లో అందరికీ వినపడేలా క్లాస్ పీకుతుంది. ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని దానికి చిల్లు పెట్టి కన్నెపొర చిరగడానికి, వర్జినిటీకి సంబంధం లేదని ఒక సొషల్ అవేర్నెస్ మెసేజ్ ని డిమాన్స్ట్రేట్ చేసి మరీ ఇస్తుంది.

కొంత సేపటికి జగపతి బాబు కండోంస్ కంపెనీ ఓనర్ గా ఎంట్రీ ఇస్తాడు. అతడొక 60 ఏళ్ల ప్లేబాయ్. మన హీరోగారి తండ్రి. కోర్టు బోనులో నిలబడి టీవీల్లో కండొంస్ యాడ్స్ వల్ల ప్రయోజనాలు చెప్పి కేసు గెలవడంతో పాటు జడ్జి గారైన జయలలితగారి మనసు కూడా గెలుచుకుంటాడు. ఆ సీన్ కూడా ఒక సోషల్ అవేర్నెస్ క్లాసే. ఇంకో సీనులో హీరో గారు బహిస్టులో ఉన్న హీరోయిన్ కి వర్షంలో తడుచుకుంటూ వెళ్లి స్యానిటరీ నేప్కిన్స్ తీసుకొచ్చి ఇచ్చి హీరోయిన్ మనసు గెలుచుకుంటాడు. ఇలా అయిందానికి, కాని దానికి ఒకరి మనసుల్ని ఒకరు గెలిచేసుకుంటూ ఉంటారు చాలా తేలిగ్గా.

తన భర్తకున్న అతి కాముకత వల్ల విడిపోవాలని నిర్ణయించుకున్న ఒక లేడీతో హీరో గారు, "సెక్సొక్కటే ఇంపార్టెంటా అని విడిపోతానంటున్నావు. అసలు అతను ఇంపోటెంట్ అయ్యుంటే ఏం చేసేదానివి?" అని అడగ్గానే, అదేంటో కన్నీళ్లు పెట్టుకుని తన డైవర్స్ నిర్ణయాన్ని విరమించుకుంటుంది. చొక్కాలేకుండా "ట్రూ లవ్ షేరింగ్" అంటూ ఒక షాపింగ్ మాల్లో హీరో గారు అర్థనగ్నంగా హగ్గులిచ్చే సీన్ ఒకటుంది. పిచ్చికి పరాకాష్ట ఈ సన్నివేశం. యాక్సిడెంటల్ గా తన బ్యాగులోకి వచ్చిన కండోముని చూసిన హీరోయిన్ కోపంతో హీరో కి క్లాస్ పీకుతూ, "ప్రేమలో ప్యూరిటీ అంటే తొడుగు వాడకపోవడమే..." అంటూ ఆడియన్స్ బుర్రగోక్కునే లాంటి డయలాగ్ ఏదో కొడుతుంది.

ఇంతకీ జగపతిబాబు ఒక సెక్స్ వర్కర్ ద్వారా ఒక పిల్లని కంటాడు. టైటిల్లో ఉన్న "చిట్టి" ఆ పిల్లేనన్నమాట. ఇంటర్వల్ అయినవెంటనే ఈ సీక్వెన్సులో వచ్చే డయపర్ సీనుకి ఆడియన్స్ నోట్లో పెట్టుకున్న పాప్ కార్న్ కక్కడం ఖాయం. కామెడీ పేరుతో అంత జుగుప్సాకరంగా, స్పష్టంగా తీయబడింది ఆ సీన్. సినిమా బిగినింగులో బాత్రూం లో పాడిన పాటని హీరో గారు మళ్లీ క్లైమాక్సుకి ముందు బాత్రూముకెళ్ళినప్పుడు పాడతాడు. అది విన్న హీరోయిన్ ఇతనే అతను తెలుసుకుని సంబరపడుతుంది.

చివరికి రకరకాల ప్రహసనాల తర్వాత, టీవీ ప్రోగ్రాముల్లో లైవ్ డిబేట్లు మధ్య 60 ఏళ్ల వయసులో జగపతిబాబు బిడ్డని కనడం తప్పు కాదని తేలాక హీరోయిన్ తండ్రి అయిన దగ్గుబాటి రాజా గారి అనుమతితో హీరో హీరోయిన్లు ఒకటవుతారు. హీరో హీరోయిన్ల రూపాలు, నటన బానే ఉన్నా ఇలాంటి సినిమాలో కనిపించడం వల్ల మైనస్సే తప్ప ప్లస్సేమీ ఉండదు.  జగపతిబాబు ఎందుకు చేసాడో అసలిందులో అనిపిస్తుంది. ఇలాంటి నాసిరకం సినిమాల్లో నటించడం పరువు తీసుకోవడమే. అలనాటి శ్రీలక్ష్మి ఒక అతిథి పాత్ర తరహా పాత్రలో రెండు మూడు సీన్సులో వచ్చి పోతుంది. పేరున్న మిగతా నటీనటులంతే అంతే. మాస్టర్ భరత్ ది దాదాపు సెకండ్ హీరో పాత్రలాంటిది. అతకలేదు.

పాటల గురించి, రికార్డింగ్ స్టాండర్ద్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.  ఏ వయసులోనైనా కోరికలుంటే తీర్చుకోవడం తప్పులేదని, సమాజం కోసం పెద్ద వయసుపేరుతో అణచుకోవాల్సిన అవసరం లేదని కృష్ణభగవాన్, ఒక సెక్స్ వర్కర్ టీవీ చానల్లో చెప్తుంటే అది చూసిన ఒక సగటు వృద్ధుడు లేచి చొక్క తొడుక్కుని తన కుటుంబ సభ్యులతో, "నేను మీకు ఇవ్వల్సింది ఇచ్చేసేను..నాకు కావాల్సింది వెతుక్కోవడానికి వెళ్తున్నాను" అని ఎమోషనల్ గా బయలుదేరతాడు....నిజానికి ఇలాంటి సీనుకి హాల్లో జనం ఉంటే వెటకారంగా గగ్గోలు పెట్టేవారు. కానీ ఆ పరిస్థితి లేదు. ఈ తలాతోకా లేని తలతిక్క సినిమా గురించి సహేతుకమైన, సంప్రదాయబద్ధమైన సమీక్ష రాయడం కష్టం. ఇలా బాధని దింపుకోవడం తప్ప.

బాటం లైన్: మూడు గంటల టార్చర్

 


×