Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: ఉప్పెన

సినిమా రివ్యూ: ఉప్పెన

చిత్రం: ఉప్పెన
రేటింగ్‍: 2.75/5
తారాగణం: వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, విజయ్ సేతుపతి, సాయిచంద్ తదితరులు 
మ్యూజిక్‍: దేవీశ్రీప్రసాద్
ఎడిటింగ్‍: నవీన్ నూలి
ఛాయాగ్రహణం: షందత్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవి శంకర్, సుకుమార్ 
రచన, దర్శకత్వం: బుచ్చి బాబు 
విడుదల తేదీ: ఫిబ్రవరి 12, 2021

మెగా క్యాంపునుంచి వచ్చిన మరో యువనటుడు, రంగస్థలం వంటి సినిమాలకి పనిచేసిన సుకుమార్ శిష్యుడు దర్శకుడు, ఈ రెండింటికీ మించి సూపర్ డూపర్ హిట్టైన "నీ కళ్ళు నీలిసముద్రం" పాట...వెరసి ఉప్పెనకి ఉప్పెనంత క్రేజ్ తీసుకొచ్చాయి. వీటికి తోడు పబ్లిసిటీలో భాగంగా వందకోట్ల సినిమా అని ఒకరు, రంగస్థలం-దంగల్ స్థాయి సినిమా అని ఇంకొకరు, క్లైమాక్స్ హైలైట్ అని మరొకరు చెప్పి అంచనాలని అమాంతం పెంచేసారు. ఇంతకీ అనుకున్న స్థాయిలో ఉందా, అసలు ఉప్పెనలో ఉప్పు సరిపడా పడిందా లేదా చూద్దాం. 

మతం పుచ్చుకున్న జాలరి కొడుకు ఆసి. ఊరిపెద్ద అయిన రాయణం కూతురు బేబమ్మ. ఆసి, బేబమ్మ ప్రేమించుకుంటారు. ఊహించినట్టుగానే పరువు, ప్రాణం ఒకటే అనుకునే రాయణంకి ఈ ప్రేమ వ్యవహారం నచ్చదు. అన్ని కథల్లోలాగానే "పరువు హత్య" చేస్తాడా? లేక మరొక పని చేస్తాడా? పరువుహత్య చేస్తే ఈ సినిమాకి సైరాట్, ధడక్ లాంటి సినిమాలకి తేడా ఉండదు. అందుకే ప్రాణం తీయకుండా ప్రాణం తీసినంత పని మరొకటి చెయ్యడం ఈ కథకుడు అనుకున్న హైలైట్. అదొక్కటీ చెప్పేయొచ్చుగానీ ఈ సినిమాకి చెందిన ఏకైక స్పాయిలర్ ఇవ్వడం సమంజసం కాదని చెప్పట్లేదు. అయినా ఆ ఒక్క పాయింట్ మీద బేస్ అయ్యి ఈ సినిమా ప్రొడక్షన్ టేకాఫ్ అవడం ఆశ్చర్యం. 

పైగా ఈ మధ్య ఓటీటీలో వచ్చి హిట్టైన "కలర్ ఫోటో" కూడా గుర్తుకొస్తుంటుంది ఈ సినిమా చూస్తుంటే. ఆది నుంచీ అంతా అనుకున్నట్టుగానే తెరమీద కథ కదులుతుంటుంది. రాయణంగా విజయ్ సేతుపతి విగ్రహం సరిపోయింది కానీ, నటనకి స్కోప్ ఉన్న సన్నివేశాలు గానీ, డయాలగ్స్ గానీ పడలేదు. ఉన్నంతలో దేవీశ్రీప్రసాద్ ఇచ్చిన బిల్డప్ మ్యూజిక్ వల్ల సేతుపతికి కాస్తైనా పరపతి దక్కింది. బేబమ్మగా చేసిన కృతిది అందమైన నవ్వు. అభినయం కూడా బాగానే చేసింది. 

వైష్ణవ్ కి మాత్రం మంచి భవిష్యత్తు ఉందనిపిస్తోంది. చూడగానే ఆకట్టుకునే ఆకారంతో పాటు నటన కూడా చాలా ఈజ్ తో చేసాడు. ఎక్కడా కూడా ఇది అతని తొలి సినిమా అనిపించలేదు. సటిల్ హ్యూమర్, రొమాన్స్, ఎమోషన్, యాక్షన్..ఏదైనా పండించగల ట్యాలెంట్ ఇతనిలో కనపడింది. ఈ సినిమాకి హైలైట్ మ్యూజిక్. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణం పోసాయి. అలాగే కెమెరా పనితనం కూడా మెచ్చుకోదగ్గదిగా ఉంది. 

ఇక కథ, దర్శకత్వం విషయానికొస్తే చాలా సాదాసీదాగా ఉంది. దర్శకుడు తన ఐక్యూ ని చాటుకునే ట్విస్టులు గానీ, స్క్రీన్ ప్లే వండర్స్ గానీ, రోమాలు నిక్కబొడుకునే డయలాగ్స్ గానీ పడలేదు. హీరో హీరోయిన్లు పారిపోతూ ఒడిసా, బెంగాల్, సిక్కిం పారిపోయే సన్నివేశాలు సహనానికి పరీక్ష పెడతాయి. ఫస్టాఫులో బయాలజీ టీచర్ చెప్పే "మగతనం ఫిలాసఫీ" కూడా చాలా కృత్రిమంగా, బలవంతంగా ఇరికించినట్టు ఉంది. హీరోకి "గ" పలకలేకపోవడం వల్ల కథకి ఉపయోగం ఏంటో కూడా అర్థం కాదు. ఒకవేళ హ్యూమర్ కోసం పెట్టారనుకుంటే దాని మీద కావాల్సినంత హ్యూమర్ పండిచొచ్చు తెలివైన రచయిత ఉంటే. అదీ జరగలేదు. 

ఇక మంచం మీద పడుండి ఒక్క డయలాగ్ కూదా లేని తల్లి పాత్ర ఎందుకో, మొదట్లో రెండు మూడు సీన్స్ లో హడావిడి విలనీతో కనిపించే బావ పాత్ర ఎప్పుడు ఎండ్ అయ్యిందో కూడా తెలియదు. ఇవి కచ్చితంగా కథనంలో లోపాలే.  ఒకటి రెండు సన్నివేశాలు రంగస్థలం చూసి వాతలు పెట్టుకున్నట్టు అనిపిస్తాయి. అక్కడ సత్తిబాబుకి చెవుడు లాగ, ఇక్కడ ఆశి కి "గ" పలక్కపోవడం; అక్కడ చీకటి పొదల్లో రౌడీలు ఆది పినిసెట్టిని టార్చ్ లైట్లు వేసి వెతికినట్టు ఇక్కడ అలాంటి పొదల్లోనే సైకిల్ డైనమో లైట్లు వెలిగించి హీరో హీరోయిన్లని వెతకడం లాంటివి.

ఇంతకీ ఏ సన్నివేశమైతే సినిమాకి హైలైట్ ఎమోషనల్ ట్విస్ట్ అనుకున్నారో అది వచ్చినప్పుడు చాలామంది ఆడియన్స్ సైలెంట్ గా ఏడుస్తారనుకుంటే గొల్లున నవ్వి గోలచేసారు. ట్విట్టర్లో కూడా దీని మీద మీమ్స్ మొదలెట్టారు. దానిని బట్టి అర్థం చేసుకోవచ్చు..పేపర్ మీద కథలో గొప్పగా అనిపించినవి తెర మీదకొచ్చాక తేడాకొట్టొచ్చని. అసలీ సినిమాకి ఇంత హైప్ ఇవ్వకుండా దాని మానాన దాన్ని వదిలేసినా పర్వాలేదనిపించేదేమో...మొదటి రోజు మొదటి ఆట అవ్వగానే సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యేవి కావు!!

బాటం లైన్: పబ్లిసిటీ పీక్- కంటెంట్ వీక్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?