cloudfront

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: ఎంఎల్‌ఏ

సినిమా రివ్యూ: ఎంఎల్‌ఏ

రివ్యూ: ఎంఎల్‌ఏ - మంచి లక్షణాలున్న అబ్బాయ్‌
రేటింగ్‌: 2.5/5
బ్యానర్‌: బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ
తారాగణం: నందమూరి కళ్యాణ్‌రామ్‌, కాజల్‌ అగర్వాల్‌, రవికిషన్‌, పోసాని కృష్ణమురళి, బ్రహ్మానందం, పృధ్వీ, వెన్నెల కిషోర్‌, లాస్య, జయప్రకాష్‌రెడ్డి, నాగినీడు, ప్రభాస్‌ శ్రీను తదితరులు
కూర్పు: తమ్మిరాజు
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: ప్రసాద్‌ మురెళ్ళ
నిర్మాతలు: కిరణ్‌రెడ్డి, భరత్‌ చౌదరి
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: ఉపేంద్ర మాధవ్‌
విడుదల తేదీ: మార్చి 23, 2018

ఎంఎల్‌ఏ... అంటే ఓ మంచి లక్షణాలున్న అబ్బాయ్‌, నిజంగా మెంబర్‌ ఆఫ్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ ఎలా అవుతాడనేది ఈ సినిమా కథ. హీరోకి వున్న మంచి లక్షణాల మాట అటుంచితే, ఉపేంద్ర రాసుకున్న కథలో మాత్రం మంచి లక్షణాలు బహు తక్కువ. ఎలాంటి ప్రత్యేకమైన లక్షణాలు లేని పరమ సాదా సీదా కథకి అంతే నిస్సారమైన కథనంతో 'రొటీన్‌' అనే నియోజికవర్గానికి ప్రతినిధిలా అనిపిస్తాడు ఈ ఎంఎల్‌ఏ.

అన్ని కమర్షియల్‌ సినిమాల మాదిరిగానే కథ జోలికి పోనంత వరకు ఈ చిత్రం 'పాసబుల్‌' అనిపిస్తుంది. ప్రథమార్ధం మొత్తం కథేంటనేది రివీల్‌ చేయకుండా కేవలం హీరో హీరోయిన్ల రొమాన్స్‌ ట్రాక్‌, ఆఫీస్‌లో కామెడీ ట్రాక్‌, మరో సైడ్‌ విలన్‌ ట్రాక్‌ అంటూ 'ఎంటర్‌టైన్‌మెంట్‌' మీదే ఫోకస్‌ వుంది. సాంతం కాకపోయినా ఈ సరంజామాలో కాస్త సందడి చేసిన సందర్భాలైతే వున్నాయి. ఇంటర్వెల్‌ దగ్గరో ట్విస్టు పెట్టి 'మంచి లక్షణాలున్న అబ్బాయ్‌'ని సెకండాఫ్‌లోకి విసిరితే నిజంగా 'ఎంఎల్‌ఏ' కావాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అంతే ఇక అక్కడితో దీనికున్న మంచి లక్షణాలేమైనా వుంటే అవన్నీ అణగారిపోయి, అత్యంత నాసి రకం పొలిటికల్‌ డ్రామా మొదలవుతుంది.

కథలోకి వెళితే... కళ్యాణ్‌ (కళ్యాణ్‌రామ్‌) కో ఇన్సిడెంటల్‌గా మీట్‌ అయిన ఇందు (కాజల్‌) తను పని చేసే ఆఫీస్‌కే బాస్‌గా వస్తుంది. ఆ ఆఫీస్‌కి సంబంధించిన ఒక ల్యాండ్‌ కబ్జాకి గురయితే దానిని విడిపించి తెస్తే ఐలవ్యూ చెప్పాలంటాడు కళ్యాణ్‌. దానికి ఇందు సరేనంటుంది. అతను తెలివిగా ఆ ల్యాండ్‌ తిరిగొచ్చేలా చూస్తాడు. అయితే అప్పటికే ఒక ఎంఎల్‌ఏతో (రవికిషన్‌) పెళ్లి ఖాయమైన ఇందు అతడిని పెళ్లి చేసుకోలేనంటుంది. కానీ ఆమె తనని ప్రేమిస్తుందని తెలిసి తన తండ్రిని ఒప్పించడానికి వచ్చిన కళ్యాణ్‌తో అతను 'నువ్వు ఎంఎల్‌ఏ అయితే నీకు నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడానికి అభ్యంతరం లేదు' అంటాడు. దాంతో ఎంఎల్‌ఏగా మారడం కోసం ఆ ఊరి ఎంఎల్‌ఏకి ఎదురు నిలుస్తాడు.

కథ పాలిటిక్స్‌ జోలికి పోనంత వరకు సాఫీగానే సాగిపోతుంది. ఒకసారి హీరో ఎన్నికల బరిలో దిగిన తర్వాతే సమస్య మొదలవుతుంది. అక్కడ్నుంచి ఏమి జరుగుతుందనేది అంతా మన ఊహలకి, అంచనాలకి తగ్గట్టే సాగుతూ కించిత్‌ 'సర్‌ప్రైజ్‌ ఎలిమెంట్‌' లేకుండా ఫ్లాట్‌గా సాగిపోతుంది. ఒక అనామకుడు వచ్చి ఒక సిట్టింగ్‌ ఎంఎల్‌ఏతో రాజీనామా చేయించి ఎలా గెలుస్తాడు? మామూలుగా అయితే ఎక్సయిటింగ్‌గా అనిపించాల్సిన పాయింటే ఇది. కానీ దీనిని చాలా పేలవంగా, ఏమాత్రం ఆసక్తి కలిగించని ధోరణిలో నడిపించడంతో ఎంఎల్‌ఏ ద్వితియార్ధం భారంగా మారుతుంది.

ఆ ఊరికి మంచినీటి సదుపాయం వుండదు. పిల్లలు బడికి వెళ్లరు. ఎంఎల్‌ఏకి చెందిన గాజు ఫ్యాక్టరీలోనే పిల్లలు పని చేస్తూ ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ రెండు సమస్యలని హీరో తీర్చేస్తాడు. దాంతో ఆ ఊరి ప్రజల్లో అతను పాపులర్‌ అయిపోతాడు. అతడిని దెబ్బ కొట్టలేక హత్యాప్రయత్నం చేస్తాడు విలన్‌. సింపతీ వేవ్‌ కలిసొచ్చి హీరో ఎంఎల్‌ఏ అవుతాడు. ఇంత ఎలిమెంటరీ లెవల్‌ స్క్రీన్‌ప్లేతో సుదీర్ఘంగా సాగే ద్వితీయార్ధం వల్ల ఈ ఎంఎల్‌ఏకి ప్రేక్షకుల ఓట్లు మాత్రం పడవు.

కళ్యాణ్‌రామ్‌ నటన వరకు వంక పెట్టలేం. అన్ని ఎమోషన్లు బాగానే పండించాడు. కాజల్‌ అగర్వాల్‌కి పర్‌ఫార్మెన్స్‌కి స్కోప్‌ వున్న క్యారెక్టర్‌ ఇవ్వలేదు. అందంగా కనిపించడం మినహా ఆమె చేయడానికేం లేదు. రవికిషన్‌ కొద్ది రోజులు ఇవే పాత్రలు కంటిన్యూ చేస్తే స్టూడియోకి కాకుండా సరాసరి అసెంబ్లీకి వెళ్లిపోయినా ఆశ్చర్యం లేదు. ఇన్ని సినిమాల్లో పొలిటీషియన్‌గా కనిపిస్తోన్న రవికిషన్‌ పొరపాట్న అసెంబ్లీకి వెళ్లినా ఎవరూ అతడికి అడ్డు చెప్పకపోవచ్చు.

పోసాని కృష్ణమురళి పాత్ర, అతనితో చేయించిన కామెడీ మరీ వల్గర్‌గా వుంది. అన్ని వర్గాలకి నచ్చే సభ్యమైన కామెడీ కాదిది. బ్రహ్మానందం 'పట్టాభి' ఎపిసోడ్‌లో లాజిక్‌ లేకపోయినా కామెడీకి పనికొచ్చింది. పృధ్వీ ట్రై చేసినా కానీ అతని క్యారెక్టర్‌కి తగినంత హ్యూమర్‌ లేకుండా పోయింది. వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, మురళీమోహన్‌, లాస్య సహాయ పాత్రల్లో కనిపించారు.

మణిశర్మ స్వరాల్లో 'బొంభాట్‌' మ్యాజిక్‌ మిస్‌ అయింది. నేపథ్య సంగీతంలోను మునుపటి శర్మ తాలూకు కమాండ్‌ కొరవడింది. సినిమాటోగ్రఫీ, ఫైట్స్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌ అన్నీ స్టాండర్డ్‌ టెంప్లేట్‌ని ఫాలో అయిపోయాయి. దర్శకుడు ఉపేంద్ర మాధవ్‌ రాసుకున్న స్క్రీన్‌ప్లేకి ఎప్పుడో కాలం చెల్లిపోయింది. అవుట్‌డేటెడ్‌ అయిన ఈ ఫార్ములాని శ్రీనువైట్ల కూడా వదిలి పెట్టాల్సి వచ్చింది.

మళ్లీ అదే తరహాలో కథని నడిపిస్తే ఆకట్టుకుంటుందని ఆశించడం అత్యాశే అనాలి. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో కాస్త కొత్తరకం వినోదం అందించడానికి ప్రయత్నించినట్టయితే ఫలితం మెరుగ్గా వుండేదేమో కానీ ప్రస్తుతానికి ఈ ఎంఎల్‌ఏ ఎన్నికల్లో ఓడిపోయిన అజెండాతోనే మళ్లీ ఇంకోసారి ప్రయత్నించిన ఫీలింగ్‌ ఇస్తుంది.

కాసేపు కాలక్షేపం అయితే చాలనుకునే రొటీన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఆమోద ముద్ర వేసే వర్గం ప్రేక్షకుల నుంచి మాండెటరీ ఓటు రాబట్టుకున్నా మెజారిటీని నిరాశపరిచే ఈ ఎంఎల్‌ఏ బాక్సాఫీస్‌ 'కలక్షన్‌'లో గెలిచే అవకాశాలు తక్కువే.

బాటమ్‌ లైన్‌: ఓటు వేయలేం!

- గణేష్‌ రావూరి