cloudfront

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: నీదీ నాదీ ఒకే కథ

సినిమా రివ్యూ: నీదీ నాదీ ఒకే కథ

రివ్యూ: నీదీ నాదీ ఒకే కథ
రేటింగ్‌: నాట్‌ అప్లికబుల్‌
బ్యానర్‌: శ్రీ వైష్ణవి క్రియేషన్స్‌, అరన్‌ మీడియా వర్క్స్‌
తారాగణం: శ్రీవిష్ణు, సాట్నా టిటస్‌, దేవీ ప్రసాద్‌, నారా రోహిత్‌, పోసాని కృష్ణమురళి తదితరులు
కూర్పు: బొంతల నాగేశ్వర్‌రెడ్డి
సంగీతం: సురేష్‌ బొబ్బిలి
ఛాయాగ్రహణం: రాజ్‌ తోట, పర్వేజ్‌ .కె
నిర్మాతలు: ప్రశాంతి, కృష్ణ విజయ్‌ .ఎల్‌ 
రచన, దర్శకత్వం: వేణు ఊడుగుల
విడుదల తేదీ: మార్చి 23, 2018

''పాన్‌ షాప్‌ వాడు, కొబ్బరిబొండాల వాడు, టీ స్టాల్‌ వాడివి బతుకులు కావా, డాక్టర్లు, ఇంజినీర్లు, లెక్చరర్లవే బతుకులా?'' అనేది ఇందులో కథానాయకుడి ప్రశ్న. ఈ ప్రశ్నలోంచే 'నీదీ నాదీ ఒకే కథ' పుట్టింది.

'కొడుకు బాగా బతకాలి' అనే తండ్రి (దేవిప్రసాద్‌), 'వచ్చిన పని చేసుకుంటూ బతికితే చాలు' అనుకునే కొడుకుల (శ్రీవిష్ణు) కథ ఇది. పిల్లలందరికీ చదువు అబ్బదనేది తల్లిదండ్రులు గ్రహించరు. పక్కింటి వాళ్ల పిల్లల మార్కులు చూసి, బంధువుల పిల్లలు సాధించిన మెడల్స్‌ చూసి తమ పిల్లలనీ అలా చూడాలంటూ తమ ఆశలని వాళ్ల మీద రుద్దుతుంటారు. తాము సాధించాలని అనుకుని, ఏవో కారణాల వల్ల సాధించలేకపోయిన కలలని పిల్లల ద్వారా సాకారం చేసుకోవాలనే తల్లిదండ్రులెందరో కనిపిస్తారు. తామేం చదివితే తమ పిల్లలు కూడా అదే చదివి, ఆ రంగంలోనే రాణించి తమ పేరు నిలబెట్టాలని చూసే వాళ్లూ కోకొల్లలు.

అయితే అందరు పిల్లలకీ చదివింది తలకెక్కించుకునే తెలివి వుండదు. ఎంత చదివినా పరీక్షల్ని ఫేస్‌ చేసే సత్తా వుండదు. చదువుకుంటేనే జీవితంలో ఏదైనా సాధించగలరు, చదువురాని వారంతా అప్రయోజకులు అనే మైండ్‌సెట్‌ వున్న సమాజంలో అలా విద్య రాని వారంతా వింత పశువులేనా? చిన్న చిన్న వ్యాపారులు, మెకానిక్‌లు, డ్రైవర్‌లవి హీనమైన బతుకులేనా? ఈ చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల సంధించే చాలా ప్రశ్నలు సూటిగా తాకుతాయి. పిల్లలకి ఏది ఇష్టమో తెలుసుకోకుండా, ట్రెండింగ్‌ జాబ్‌ల కోసం వెంపర్లాడే తల్లిదండ్రులకి, సోషల్‌ స్టేటస్‌ కోసం బాల్యాన్ని ఆస్వాదించనివ్వని పేరెంట్స్‌కి ఇందులో చాలా పాఠాలున్నాయి.

వేణు ఊడుగుల లేవనెత్తిన ప్రశ్నలు అన్నీ సబబే. కాకపోతే తన కథానాయకుడిని తీర్చిదిద్దిన తీరు ఆమోదయోగ్యంగా లేదు. ప్రయత్న లోపం లేనివాళ్లు ఫెయిలైతే అర్థం చేసుకోవచ్చు కానీ పరీక్ష రోజున కూడా ఒళ్లు మరచి నిద్రపోవడం, హాల్ టికెట్‌ లేకుండా ఎగ్జామ్‌ హాల్‌కి వెళ్లడం లాంటివి ఆక్షేపణీయం. విద్య అబ్బకపోయినా అందరిలోను ఏదో ఒక టాలెంట్‌ వుంటుంది. కనీసం దేనిపైన ఆసక్తి లేకుండా, పొద్దంతా బలాదూర్‌గా గడిపేసే లక్షణాలున్న వాడిని 'హీరో'ని చేయడం సమజసమనిపించదు.

ఈ చిత్రం పోస్టర్ల కోసం సచిన్‌, రజనీకాంత్‌ లాంటి చదువు సరిగా అబ్బని 'ప్రతిభావంతులు', 'సూపర్‌స్టార్ల'ని ఇది అలాంటి వారి కథే అన్నట్టు వాడుతున్నారు. కానీ ఇది అలాంటి ప్రతిభావంతుల కథ కాదు. ఏ టాలెంట్‌ కానీ, చదువు కానీ లేని వాళ్ల కథ. ఫలానా దానిపై వున్న ఆసక్తిని అర్థం చేసుకోకుండా, పిల్లలపై తమ ఆశల్ని రుద్దే తల్లిదండ్రులని తప్పుబట్టడం కరక్టే. కానీ అసలు జీవితం మీదే ఎలాంటి బాధ్యత లేని పిల్లల్ని తప్పుబట్టే పెద్దలది తప్పనడం రైటా? అసలు ఏ టాలెంట్‌ లేకుండా, చదువు మీద ఆసక్తి లేకుండా వుండే వాళ్లు ఈ సమాజంలో ఎందరు? వారిలో ఎంత మంది కథ ఇది? ఎందరు రిలేట్‌ చేసుకునేది?

చదువు తలకెక్కని పిల్లల్ని అసహ్యించుకోకండి, వారు చేసే పని పరువు, ప్రతిష్టల సమస్యగా తీసుకోకండి అంటూ చెప్పడం సబబే. కానీ అలాంటి వాళ్ల మైండ్‌సెట్‌ రైట్‌ అన్నట్టు బోధించడం, నిజంగా చదువుకుని ప్రయోజకులు అవుతున్నవాళ్లంతా సంతోషంగా లేరని వాదించడం ఎంతమాత్రం సమంజసం కాదు. సమాజానికి ఒక బలమైన సందేశాన్ని ఇచ్చిన ఇదే చిత్రంలో ఇలాంటి రాంగ్‌ మెసేజ్‌ కూడా పాస్‌ అయిపోవడం ఆశ్చర్యపరుస్తుంది.

చదువు సరిగా రాని హీరోకి ప్యారలల్‌గా బాగా చదువుకునే ఒక కుర్రాడి జీవితాన్ని కూడా చూపిస్తారు. జీవితంలోని ఆనందం అంతా సెటిల్‌ అయిన తర్వాతే పొందవచ్చునని తండ్రి చెప్పిన మాటల్ని తు.చ. తప్పకుండా పాటించిన ఆ కుర్రాడు తీరా ఆ ఆనందం చేతికందే సమయంలో జీవితం చాలిస్తాడు. ఎప్పుడు పోతామో తెలియని జీవితం కోసం కష్టపడి చదువుతూ అన్ని ఆనందాలు వదిలేసుకోవాలా అంటూ హీరో తన ఫిలాసఫీ లేవనెత్తుతాడు.

బాల్యాన్ని కూడా ఆనందించనివ్వకుండా, ఆట పాటలకి సమయాన్ని ఇవ్వకుండా పిల్లల్ని పుస్తకాల పురుగులుగా మార్చేసే తల్లిదండ్రుల మైండ్‌సెట్‌ కరక్ట్‌ కాదు కానీ... బాగా చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్లు స్ట్రెస్‌ ఫీలవుతూ ఆత్మహత్యలకి పాల్పడుతున్నారని చెబుతూ తమ వాదనని సమర్ధించుకోవడం, సంతోషం మొత్తం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ రోజు బత్తెం మీద బతుకు సాగిస్తున్న వారి వద్దే వుందని చెప్పడం ముమ్మాటికీ రాంగే.

ఇందులోని హీరోని 'రైట్‌' చేయడం కోసం సొసైటీలో చాలా 'రైట్‌' విషయాలని 'రాంగ్‌' అనేసాడు దర్శకుడు. కథ కథకుడి పాయింట్‌ ఆఫ్‌ వ్యూ నుంచి క్యారెక్టర్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలోకి షిఫ్ట్‌ అయిపోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. రైట్‌ మీటర్‌లో, పర్‌ఫెక్ట్‌ ఆర్గ్యుమెంట్‌తో స్టార్ట్‌ అయిన సినిమా కాస్తా మధ్యలో ట్రాక్‌ తప్పుతుంది.

బాధ్యతాయుతంగా వుంటూ కూడా సక్సెస్‌ కాలేకపోతున్న వాడిని 'నువ్వే రైట్‌' అంటూ అందరూ ఒప్పుకోవచ్చు కానీ, తన బాధ్యతలు విస్మరించి, ఎయిమ్‌లెస్‌గా తిరిగేవాడిని ఇందులోని ప్రతి పాత్రా ఏదో ఒక సమయంలో సమర్ధిస్తుంది. 'నువ్వే రైట్‌' అంటూ హీరోని చేస్తుంది. సొసైటీలో జరుగుతోన్న ఒక గుర్తించలేని పెద్ద తప్పుని ప్రశ్నించాల్సిన ఈ కథ కాస్తా కొన్ని రైట్‌ థింగ్స్‌ని కూడా రాంగ్‌ అంటూ ఓ రాంగ్‌ మెసేజ్‌ని కూడా తెలియకుండా పాస్‌ చేసేస్తుంది.

సందేశాల పరంగా తప్పొప్పుల మాట అటుంచితే వాస్తవికతకి అద్దం పట్టేలా, అత్యంత సహజంగా దీనిని తెరకెక్కించిన విధానానికి దర్శకుడిని మెచ్చుకోవాలి. సంఘటనలోంచే సునిశిత హాస్యం పుట్టిస్తూ, పరిస్థితులతోనే వినోదాన్ని పండిస్తూ అతను కథ చెప్పిన విధానం ఆకట్టుకుంటుంది. శ్రీవిష్ణు ఈ చిత్రంలో నటించాడు అనడం కంటే జీవించాడు అనాలి. తన క్యారెక్టర్‌ తాలూకు పెయిన్‌ని, అశక్తతని, ఫ్రస్ట్రేషన్‌ని, నిస్సహాయతని, భావోద్వేగాలని కళ్లకి కట్టిన విధానం అబ్బురపరుస్తుంది. నటుడిగా శ్రీవిష్ణు స్థాయి పెంచే చిత్రమిది. అతని తండ్రిగా దర్శకుడు దేవిప్రసాద్‌ నటన కూడా చాలా సహజంగా వుంది. ఈ ఇద్దరినీ చూస్తే నిజంగా మన కాలనీలోని తండ్రీకొడుకులని చూస్తున్న భావనే కలుగుతుంది.

హీరోతో చిత్తూరు యాసలో మాట్లాడిస్తూ... దానిని తన ఇంట్లో వారితో సహా మరెవరితోను మాట్లాడించకపోవడం విచిత్రంగా వుంది. పైగా తన ఇంట్లోనే ఒక్కొక్కరూ ఒక్కో యాసలో మాట్లాడుతుంటారు. కొన్ని ఎమోషనల్‌ సందర్భాల్లో హీరో సైతం తన యాక్సెంట్‌ విడిచేస్తాడు. ఇలాంటివి లేకుండా కన్సిస్టెన్సీకి ప్రాధాన్యత ఇచ్చి ఉండాల్సింది. ఒక బ్యాక్‌డ్రాప్‌ ఎంచుకున్నపుడు, ఒక యాస వుండాలనుకున్నపుడు అది అన్ని పాత్రలకీ మెయింటైన్‌ చేస్తే ఆథెంటిక్‌గా వుంటుంది, లేదా కావాలని అతికించిన భావన కలుగుతుంది.

సీరియస్‌ పాయింట్‌తో ఎమోషనల్‌గా సాగే ఈ చిత్రం హెవీగా అనిపిస్తుంది. నిడివి తక్కువే అయినా కానీ దానికి రెండింతలు సమయం వున్న భావన కలుగుతుంది. రియలిస్టిక్‌ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులకి ఈ చిత్రంలోని వాస్తవికత మెప్పిస్తుంది. అలాగే కథానాయకుడి పాత్రతో రిలేట్‌ చేసుకునే వారు ఎమోషనల్‌గా ఎక్కువ కనక్ట్‌ అయ్యే అవకాశముంది.

కమర్షియల్‌ కోణంలో ఆలోచించకుండా లిమిటెడ్‌ ఆడియన్స్‌ని మాత్రమే దృష్టిలో పెట్టి తీసిన చిత్రం కనుక రెగ్యులర్‌ కమర్షియల్‌ రేటింగ్‌ స్కేల్‌తో దీనిని కొలిచే వీల్లేకపోయింది. ఈ చిత్రంతో రిలేట్‌ అయిన దాని ప్రకారం ఒక్కో ప్రేక్షకుడి స్పందన ఒక్కోలా వుంటుంది. అతనిదీ మీదీ ఒకే కథా కాదా అన్న దానిని బట్టి ఈ చిత్రం మెప్పిస్తుందా లేదా అన్నది ఆధారపడుతుంది. అయితే ఒక సిన్సియర్‌ అండ్‌ హానెస్ట్‌ అటెంప్ట్‌గా మాత్రం ఈ చిత్రం మిగిలిన చిత్రాల మధ్య ప్రత్యేకంగా నిలబడుతుంది.

బాటమ్‌ లైన్‌: ఇది అందరి కథ కాదు!

- గణేష్‌ రావూరి