cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: టచ్‌ చేసి చూడు

సినిమా రివ్యూ: టచ్‌ చేసి చూడు

రివ్యూ: టచ్‌ చేసి చూడు
రేటింగ్‌: 2/5
బ్యానర్‌: లక్ష్మినరసింహా ప్రొడక్షన్స్‌
తారాగణం: రవితేజ, రాశిఖన్నా, సీరత్‌ కపూర్‌, జయప్రకాష్‌, మురళి శర్మ, వెన్నెల కిషోర్‌, రాజేష్‌, అన్నపూర్ణ, సుహాసిని తదితరులు
కథ: వక్కంతం వంశీ
కథనం: దీపక్‌ రాజ్‌
కూర్పు: గౌతంరాజు
సంగీతం: జామ్‌8
నేపథ్య సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: చోటా కె. నాయుడు
నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), వల్లభనేని వంశీ
దర్శకత్వం: విక్రమ్‌ సిరికొండ
విడుదల తేదీ: ఫిబ్రవరి 2, 2018

హీరో తన ఐడెంటిటీని వదిలేసి, గతాన్ని మర్చిపోయి కొత్త జీవితం గడపడం, మళ్లీ అతని గతంలోని ఒక వ్యక్తి కనిపించి తిరిగి ఆ పాత వ్యక్తి బయటకి రావడం... ఈ త్రెడ్‌తో ఇప్పటికి ఎన్ని సినిమాలొచ్చి వుంటాయో లెక్కే లేదు. ఎప్పుడో అవుట్‌డేటెడ్‌ అయిపోయిన ఈ స్టోరీని వక్కంతం వంశీ చెబితే దానిని రవితేజ ఓకే చేసేసాడు.

కనీసం నటుడిగా తనకైనా ఏదైనా కొత్తదనం చూపించే అవకాశం వుందా అంటే అదీ లేదు. విక్రమార్కుడు, పవర్‌ సినిమాల్లో పవర్‌ఫుల్‌ పోలీస్‌గా కనిపించిన రవితేజకి నటుడిగా కాస్త వెరైటీని చూపించే అవకాశాన్ని సయితం ఈ స్టోరీ ఇవ్వలేదు. వక్కంతం రాసిన పాత చింతకాయ కథకి దీపక్‌ రాజ్‌ ముతక స్క్రీన్‌ప్లే రాస్తే దానిని తీసుకెళ్లి కొత్త దర్శకుడి చేతిలో పెట్టారు.

కొత్త దర్శకుడు కనుక పాత కథకే కొత్త రంగులు అద్దుతాడని అనుకుని వుంటారు. కానీ విక్రమ్‌ సిరికొండ ఈ చిత్రానికి ఎలాంటి కొత్తదనం తెచ్చిపెట్టకపోగా, టేకింగ్‌ పరంగా కూడా పడికట్టు పద్ధతులు పాటిస్తూ ఆసాంతం విసిగిస్తాడు. అసలు కథలోకి వెళ్లకుండా రాశిఖన్నా, రవితేజ లవ్‌స్టోరీతోనే టైమ్‌పాస్‌ చేస్తోంటే మెయిన్‌ ప్లాట్‌ ఎందుకు ఓపెన్‌ చేయడం లేదనే ఫీలింగొస్తుంది.

ఒకసారి అసలు కథలోకి వెళ్లాక గానీ తెలిసిరాదు... ఇది 'టచ్‌ చేసి చూసే' పాయింట్‌ కాదని! అసలు కథలో మేటర్‌ లేకపోవడం వల్లే అంతసేపు లవ్‌ సీన్లతో కాలక్షేపం చేసారని. సోసోగా అనిపించిన ఫస్ట్‌ హాఫ్‌నే మరోసారి రిపీట్‌ వేసేసినా బాగుండని సెకండ్‌ హాఫ్‌ చూస్తుంటే ఎన్నోసార్లు అనిపించకపోతే అడగండి మరి. 

ఇలాంటి కథల్ని సవ్యంగా చెప్పకపోతే ఒకే టికెట్‌ మీద రెండు సినిమాలు చూసిన అనుభూతినిస్తాయి. ఫస్ట్‌ హాఫ్‌ సరదాగా సాగిపోయిన సినిమా కాస్తా ఇంటర్వెల్‌ తర్వాత పరమ బోరింగ్‌గా తయారవుతుంది. హీరోని పవర్‌ఫుల్‌ పోలీస్‌గా చూపించడానికి, అతడిని ఎలివేట్‌ చేయడానికి తగ్గ సీన్లు రాసుకోవాలి. రాజకీయ నాయకుడికి ఎదురెళ్లే పోలీస్‌ని చాలాసార్లు చూసేసాం.

పరుగులు పెట్టించే కథనంతో, ఎక్సయిట్‌మెంట్‌ పెంచే యాక్షన్‌తో సాగాల్సిన ఈ ఫ్లాష్‌బ్యాక్‌ పార్ట్‌ కాస్తా విషయ శూన్యంగా, కేవలం సన్నివేశాల కలబోతగా మాత్రమే కనిపిస్తుంది. ఫస్ట్‌ హాఫ్‌లో ఫ్యామిలీ అంటే పంచ ప్రాణాలుగా కనిపించిన హీరో సెకండ్‌ హాఫ్‌లోని ఫ్లాష్‌బ్యాక్‌లో ఉద్యోగం తప్ప మరేదీ పట్టని వాడిగా కనిపిస్తాడు. ద్వితియార్థంలో కూడా మరో హీరోయిన్‌ వున్నా కానీ ఇక్కడ రొమాన్స్‌కి, కామెడీకి కూడా చోటివ్వలేదు.

సాధారణ సన్నివేశాలైనా కానీ కామెడీ సీన్లనే సరికి రవితేజ తనదైన శైలిలో నిలబెట్టేస్తాడు. కానీ ద్వితియార్ధంలో అతని క్యారెక్టర్‌ని సీరియస్‌గా మార్చేయడంతో కనీసం కామెడీతో అయినా రవితేజ దీనిని కాపాడే అవకాశం లేకుండా చేసారు. అంటే రవితేజ పవర్‌ఫుల్‌ సీన్లు పండించలేడని కాదు. విక్రమార్కుడు తరహా సీన్లు పడితే అదరగొట్టేస్తాడు కానీ సగటు ఎనభైల కాలం నాటి పోలీస్‌ కథలో అతనేం చేస్తాడు? సుహాసిని క్యారెక్టర్‌ రూపంలో ఎమోషనల్‌ యాంగిల్‌ ఏదో వుంటుందని అనిపిస్తారు కానీ తీరా పతాక సన్నివేశాలకి వచ్చేసరికి కామెడీ వైపు మొగ్గు చూపారు.

'బలుపు'లో క్లయిమాక్స్‌ సీరియస్‌గా కాకుండా కామెడీగా డీల్‌ చేయడం వల్ల వర్కవుట్‌ అయిందని ఆ తప్పుని 'పవర్‌'లో రిపీట్‌ చేసారు. మళ్లీ అదే మిస్టేక్‌ ఇక్కడా చేసారు. కామెడీ పండినపుడు కంప్లయింట్స్‌ వుండవు కానీ, ఎప్పుడయితే అది క్లిక్‌ కాలేదో అది మరింత సిల్లీగా అనిపిస్తుంది. ఎప్పుడో ఇంటర్వెల్‌ ముందు సీన్లో మర్చిపోయిన రాశి ఖన్నా మళ్లీ టైటిల్స్‌ రోల్‌ అవుతుండగా కానీ దర్శకుడికి గుర్తు వచ్చినట్టు లేదు.

రవితేజ దీనికి చేయగలిగిన దానికంటే ఎక్కువే చేసాడు. కానీ ఒక దశకి చేరిన తర్వాత అతని ఎనర్జీ కూడా కాపాడలేనంత నిస్సారంగా వున్న కథ, కథనాల వల్ల మాస్‌ మహారాజా కూడా చేష్టలుడిగి చూస్తుండిపోయాడు. అతని ఆహార్యంలో, నటనలో 'రాజా ది గ్రేట్‌' ఛాయలు కనిపించడం బహుశా రెండూ సమాంతరంగా షూటింగ్‌ జరుపుకున్న కారణంగా అయి వుండవచ్చు. రాశి ఖన్నా స్లిమ్‌ అయి అందంగా వుంది. పుష్పగా ఈ చిత్రానికి బెస్ట్‌ మూమెంట్స్‌ని ఆమె అందించింది. సీరత్‌ కపూర్‌ అందాల ప్రదర్శనకే పరిమితమైంది. జయప్రకాష్‌ తండ్రి పాత్రలో మెప్పించగా, మురళి శర్మ, వెన్నెల కిషోర్‌ల పాత్రలు ద్వితియార్ధంలో కాస్త ఉపశమనం ఇస్తాయి.

పాటలు ఆకట్టుకోలేదు కానీ నేపథ్య సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ వలనో ఏమో యాక్షన్‌ సన్నివేశాల్లో వినాయక్‌ సినిమాల ఛాయలు కనిపిస్తాయి. స్టోరీ, స్క్రీన్‌ప్లే పరంగా అవుట్‌డేటెడ్‌ ఫార్మాట్‌లో వున్న ఈ సినిమా టెక్నికల్‌గా, టేకింగ్‌ పరంగా కూడా పాత పద్ధతులనే అవలంబించడం వల్ల కొత్తదనం అనేది మాట వరసకి కూడా లేకుండా పోయింది.

'టచ్‌ చేసి చూడు' అంటూ హీరో ఆటిట్యూడ్‌ని సూచించే టైటిల్‌ పెట్టారనిపించిన సినిమా కాస్తా, టచ్‌ చేసి చూసిన తర్వాత అది ఆడియన్స్‌కి ఇచ్చిన వార్నింగ్‌ అనుకునేట్టు చేస్తుంది. సాదా సీదా చిత్రాలని సేఫ్టీకి తీసుకెళ్లిన హిస్టరీ రవితేజకి వుంది కానీ ఈసారి అతడి స్కిల్స్‌ కూడా కాపాడలేని స్టఫ్‌ ఇది.

బాటమ్‌ లైన్‌: టచ్‌ చేసారో అంతే సంగతులు!

- గణేష్‌ రావూరి

 


×