Advertisement

Advertisement


Home > Movies - Reviews

మహానటితో తెలుగు సినిమా ఎదిగింది..!

మహానటితో తెలుగు సినిమా ఎదిగింది..!

‘మహానటి’ సినిమా చూసిన తర్వాత కలిగిన తొలి అభిప్రాయమిది. దీనికి కొన్ని కారణాలున్నాయి. సరైన స్ర్కిప్టు వర్క్‌ చేయకుండా.. అరకొర కథలతో సినిమాలు తీయటం అలవాటైన మనకు మహానటి ఒక కొత్త అనుభవం. ఇక సమర్థుడైన డైరక్టర్‌ నెరేషన్ ఎలా చెప్పగలడనే విషయాన్ని అశ్విన్ మనకు మరోసారి చెప్పి చూపించాడు. ఇక సావిత్రి గురించి ఈతరం వాళ్లకే కాదు 70లలో పుట్టిన వాళ్లకు కూడా తెలిసింది కొంతే! మాయాబజారు, మిస్సమ్మ, కన్యాశుల్కం వంటి చిత్రాల్లో ఆమె నటన చూసి బాగా చేసింది అనుకోవటం.. బాగా తాగి.. ఇబ్బందులు పడి చనిపోయిందనుకోవటం తప్ప పెద్దగా ఎవరికీ సావిత్రి జీవితం గురించి తెలియదు.

‘మహానటి’ సినిమా చూసిన తర్వాత కలిగిన తొలి అభిప్రాయమిది. దీనికి కొన్ని కారణాలున్నాయి. సరైన స్ర్కిప్టు వర్క్‌ చేయకుండా.. అరకొర కథలతో సినిమాలు తీయటం అలవాటైన మనకు మహానటి ఒక కొత్త అనుభవం. ఇక సమర్థుడైన డైరక్టర్‌ నెరేషన్ ఎలా చెప్పగలడనే విషయాన్ని అశ్విన్ మనకు మరోసారి చెప్పి చూపించాడు. ఇక సావిత్రి గురించి ఈతరం వాళ్లకే కాదు 70లలో పుట్టిన వాళ్లకు కూడా తెలిసింది కొంతే! మాయాబజారు, మిస్సమ్మ, కన్యాశుల్కం వంటి చిత్రాల్లో ఆమె నటన చూసి బాగా చేసింది అనుకోవటం.. బాగా తాగి.. ఇబ్బందులు పడి చనిపోయిందనుకోవటం తప్ప పెద్దగా ఎవరికీ సావిత్రి జీవితం గురించి తెలియదు.

ఈ చిత్రం చూసిన తర్వాత అంతా తెలిసిపోతుందనుకోవటం కూడా తప్పే. కానీ ఈతరం వాళ్లకు ఆమె గురించి తెలుసుకోవాల్సిన అవసరముంది. చలనచిత్ర రంగం కొద్దిమంది వ్యక్తులు.. కొన్ని స్టూడియోల చేతిలో ఉన్న సమయంలో ఆమె ప్రవేశించింది. షూటింగ్‌లలో బ్రాహ్మణులకు వేరే పంక్తిలో భోజనాలు పెట్టే సమయం అది. (చాలా మందికి తెలియకపోవచ్చు. మొదట్లో సినీరంగంలో బ్రాహ్మణ ఆధిపత్యం ఉండేది. ఆ తర్వాత కమ్మవారి చేతిలోకి వచ్చేసింది).

ఒక చిన్న మారుమూల నుంచి వచ్చిన 14 ఏళ్ల పిల్లను మొదట సినీరంగం ఎలా చూసింది? ఆ తర్వాత ఆమె ఆ సినీ రంగాన్ని ..  దానిలోని పెద్దలను ఎలా ట్రీట్‌ చేసింది? తాను ఎదిగే క్రమంలో ఎవరెవరిని శత్రువులు చేసుకుంది? అనే విషయాలు చాలా ఆసక్తికరం. సామాజిక నేపథ్యం వల్ల సరైన మద్దతు లేకపోవటం.. సరైన సమయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకొనే చిత్రమైన అలవాటు.. వీటికి తోడు మాయా ప్రపంచపు జిగిబిగిలు తెచ్చిపెట్టే అలవాట్లు.. వీటన్నింటికీ సావిత్రి ఎలా బలైపోయిందనే విషయాన్ని కూడా ప్రస్తావిస్తే బావుండేది.

కానీ అశ్విన్ ఎందుకో ఆమె వ్యక్తిగత జీవితంపైనే దృష్టంతా కేంద్రీకరించాడు. అది కూడా తానొవ్వక.. తానొప్పించక.. అనే పద్ధతిలో సాగింది. దీని వల్ల సావిత్రి జీవితంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు.. కొందరు ముఖ్యమైన వ్యక్తులు ఈ చిత్రంలో కనిపించకుండా పోయారు. జమున, షారుకారు జానకి, భానుమతి, అంజలీదేవి, సూర్యకాంతం, ఛాయదేవి వంటి నటుల ప్రస్తావన లేకుండా పోయింది. దీనితో డర్టీ పిక్చర్‌, మోడల్‌ వంటి సినిమాల్లో కనిపించే నిజాయితీ దీనిలో ఉండదు. అయితే  దీనివల్ల చిత్ర బిగువు ఏమాత్రం తగ్గలేదు.

కానీ మనకు తెలిసిన వ్యక్తుల కథను బయోపిక్‌గా మలిచినప్పుడు- దానిలో కేవలం వారి వ్యక్తిత్వాన్ని ఇనుమడింపచేసే విషయాలు చెప్పాలా? లేక వారి జీవితంలో ఉన్న చీకటి కోణాలను కూడా నిజాయితీగా చూపించాలా? అనేచర్చ మరోసారి ఈ సినిమాతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ భయంతోనే సినిమా ప్రముఖులెవ్వరూ ఆత్మకథలు కూడా రాయరు. అంతేకాదు. ప్రస్తుతం నటీమణుల వ్యవహారంలో సంక్షోభం ఎదుర్కొంటున్న తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులకు.. హమ్మయ్య.. చెడుగా ఏం చెప్పలేదు అని ఈ చిత్రం ఒక స్వాంతన కలిగిస్తుంది.

ఒక రీఎష్యూరెన్స్ ఇస్తుంది. ఒక వ్యక్తి జీవితాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చూడవచ్చు. సావిత్రి జీవితం కూడా అంతే! కొందరు ఆమె మోసపోయిందనుకోవచ్చు. కొందరు మానసికంగా బలహీనురాలనుకోవచ్చు. మరికొందరు పరిస్థితుల చేతిలో కీలుబొమ్మ అనుకోవచ్చు. ఇంకొందరు సినిమా వాళ్ల జీవితాల్లో ఇవన్నీ కామనే అనుకోవచ్చు. కానీ సత్యం అనే మైలురాయి ఒకటుంటుంది. దానిని ఎవరూ మార్చలేరు. ఈ విషయంలో అశ్విన్ సృజనాత్మక స్వేచ్ఛను ఎక్కువగా వాడినట్లు అనిపించింది. అతను అబద్ధాలను చెప్పి ఉండకపోవచ్చు. కొన్ని నిజాలను మాత్రం చెప్పలేకపోయాడు. 

నటన విషయానికి వస్తే కీర్తి, సమంత, విజయ్‌, దుల్కర్, రాజేంద్ర ప్రసాద్‌ ఒకరితో ఒకరు పోటీపడి నటించారు. సాధారణంగా మనకు అలవాటు అయిన మొఖాలను ఎవరైనా అనుకరిస్తుంటే ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. తనదైన శైలిలో అవతల వ్యక్తిని అనుకరించటం చాలా కష్టమైన పని. దీనిని కీర్తి, దుల్కర్ లు చాలా సులభంగా సాధించారు. (ఉదాహరణకు ఎన్టీఆర్‌లా.. దేవానంద్‌లా ఎవరు చేసినా అది అనుకరణే అనిపిస్తుంది. మనలో ఆ వ్యక్తుల అభినయాలు అంత గాఢంగా ముద్ర పడిపోతాయి).

నాగేశ్వరావుగా చైతన్య నటనే ఇబ్బందిగా ఉంది. అతని కన్నా సమంత ఆ పాత్రకు సరిపోతుందా? అని అనిపించింది. ఇక మిక్కి జే మేయర్‌ సంగీతం కూడా బావుంది. ఇంత చెప్పుకున్న తర్వాత- అసలు సావిత్రి మహానటేనా? అనుమానం ఈ సినిమా చూసిన తర్వాత కలుగుతుంది.  ఆ కాలంలో ఆమెను ఒక విజయవంతమైన నటిగానే గుర్తించారు తప్ప మహానటిగా ఎవరు అంగీకరించలేదే? (నాకు కూడా సావిత్రి అంటే ఇష్టం.. కానీ ఆమెను మహానటి అని నేను అనుకోను) సావిత్రి చేసిన సినిమాలన్నీ ఒకఎత్తు. మాయాబజార్‌, కన్యాశుల్కం, నర్తనశాలలు మరోఎత్తు.

ఈ రెండింటిలోనూ కన్యాశుల్కంలో మధురవాణి పాత్రను ఆమె పోషించిన తీరు చాలా ప్రశంసనీయం. ముఖ్యంగా రామప్పపంతులును ఆటపట్టిస్తూ- లొట్టిపిట్టలు.. అంటూ ఆమె నవ్వే తీరు మరపురానిది. (ఇది కూడా నా వ్యక్తిగత అభిప్రాయమే!) అలాంటి పాత్ర గురించి ప్రస్తావించకపోవటం నాకు వెలితిగా అనిపించింది. ఏది ఏమైనా ముందు రంగస్థలం.. ఆ తర్వాత వచ్చిన మహానటి వల్ల తెలుగు సినిమా ఎదిగిందనే భావన కలుగుతోంది.

- భావన
([email protected])

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?