cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: రాక్షసుడు

సినిమా రివ్యూ: రాక్షసుడు

సమీక్ష: రాక్షసుడు
రేటింగ్‌: 3/5
బ్యానర్‌: ఏ స్టూడియోస్‌, అభిషేక్‌ పిక్చర్స్‌
తారాగణం: బెల్లంకొండ శ్రీనివాస్‌, అనుపమ పరమేశ్వరన్‌, రాజీవ్‌ కనకాల, శరవణన్‌, సుజానే జార్జ్‌, వినోదిని వైద్యనాధన్‌, రాధారవి తదితరులు.
మాటలు: సాగర్‌
సంగీతం: జిబ్రాన్‌
కూర్పు: అమర్‌ రెడ్డి
ఛాయాగ్రహణం: వెంకట్‌ సి. దిలీప్‌
నిర్మాతలు: సత్యనారాయణ కోనేరు, హవీష్‌
కథ, కథనం: రామ్‌ కుమార్‌
దర్శకత్వం: రమేష్‌ వర్మ పెన్మెత్స
విడుదల తేదీ: ఆగస్ట్‌ 02, 2019

సీరియల్‌ కిల్లర్‌ థ్రిల్లర్స్‌ గతంలో చాలానే వచ్చాయి కానీ తమిళ 'రాచ్చసన్‌' ఆ జోనర్‌ని మన ఇండియన్‌ వెర్షన్‌లా 'సాఫ్ట్‌'గా కాకుండా 'రా'గా చూపెట్టింది. ఈ చిత్రంలో హంతకుడో రాక్షసుడు. అతని చర్యలు ఎంత కిరాతకంగా వుంటాయంటే... అతను చేసేది ఏదీ కంటికి చూపించనక్కర్లేదు. కవర్‌లో సీల్‌ చేసి పెట్టిన అమ్మాయిల మృతదేహాల విజువల్స్‌ చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. అతనెంత కిరాతకంగా చంపుతున్నాడనేది చూపించకపోయినా, పోస్ట్‌మార్టమ్‌ రిపోర్ట్‌ ద్వారా ఒక డాక్టర్‌ దానిని కళ్లకి కడతాడు. అది వింటుంటేనే... తదుపరి అతని బారిన పడబోయే అమ్మాయి పట్ల విపరీతమైన జాలి కలుగుతుంది. ఎలాగైనా హీరో ఆ పిల్లని రక్షించాలనే కోరిక కలుగుతుంది. కానీ ఇందులోని హీరో సగటు సినీ కథానాయకుడు కాదు. గుర్తు తెలియని, జాడ దొరకని రాక్షసుడిని వెంటాడుతోన్న కథానాయకుడు కూడా మనందరిలానే ఒక్కసారి తన చేతిలోంచి పరిస్థితులు చేజారిపోయాక నిస్సహాయుడిగా మిగిలిపోతాడు. సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ అయినా కానీ హయ్యర్‌ అథారిటీస్‌ని కాదని ఏమీ చేయలేని ఒక సగటు పోలీస్‌లానే అనిపిస్తాడు.

తమిళ దర్శకుడు రామ్‌ కుమార్‌ ఒక పకడ్బందీ సీరియల్‌ కిల్లర్‌ థ్రిల్లర్‌ని తీర్చిదిద్దాడు. మామూలుగా క్రైమ్‌ సినిమాలని అంత అట్మాస్ఫిరిక్‌గా తీయడం మన వాళ్లు చేయరు. ప్రేక్షకులని కొన్ని దృశ్యాలు డిస్టర్బ్‌ చేస్తాయని భయపడతారు. ఇలాంటి సినిమాలని అత్యంత పాశవికంగా, భయానకంగా తీయడం కొరియన్‌ సినిమా డైరెక్టర్లకి అలవాటు. 'రాచ్చసన్‌' చూస్తే దర్శకుడు రామ్‌ కుమార్‌పై కొరియన్‌ చిత్రాల ప్రభావం బాగా వుందనిపిస్తుంది. విలన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ కానీ, అతనుండే ఇంటి వాతావరణం కానీ హడలెత్తించేలా, నిజమైన సైకో కిల్లర్‌ ఇంట్లోకి వెళ్లిన అనుభూతిని కలిగిస్తుంది. ఎక్కడ్నుంచి స్ఫూర్తి పొందినా కానీ రామ్‌ కుమార్‌ ఒక రియలిస్టిక్‌ సైకో కిల్లర్‌ థ్రిల్లర్‌ని అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో, అంతే పకడ్బందీ డైరెక్షన్‌తో రూపొందించాడు. అది ఎంత పవర్‌ఫుల్‌ కంటెంట్‌ అంటే... దానిని మరో దర్శకుడు అంత కంటే తక్కువ క్వాలిటీ మేకింగ్‌తో, దానికి ఎందులోను సరితూగని పనితనంతో రీమేక్‌ చేసినా కానీ అంతే థ్రిల్‌ చేస్తూ, అదే రీతిన ఎంగేజ్‌ చేయగలిగింది.

రాచ్చసన్‌ చిత్రాన్ని రీమేక్‌ చేసే బాధ్యతని స్వీకరించిన రమేష్‌ వర్మ దానికి మార్పు చేర్పులు చేసే సాహసం అసలు చేయలేదు. ఇంకా చెప్పాలంటే డైరెక్టర్‌గా కంటే జెరాక్స్‌ మెషీన్‌లా పని చేసాడు. తమిళ వెర్షన్‌ మానిటర్‌లో ప్లే చేస్తూ తీసారా అన్నట్టుగా దాదాపుగా ఫ్రేమ్‌ టు ఫ్రేమ్‌ రీమేక్‌లా తెరకెక్కింది. కంటెంట్‌లో అంత క్వాలిటీ వున్నపుడు మక్కీకి మక్కీ కాపీ చేయడం నేరం కాదు కానీ దర్శకుడిగా తన విజువల్‌ సెన్స్‌ జోడిస్తే తనకంటూ ఒక ఐడెంటిటీ వచ్చేది. అలాగే తమిళ వెర్షన్‌ ఏమీ అసలు తప్పులే లేని అద్భుతం కాదు. అందులోను కొన్ని పొరపాట్లున్నాయి. అనుభవం అంతగా లేని దర్శకులలో వుండే ఓవర్‌ ఎంతూజియాజమ్‌, అవసరానికి మించి చూపించాలనే తపన ఆ చిత్రాన్ని లెంగ్తీగా మార్చాయి. కానీ ఆ లెంగ్త్‌ని కుదించడానికి కూడా ఈ 'రాక్షసుడు' ప్రయత్నించలేదు. అందులోని ఒక్క ఫ్రేమ్‌ తొలగించినా అదో పెద్ద క్రైమ్‌ అయిపోతుందన్నంత భయంతో, గౌరవంతో తెరకెక్కించారు.

రాక్షసుడు రెగ్యులర్‌ తెలుగు సినిమా ఎంటర్‌టైన్‌మెంట్‌కి, లేదా మన థ్రిల్లర్స్‌కి అలవాటు పడిన సాఫ్ట్‌ ఆడియన్స్‌కి తగ్గ మెటీరియల్‌ కాదు. విక్టిమ్స్‌ అంతా పదవ తరగతి చదువుతోన్న టీనేజ్‌ అమ్మాయిలు కావడంతో ఆ క్రైమ్‌ దృశ్యాలు 'వినడానికి' కూడా డిస్టర్బింగ్‌గా అనిపిస్తాయి. వారి హత్యల తాలూకు ఇమేజ్‌లు మాత్రమే కాకుండా ఒక దగుల్బాజీ టీచర్‌ చేసే అకృత్యాలు కూడా చాలా హైలైట్‌ అవుతాయి. విజువల్‌గా ఏ చర్యనీ చూపించకపోయినా అతని క్లోజప్స్‌, అసహాయులైన అమ్మాయిలు అతని కోరికకి తలవంచినపుడు అతను నవ్వే నవ్వులాంటివే బాగా డిస్టర్బ్‌ చేస్తాయి. అలాగే హీరోకి జరిగే పర్సనల్‌ ట్రాజెడీ లాంటివి ఎమోషనల్‌ కనక్ట్‌కి కూడా కారణమవుతాయి.

హీరోయిన్‌ వున్నా కానీ ఆమె ఎక్కడా కథకి అడ్డం పడకుండా ఎప్పుడూ కథనం ట్రాక్‌ మీదే వుంటుంది. ఇక విలన్‌ని పట్టుకోవడానికి హీరో పన్నే వల అయితే 'రెండవసారి' చూస్తున్నా కానీ అంతే అరెస్ట్‌ చేయగలిగింది. ఒరిజినల్‌ చూడని వారికి అయితే చేతి గోర్లకి గ్యారెంటీ వుండదు మరి. సెట్టింగ్‌ అంతా పర్‌ఫెక్ట్‌గా సెట్‌ చేసిన ఒరిజినల్‌ దర్శకుడు... విలన్‌ బ్యాక్‌డ్రాప్‌ దగ్గరకు వచ్చేసరికి ఒక సాధారణ ఫ్లాష్‌బ్యాక్‌ రాసాడు. ఇంత వయొలెంట్‌గా మారిపోయి ఏళ్ల తరబడి హింసని కొనసాగిస్తోన్న కారణం అంత బలంగా అనిపించదు. అలాగే విలన్‌ ఆచూకీ తెలిసి పోయిన తర్వాత సినిమా పావుగంట పాటు అనవసరంగా సాగుతుంది. ఈ పార్ట్‌లో మొదట్నుంచీ ఇరిటేట్‌ చేస్తోన్న ఒక లేడీ పోలీస్‌ క్యారెక్టర్‌ మరింతగా విసిగిస్తుంది.

మైనస్‌లు లేకపోలేదు కానీ కంటెంట్‌ సూపర్‌ స్ట్రాంగ్‌ అవడం, థ్రిల్‌కి ఏమాత్రం లోటు లేకపోవడం, జోనర్‌కి జస్టిఫికేషన్‌ చేయడం 'రాక్షసుడు'కి అతి పెద్ద బలాలు. బెల్లంకొండ శ్రీనివాస్‌ కథకి అనుగుణమైన నాయకుడిగా కనిపించడం మెచ్చుకోతగ్గ పరిణామం కానీ ఇంకా నటుడిగా మెరుగులు అవసరం. తమిళ చిత్రానికి జీవం పోసి, ప్రతి సన్నివేశాన్ని అత్యంత సహజంగా మలచిన జిబ్రాన్‌ నేపథ్య సంగీతాన్ని ఇక్కడ కూడా వాడుకోవడం రాక్షసుడికి ప్రాణం. మేకింగ్‌ పరంగా తమిళ చిత్రంలోని క్వాలిటీని తీసుకుని రాగలిగితే మరింత బాగుండేదనేది వాస్తవం. క్వాలిటీ కంటెంట్‌ చేతిలో వున్నపుడు కూడా మేకింగ్‌ పరమైన కాంప్రమైజెస్‌ని సమర్ధించలేం. ఎంటర్‌టైన్‌మెంట్‌ని మాత్రమే ఆశించే ప్రేక్షకులకి ఈ రియలిస్టిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ కాస్త హై డోస్‌ అవుతుంది కానీ సిసలైన థ్రిల్లర్‌ చూడాలనుకునే వారికి ఇటీవలి కాలంలో ఇదొక మంచి అవకాశం.

బాటమ్‌ లైన్‌: 'రా'క్షసుడు!
- గణేష్‌ రావూరి

సినిమా రివ్యూ: ఇస్మార్ట్‌ శంకర్‌     సినిమా రివ్యూ: డియర్‌ కామ్రేడ్‌

 


×