Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: ఒక మనసు

సినిమా రివ్యూ: ఒక మనసు

రివ్యూ: ఒక మనసు
రేటింగ్‌: 2/5

బ్యానర్‌: మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌
తారాగణం: నాగశౌర్య, నిహారిక కొణిదెల, రావు రమేష్‌, ప్రగతి, శ్రీనివాస్‌ అవసరాల, హేమంత్‌, నాగినీడు, వెన్నెల కిషోర్‌, కృష్ణభగవాన్‌ తదితరులు
సంగీతం: సునీల్‌ కశ్యప్‌
కూర్పు: ధర్మేంద్ర కాకర్ల
ఛాయాగ్రహణం: రామ్‌రెడ్డి
నిర్మాత: మధుర శ్రీధర్‌ రెడ్డి
రచన, దర్శకత్వం: రామరాజు
విడుదల తేదీ: జూన్‌ 24, 2016

సూర్యాస్తమయం, సముద్రతీరం, మోడువారిన చెట్టు, బీట తీసిన గోడ, ఎగురుతున్న కర్టెన్‌, సిలొయెట్‌లో ఓ ప్రేమ జంట... 'ఒక మనసు' గురించి ఒకే వాక్యంలో చెప్పుకోవాలంటే ఇంతకుమించి ఏం లేదు. ఒక మధురమైన ప్రేమకథని వెండితెరపై ఆవిష్కరిస్తే అదో మర్చిపోలేని కావ్యమవుతుంది. అదే ఒక ప్రేమకావ్యాన్ని తీయాలనే తపనతో ఒక ప్రేమకథని చెప్పబోతే అది 'ఒక మనసు'లా తయారవుతుంది. క్లాసిక్స్‌ ఎప్పుడూ కావాలని ట్రై చేస్తే తయారవ్వవు. హత్తుకునే భావోద్వేగాలుంటే, కదిలించే అనుభూతులుంటే, గుర్తుంచుకునే అనుభవాలుంటే... అవి క్లాసిక్స్‌గా మిగిలిపోతాయి తప్ప, అచ్చంగా కావ్యాన్నే తీసేద్దామని తపన పడితే ఇలా నీడలు, నీరసాలే తప్ప మనుషులు, మనసులు గుర్తుండవు. 

మెడిసిన్‌ చదివిన ఈ తరం అమ్మాయి, భవిష్యత్తేంటో తెలియని ఒక ఆవేశపరునితో పీకల్లోతు ప్రేమలో పడిపోతుంది. చూడగానే ఆ అబ్బాయిని ఈ అమ్మాయి ప్రేమించిందట... కారణమేంటంటే, ఎక్కడో చూసినట్టుంది, బహుశా గత జన్మలోనో ఏమో అంటుంది. రాజకీయ నాయకుడు కావాలని చూస్తోన్న ఆ అబ్బాయి ఒక కేసులో ఇరుక్కుని జైలుకి వెళితే అతను తిరిగొచ్చే వరకు ఎదురు చూస్తుంది. నాతో రేపేంటో కూడా తెలీదని, ఎప్పుడు తిరిగి జైలుకి పోతానో అని అతను అంటే, ఫరవాలేదని అతనితో కలిసుండడానికే వెళ్లిపోతుంది. 'నేనిష్టమా... మీ నాన్న ఇష్టమా' అంటూ అతడిని అడిగితే, అతను 'మా నాన్నే' అంటాడు క్షణం ఆలోచించకుండా. ఆ క్షణం చిన్నబోయినా కానీ 'అంతేలే చిన్నప్పట్నుంచీ పెంచిన నాన్న కంటే నేనిష్టమంటే నేనెలా నమ్ముతా' అని తర్వాత చెబుతుంది. ఆ అబ్బాయికి తండ్రి మీద అంత ప్రేమ ఉన్నప్పుడు తన తల్లి మీద తనకి కనీసం అందులో సగం ఉండాలని ఆమె అనుకోదు. పైగా తన తల్లి భర్త అండ లేకపోయినా కానీ కూతుళ్లు ఇద్దరినీ ప్రేమగా పెంచుతుంది. అలాంటప్పుడు తల్లి మీద తనకెంత ప్రేమ ఉండాలి? లేదా ఈ తల్లిని వదిలేసి అతనితో ఉండడానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకోవడానికి అతనెంత ఉత్తముడై ఉండాలి? 

పొద్దున్న కలవడం, సాయంత్రం వరకు పిచ్చాపాటీ మాట్లాడుకోవడం... కట్‌ చేసి, ఓపెన్‌ చేస్తే... మళ్లీ ఇద్దరూ కలిసి కనిపించడం. ఒక్కోసారి కనీసం సీన్‌ కట్‌ అయి ఓపెన్‌ అయిందో లేదో అనే అనుమానం కూడా వస్తుంది. హీరో హీరోయిన్ల బట్టలు మారడాన్ని బట్టి సీను మారింది, తేదీ మారింది అనేసుకోవాలి. ఒక సీన్లో హీరో నుంచి సెలవు తీసుకుంటూ 'ఈరోజు నా కలలోకి వస్తావా?' అని అడుగుతుంది హీరోయిన్‌. కట్‌ చేసి, ఓపెన్‌ చేస్తే.. 'నువ్వు నా కలలోకి వచ్చావ్‌. పెద్ద రాజకీయ నాయకుడివైపోయావ్‌' అంటుంది. స్క్రీన్‌ప్లే ఎలా ఉందనేది చెప్పడానికి ఈ సీనో చిన్న ఉదాహరణ అంతే. ఎందుకంటే సినిమాలో సింహభాగం... హీరో హీరోయిన్లిద్దరూ మాట్లాడుకుంటూనే ఉంటారు... అనర్గళంగా, అన్యాపదంగా, కొన్నిసార్లు అసందర్భంగా! 

'ఒక మనసు' చిత్రం పబ్లిసిటీ కార్యక్రమాల్లో దీనిని మరో గీతాంజలి, మరో చరిత్రలాంటి క్లాసిక్‌ లవ్‌స్టోరీ అని చెప్పుకొచ్చారు. ఆ సినిమాల్లోని అనుభూతి, ఆ చిత్రాలు మనపై వేసే చెరిగిపోని ముద్ర సంగతి అటుంచితే... ఆ సినిమాలు ఆ కాలానికి చాలా అడ్వాన్స్‌డ్‌గా ప్రేమకథల్ని చెప్పాయి. ఒక సీతాకోకచిలుక, ఒక మరో చరిత్ర... యువతరంలోని రెబలియస్‌ ఆటిట్యూడ్‌ని చూపించాయి. 'ఒక మనసు'లోని పాత్రల్ని చూస్తుంటే, ఇది అసలు ఈ కాలం నాటి కథేనా, వీళ్లు కూడా మనుషులేనా? అనే అనుమానం వస్తుందొక్కోసారి. ఒక పాటలో సడన్‌గా నిహారిక డాన్స్‌ చేస్తుంటే... అదేదో ప్రపంచ వింతలా కనిపిస్తుంది. ఓహ్‌.. వీళ్లూ మనలాంటి మనుషులే అన్నమాట, మామూలు ఎమోషన్లు ఉంటాయన్నమాట, మనలానే స్పందిస్తారన్నమాట అనుకోవాల్సి వస్తుంది. ఈ క్యారెక్టర్లలో సహజత్వం ఏ కోశానా లేదు. అంతటా ఆర్టిఫిషియాలిటీ... ప్రేమ ఒక దివ్యానుభూతి అని చాటి చెప్పే ప్రయత్నంలో అసహజత్వం, నాటకీయత అవధులు దాటి మరీ ఒక మనసుని భరించలేనంత భారంగా మార్చేసాయి. 

రాజకీయాలు, రొమాన్స్‌... ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్‌ కుదర్చడం కష్టమని యువ, ముకుంద లాంటి చిత్రాలు తేల్చాయి. ఇప్పుడు దానికి మరింత బలం చేకూర్చడానికా అన్నట్టు 'ఒక మనసు' వచ్చి చేరింది. అయితే ఇందులో రాజకీయాల పాత్ర అంత లేదు. ఒక ప్రేమజంట మధ్య అగాధం ఏర్పరచడానికి కేవలం ఒక డివైస్‌లా వాడుకున్నారే తప్ప పాలిటిక్స్‌కి ఇందులో అంత ఇంపార్టెన్స్‌ ఇవ్వలేదు. ఆ మాటకొస్తే ఇందులో ప్రేమజంటకి తప్ప మరి దేనికీ తావివ్వలేదు. ఇంకా చెప్పాలంటే... వారిద్దరి మాటలకి తప్ప ఇంకోదానికి చోటివ్వలేదు. ఇందులో ప్రేమికులు ఎంతగా మాట్లాడుకుంటారంటే... కనీసం సంగీత దర్శకుడిని కూడా పూర్తిగా తన టాలెంట్‌ చూపించనివ్వనంతగా. ప్రతి పాటకీ మళ్లీ మళ్లీ అడ్డు పడి మరీ వీరిద్దరూ మాట్లాడుకుంటారు. ఈ జంటని చూపిస్తే మన తాతల కాలం వాళ్లకి 'వీళ్లకంటే మేమే అడ్వాన్స్‌డ్‌ కదా' అనిపిస్తుంది. మన పిల్లలకి చూపిస్తే... 'ప్రేమంటే ఇంత బోరింగ్‌గా ఉంటుందా... సర్లే, బుద్ధిగా చదువుకుని బాగుపడదాం' అనిపిస్తుంది. 

బుల్లితెరపై, యూట్యూబ్‌లో మనం చూసిన నిహారిక బబ్లీగా, ఎనర్జిటిక్‌గా కనిపిస్తే, ఇందులో తన ఏజ్‌కి మించిన లుక్‌తో, పంతొమ్మిది వందల యాభైల కాలంలో వచ్చిన ఏ సినిమాలోంచో, అప్పట్లో అచ్చయిన ఓ నవల్లోంచో వచ్చి తెర మీద జారి పడ్డట్టున్న పాత్రలో నీరసంగా, నిస్తేజంగా కనిపిస్తుంది. తనకిచ్చిన పాత్రకి న్యాయం చేయడానికి తన వంతు కృషి చేసింది కానీ... 'అష్టాచమ్మా' సినిమాలో స్వాతి తరహా పాత్రనో, 'బొమ్మరిల్లు'లో హాసినిలాటి క్యారెక్టర్‌నో ఎంచుకుని తొలి అడుగు వేసుండుంటే బాగుండేది. నాగశౌర్యకి నటుడిగా కొత్త పరీక్షలేం పెట్టలేదు.  తను కూడా దర్శకుడు చెప్పింది బాగానే చేసాడు. ఈమధ్య ప్రతి సినిమాలోను తనే హైలైట్‌ అయిపోతూ వస్తోన్న రావు రమేష్‌కి ఒక్కసారి సైడ్‌ లైన్‌ అయిపోయే పాత్ర చేస్తే ఎలాగుంటుందో ఈ సినిమా వల్ల తెలిసుంటుంది. శ్రీనివాస్‌ అవసరాల పాత్ర అవసరమేంటో దర్శకుడికే తెలియాలి. కృష్ణభగవాన్‌, వెన్నెల కిషోర్‌ చేసింది కామెడీనే అనుకుని నవ్వుకోవాలి. ఒక్క సీన్‌ ఇచ్చినా ఉనికి నిలబెట్టుకోవడమెలానో ప్రగతిని చూసి తెలుసుకోవాలి. రేడియో హేమంత్‌, రాజా రవీంద్ర పాత్రలు చిన్నవైనా కొద్దో గొప్పో కథకి ఇంకొక డైమెన్షన్‌ ఇచ్చింది వాళ్లే.

ప్రేమకథా చిత్రాలకి ఆయువు పోసేదీ... వాటి ఆయువు పెంచేదీ కూడా పాటలే. అలాంటి ఒక్క పాటని కూడా సునీల్‌ కశ్యప్‌ ఇవ్వలేకపోయాడు. ఒకటి రెండు ట్రాక్‌ల నేపథ్య సంగీతాన్ని అటు, ఇటుగా సినిమా అంతటా వినిపించాడంటే అది అతని తప్పు కాదు. సినిమా అంతా అదే ఉంటే, ఇక అతను మాత్రం వేరేది ఏదైనా ఎలా ట్రై చేస్తాడు? ఎడిటర్‌ చాలా ఇబ్బంది పడి ఉండాలి... అక్కడే కట్‌ అయి, అక్కడే ఓపెన్‌ అవుతోన్న సీన్లని అన్నీ ఒక వరసలో పెట్టడానికి! హీరో హీరోయిన్లని ఫోకస్‌లో పెట్టి మిగతాదంతా అవుట్‌ ఫోకస్‌లో ఉంచడమనేది ఈ సినిమాలో జరిగినంతగా మరెందులోను చేసి ఉండరేమో. దానికి ఛాయాగ్రాహకుడిని అనుకుని లాభం లేదు. ఎందుకంటే అది దర్శకుడి కాల్‌ అనిపిస్తుంది. నిర్మాతలకి పెద్దగా ఖర్చు లేకుండా సింపుల్‌ లొకేషన్లని ఎంచుకున్నాడు దర్శకుడు. కవితాత్మకంగా తన ప్రేమకథని తెర మీద ఆవిష్కరించాలనే ప్రయత్నం మంచిదే. ప్రేమకథలంటే కేవలం శృంగారం, అశ్లీలం మాత్రమే అనిపించేలా చేస్తోన్న ఈ కాలంలో ఒక అమలిన ప్రేమకథని చెప్పే ఉద్దేశం మెచ్చుకోతగిందే. అయితే దాని కోసమని పాత్రలని కూడా మరీ అసహజంగా, పాత కాలానికి చెందిన వాళ్లలా చూపించాల్సిన పని లేదు. నేటి తరం మెచ్చే ప్రేమకథల్ని కూడా నీట్‌గా చెప్పుకోవచ్చు... మరీ ఇంతటి సీరియల్‌ తరహా డ్రామా లేకుండా. 

టైటిల్‌ పడ్డానికి ముందో పది నిమిషాల కథ జరుగుతుంది. అప్పుడు టైటిల్‌ వేయగానే.. శుభం కార్డు పడ్డ ఫీలింగొస్తుంది. ఒక పది సెకన్ల పాటు ఆ ఫ్రేమ్‌ని ఫ్రీజ్‌ చేసినట్టయితే, సినిమా అయిపోయిందేమోనని జనం సీట్లలోంచి లేచి పోయేవారేమో. పది నిమిషాలకే ఒక నిండు సినిమా చూసిన అనుభూతిని కలిగించిన 'ఒక మనసు' అదే వేగంతో ముందుకి నడుస్తూ రెండున్నర గంటల్లో ఎంత సినిమా చూపించి ఉంటుందనేది మీ ఊహలకే వదిలేస్తున్నాం. 

బోటమ్‌ లైన్‌: భారమైన మనసు!

- గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?