Advertisement

Advertisement


Home > Movies - Reviews

రివ్యూ: సంజు (హిందీ)

రివ్యూ: సంజు (హిందీ)

రివ్యూ: సంజు (హిందీ)
రేటింగ్‌: 3/5
బ్యానర్‌:
వినోద్‌ చోప్రా ఫిలింస్‌, రాజ్‌కుమార్‌ హిరాని ఫిలింస్‌
తారాగణం: రణ్‌భీర్‌ కపూర్‌, పరేష్‌ రావల్‌, విక్కీ కౌశల్‌, అనుష్క శర్మ, మనీషా కొయిరాలా, దియా మీర్జా, సోనమ్‌ కపూర్‌, బొమన్‌ ఇరాని, సయాజి షిండే తదితరులు
సంగీతం: ఏ.ఆర్‌. రెహమాన్‌, రోహన్‌ రోహన్‌, విక్రమ్‌
ఛాయాగ్రహణం: రవివర్మన్‌
నిర్మాతలు: విధు వినోద్‌ చోప్రా, రాజ్‌కుమార్‌ హిరాని
కథ, కథనం, మాటలు: రాజ్‌కుమార్‌ హిరాని, అభిజాత్‌ జోషి
కూర్పు, దర్శకత్వం: రాజ్‌కుమార్‌ హిరాని
విడుదల తేదీ: జూన్‌ 29, 2018

తన కథని ప్రపంచానికి చెప్పడం కోసం ఒక రచయిత కోసం చూస్తోన్న సంజయ్‌ దత్‌ సీన్‌తో 'సంజు' ఓపెన్‌ అవుతుంది. ఈ సీన్‌ని అతని నిజ జీవితానికి అన్వయించుకుంటే తన కథ చెప్పడానికో దర్శకుడి కోసం చూస్తోంటే 'మున్నాభాయ్‌' దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాని కనిపించాడా అనిపిస్తుంది. 'సంజు' కథ, కథనాలు రాసింది అధికారికంగా హిరాని, అభిజాత్‌ జోషి కావచ్చు. కానీ తనకేది కావాలో అది సంజయ్‌ దత్‌ రాయించుకున్నాడని, ఇన్‌డైరెక్ట్‌గా ఈ చిత్రాన్ని సూపర్‌వైజ్‌ చేసాడని ఈ చిత్రం చూసాక అనిపిస్తే అది మన తప్పు కాదు. 

'బ్యాడ్‌ బోయ్‌' ఇమేజ్‌ తెచ్చుకున్న బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్‌ దత్‌ జీవితాన్ని దర్శక, రచయితల కోణంలో కాకుండా పూర్తిగా దత్‌, అతని భార్య మాన్యత పర్యవేక్షణలోనే తెరకెక్కించారనే భావన సినిమా అంతటా కలుగుతుంది. దత్‌ జీవితంలో చేసిన ప్రతి తప్పుకీ మరొకరిని కారకులుగానో, ఉత్ప్రేరకులుగానో 'సంజు' చిత్రీకరిస్తుంది. అతని డ్రగ్‌ ఎడిక్షన్‌కి, అక్రమ ఆయుధాల కేసులో జైలుకి వెళ్లడానికి, అతను జీవితంలో చేసిన ప్రతి తప్పుకీ ఇందులో కన్విన్స్‌ చేయాలని చూసే వివరణ లేదా నిజాలని వైట్‌ వాష్‌ చేసి సాఫ్ట్‌గా చూపించే సవరణ కనిపిస్తుంది. హై స్టాండర్డ్‌ సెట్‌ చేసిన తల్లిదండ్రుల స్థాయిని అందుకోలేక మదన పడుతూ సంజయ్‌ దత్‌ డ్రగ్స్‌ జోలికి వెళ్లాడన్నట్టు, స్నేహితుడిలా దగ్గరయి ఒకడు స్వార్ధం కోసం తనకి డ్రగ్స్‌ అలవాటు చేసాడన్నట్టు చూపించారు. అక్రమ ఆయుధాలు కలిగి వుండడమనేది తన కుటుంబ రక్షణ కోసం అమాయకత్వంతో చేసిన పనిగా చిత్రించారు. ఇక దత్‌ జీవితంలోని చాలా తప్పులకి మీడియానే కారణమన్నట్టు కలర్‌ ఇచ్చారు. అంతటితో ఆగలేదు... సినిమా అయిపోయిన తర్వాత రియల్‌ సంజయ్‌దత్‌ వచ్చి 'బాబా బోల్తా హై బస్‌ హోగయా' అంటూ మీడియాపై డైరెక్ట్‌ సెటైర్లు కూడా విసిరేసి తప్పంతా మీడియాదేనని తేల్చేసాడు.

'సంజు' నిజాన్ని చాటి చెప్పిన సినిమాగా కంటే సంజయ్‌-మాన్యతల పీఆర్‌ ఎక్సర్‌సైజ్‌ మాదిరిగా తయారైంది. ఒక కథని బయటినుంచి రీసెర్చ్‌ చేసి ఫ్యాక్ట్స్‌ని తెరకెక్కించినపుడు ఆ బయోపిక్‌ ఒకలా వుంటుంది. 'సబ్జెక్ట్‌'ని పక్కన పెట్టుకుని వారి అదుపాజ్ఞల్లో దానిని తీర్చిదిద్దితే సంజులా వుంటుంది. ఖచ్చితంగా ఈ చిత్రం ఉన్నది ఉన్నట్టు చూపించలేదు. తను రాయాలనుకుని రాయలేకపోయిన బుక్‌ని ఇలా సినిమా రూపంలోకి సంజయ్‌ దత్‌ తెచ్చుకున్నట్టు, అంతిమంగా తన అమాయకత్వాన్ని ప్రపంచానికి చాటుకుని, మూడు వందల యాభై మంది స్త్రీలతో శృంగారం చేసిన వీర చరిత్రని ప్రపంచానికి మహా గొప్పగా చాటుకున్నట్టు అనిపిస్తుంది. 

వాస్తవాలని, వార్తలని అటుంచితే... సినిమాగా దీనిని రాజ్‌కుమార్‌ హిరాని తనకి మాత్రమే చెల్లిన రీతిలో పకడ్బందీగా రూపొందించాడు. ఎమోషన్‌ని, హ్యూమర్‌ని ఒకే సీన్‌లో మిక్స్‌ చేయగల తన నేర్పుతో అత్యంత క్లిష్టమైన సన్నివేశాల్లోకి కూడా హాస్యానికి అవలీలగా చోటు కల్పించి ఈ విద్యలో తనని మించిన వాడు లేడనిపించాడు. సంజయ్‌ దత్‌లోని లోపాలని, అతను చేసిన ఘోరమైన తప్పిదాలని కామెడీతో మిళితం చేసేసి అతని ఇమేజ్‌ ఎఫెక్ట్‌ కాకుండా చెప్పిన విధానం ఆకట్టుకుంటుంది. ఇక డ్రగ్స్‌కి బానిసగా మారి ఉఛ్ఛనీచాలు మర్చిపోయిన వ్యక్తి తాలూకు భావోద్వేగాలని క్యాప్చర్‌ చేసిన తీరు, ఆ మహమ్మారి నుంచి బయటపడేందుకు పడే సంఘర్షణ లాంటివి కదిలించేలా తెరకెక్కించిన విధానం హిరాని గొప్పతనాన్ని చాటి చెబుతుంది. స్టార్స్‌ ఫ్యామిలీ అనే దానిని కాకుండా సగటు తండ్రీ కొడుకుల అనుబంధాన్ని రసవత్తరంగా చూపించిన తీరు దర్శకుడిగా తన స్థాయి తెలియజేస్తుంది. 

బయోపిక్స్‌ విషయంలో సదరు వ్యక్తి పోలికలు ఈ లీడ్‌ యాక్టర్‌లో కనిపిస్తే సగం పని అయిపోయినట్టే. రణ్‌భీర్‌ కపూర్‌కి, సంజయ్‌ దత్‌కి నిజానికి అసలు పోలికే లేదు. కానీ 'సంజు' చూసిన తర్వాత అతను సంజయ్‌లా వుండడని ఎవరైనా అంటే అంగీకరించలేం. ఆ పాత్రలోకి ఎంతగా పరకాయ ప్రవేశం చేసాడంటే కేవలం హావభావాలు, ఆహార్యాన్ని అనుకరించడమే కాకుండా వివిధ దశల్లో సంజయ్‌ ఎలాగున్నాడో తను కూడా అలాగే కనిపించాడు. ట్రాన్స్‌ఫర్మేషన్‌ కోసం పడిన కష్టం ఒక ఎత్తు అయితే, సంజులోని భావోద్వేగాలని పలికించిన తీరుకి రణ్‌బీర్‌కి ఎన్ని అవార్డులిచ్చినా తక్కువే. ముఖ్యంగా డ్రగ్స్‌కి బానిసగా మారి తన మీద తాను కంట్రోల్‌ కోల్పోయిన సన్నివేశాల్లో అతని నటన గుర్తుండిపోతుంది. ఈ క్యారెక్టర్‌ చేయడానికి ఇంతకంటే బెటర్‌ యాక్టర్‌ దొరకడనిపిస్తుంది. చివర్లో రియల్‌ సంజయ్‌ దత్‌ వచ్చి డాన్స్‌ చేస్తోంటే, సంజు కథలో ఇతనికేం పని అని ఓ క్షణం అనుకునేంత గొప్పగా రణ్‌బీర్‌ నటించాడు. సంజయ్‌దత్‌తో కలిసి రణ్‌బీర్‌ డాన్స్‌ చేస్తోంటే, ఓహ్‌ ఇది కదా ఇతని అసలు రూపం అని ఆశ్చర్యపోయేట్టు చేసాడు. అతని ట్రాన్స్‌ఫర్మేషన్‌లో కాస్త క్రెడిట్‌ మేకప్‌ ఆర్టిస్టులకి కూడా దక్కుతుంది కానీ సంజు కేవలం మేకప్‌, లుక్స్‌ ఘనత కానే కాదు... ఒక గొప్ప నటుడి సామర్ధ్యానికి కొలత. 

సపోర్టింగ్‌ రోల్స్‌లో పరేష్‌, విక్కీ తమ పాత్రలకి ప్రాణం పోసారు. అనుష్క శర్మ విగ్‌ విచిత్రంగా వుంది. ప్రసిద్ధి చెందిన రచయిత్రిగా తనకిచ్చిన బిల్డప్‌కి అనుగుణంగా ఆమె రియాక్షన్లుండవు. మరీ డెయిలీ సీరియల్‌ చూసి ఎమోషనల్‌ ఫీలయినట్టుగా సంజయ్‌ కథ విని కన్నీళ్లు పెట్టుకుంటుంది. మనీషా కొయిరాలా, సోనమ్‌ కపూర్‌ తమ పరిధిలో మెప్పించారు. సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలున్నాయి. 

ప్రథమార్ధం పూర్తిగా యువకుడైన సంజు డ్రగ్‌ అడిక్షన్‌పై ఫోకస్‌ పెడితే, ద్వితియార్ధం అతని జీవితంలోని పలు పార్శ్వాలని స్పృశిస్తుంది. ఈ పార్ట్‌లో చాలా వరకు సంజయ్‌ దత్‌కి అనుకూలమైన కథనం వుండడం వల్ల చాలా సన్నివేశాలు రక్తి కట్టలేదు. ప్రతి చోట అతడు పరిస్థితుల వల్ల విక్టిమ్‌ అయ్యాడన్నట్టు చూపించడం, 'బాబా' అనే ముద్దు పేరుకి తగ్గట్టు జైల్లో బాబాలానే చిత్రించడం బాలేదు. ఎంత పక్కన వుండి కథ నడిపించినా కానీ బయోపిక్‌ అన్నపుడు వాస్తవ విరుద్ధంగా అనిపించడం తగదు. ఇక సరయిన ముగింపు లేని కథ కావడం వల్ల క్లయిమాక్స్‌లో ఎలాంటి హైస్‌ వుండవు. పూర్తిగా సంజయ్‌ ప్రైవేట్‌ లైఫ్‌, అతని స్ట్రగుల్‌, తండ్రితో అతని అనుబంధం, ప్రాణ స్నేహితుడితో అతనికున్న బంధం మాత్రమే కవర్‌ చేయడం వల్ల అతని స్టార్‌ లైఫ్‌ని క్యాప్చర్‌ చేసేందుకు తగిన సమయం దొరకలేదు. అన్నీ కాకపోయినా సంజయ్‌ కెరీర్లో కీలకమైన చిత్రాల షూటింగ్స్‌, అతనికి ఇతర స్టార్స్‌తో వున్న రిలేషన్స్‌ లాంటివి టచ్‌ చేసినట్టయితే మాస్‌ ప్రేక్షకులకి కాస్త మసాలా దొరికేది. 'మున్నాభాయ్‌ ఎంబిబిఎస్‌' షూటింగ్‌ సీన్‌ చూపిస్తే వచ్చిన స్పందన చూస్తే హిరానీకి కూడా ఇదే అనిపించాలి. 

హిరాని మార్కు ఎమోషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, చిక్కని డ్రామా, అద్భుతమైన సన్నివేశాలు, ఆహ్లాదకర సంభాషణలు అన్నీ వున్నా కానీ తన స్థాయి దర్శకుడు కేవలం 'చెప్పింది' సినిమాగా తీయడమే వెలితిగా అనిపిస్తుంది. ఫిక్షన్‌ని ఎవరికి తోచినట్టు వారు తీసుకోవచ్చు కానీ రియాలిటీ విషయంలో రాజీ పడితే సదరు సినిమా ఎమోషన్స్‌తో మనసుని తాకవచ్చునేమో కానీ లాజిక్‌తో ఒప్పించడం కష్టం. ట్రెయిలర్‌ చూసి హిరానీ వాస్తవాన్ని చాలా హార్డ్‌ హిట్టింగ్‌గా చెప్పబోతున్నాడని ఆశించి వస్తే మాత్రం అదంతా అతని ఎడిటింగ్‌ నైపుణ్యం మాత్రమేనని, నిజానికి నిజాలని పక్కనపడేసి పరిస్థితులని, వేరొకరిని నిందితులని చేస్తూ సంజయ్‌ దత్‌ నిజాయితీ చాటుకోవడానికి చేసిన ప్రయత్నమని తెలిసి ఒకింత నిర్ఘాంతపోయి, ఎన్నో ఇంతలు నిరాశ చెందాల్సి వస్తుంది. 

బాటమ్‌ లైన్‌: 'సంజు' చెప్పినట్టు!

గణేష్‌ రావూరి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?