ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, కొవిడ్ నిబంధనలు ఎంత బాగా పాటించినా.. ఆ మహమ్మారి దాడి మాత్రం ఆగలేదు. తాజాగా విద్యార్థులపై కరోనా పంజా విసిరింది. కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రు హైస్కూల్ విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 10 మందికి కరోనా పాజిటివ్ రావడంతో స్కూల్ కి తాళాలు వేసి, సెలవు ప్రకటించారు అధికారులు.
ఏపీలో ఈనెల 16న స్కూల్స్ తిరిగి ప్రారంభమైన సందర్భంలో ప్రతి వారం పిల్లలకు, ఉపాధ్యాయులకు ర్యాండమ్ టెస్ట్ లు చేయించాలని వైద్యశాఖను ఆదేశించింది ప్రభుత్వం. ఈ క్రమంలో గత శుక్రవారం పిల్లలకు, ఉపాధ్యాయులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఆ ఫలితాలు ఈరోజు వచ్చాయి. మొత్తం 10మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది.
దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. స్కూల్ మూసివేసి సెలవు ప్రకటించారు. స్కూల్ మొత్తం శానిటైజ్ చేయిస్తున్నారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా ఆదేశాలిచ్చారు.
సెకెండ్ వేవ్ నిబంధనల సడలింపుల్లో భాగంగా రాష్ట్రాలు మినహాయింపులు ఇస్తూ వస్తున్నాయి. ఇందులో భాగంగా.. ఏపీలాంటి కొన్ని రాష్ట్రాలు మాత్రమే ధైర్యం చేసి స్సూల్స్ తెరిచాయి. తమిళనాడు సెప్టెంబర్-1 నుంచి తరగతి గది బోధనకు ఓకే చెప్పింది. తెలంగాణ ఇంకా ఆ ధైర్యం చేయలేదు.
విద్యా రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం మరికొన్నాళ్లు స్కూళ్లు తెరుచుకోకపోతే విద్యార్థులకు తీవ్ర నష్టం జరిగే అవకాశముంది. అందుకే ఏపీ సర్కారు ఈ విషయంలో ముందడుగేసి స్కూళ్లు, కాలేజీలు తెరిచింది. అయితే కృష్ణా జిల్లా ఘటన ఒక్కసారిగా అందరిలో ఆందోళన రేకెత్తిస్తోంది. మరింత పగడ్బందీగా స్కూల్స్ నడపాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతోంది.