జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణానికి సంబంధించి కేంద్ర జలవనరుల శాఖ నిధుల విడుదల చేసింది. పెట్టిన ఖర్చుకు సంబంధించి 1850 కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వ ఖాతాలోకి జమ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. గత రెండు సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఖర్చు అయిన నిధులను కేంద్రం రీయింబర్స్ చేయడం ఇదే తొలి సారి. ఇదంతా చాలా కాలం కిందట చేసిన ఖర్చే.
పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కావడంతో.. కేంద్రమే మొత్తం ఖర్చు భరించి, నిర్మించాల్సి ఉంది. అయితే చంద్రబాబు నాయుడు కాంట్రాక్టు వ్యవహారాలను తనకు అప్పగించాలని అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంతో ఒప్పందం చేసుకున్నారు. తను చెప్పిన వారికే కాంట్రాక్టులు దక్కేలా చూసుకున్నారు. డైరెక్టుగా కేంద్రమే నిర్మించాల్సిన ఈ ప్రాజెక్టు విషయంలో.. ఏపీ ముందుగా ఖర్చు పెట్టడం, తర్వాత కేంద్రం నిధులు విడుదల చేయడం అనే పద్ధతికి తెచ్చారు చంద్రబాబు.
అయితే ఆ నిధులను కూడా తెప్పించుకోలేకపోయారు. ఆడిటింగ్ స్టేట్ మెంట్స్ ను అప్పగిస్తే నిధులు విడుదల అయ్యే అవకాశం ఉన్నా చంద్రబాబు నాయుడు వాటిని కేంద్రానికి సమర్పించలేదని గతంలో వార్తలు వచ్చాయి. ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా.. ఆడిటింగ్ కు సంబంధించిన స్టేట్ మెంట్స్ ను కేంద్రానికి సమర్పించినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో 1850 కోట్ల రూపాయల మొత్తం కేంద్రం నుంచి విడుదల అయినట్టుగా తెలుస్తోంది. ఇంకా కేంద్రం రీయింబర్స్ చేయాల్సిన నిధులు భారీగానే ఉన్నాయని, మరో 3,650 కోట్ల రూపాయల కేటాయింపు జరగాల్సి ఉందని తెలుస్తోంది.