ప్రజాస్వామ్య పరిరక్షణ.. విస్తృత ప్రయోజనాలు

రాజకీయాల్లో కొన్ని పడికట్టు పదాలు కొంతమంది మాత్రమే చెప్పగలరు. అలా చెప్పే మాటల్ని ప్రజలు విశ్వసిస్తున్నారా లేదా అనే విషయం పక్కనపెడితే వాటిపై పేటెంట్ హక్కు వారికి మాత్రమే సొంతం.  Advertisement ప్రజాస్వామ్య పరిరక్షణ…

రాజకీయాల్లో కొన్ని పడికట్టు పదాలు కొంతమంది మాత్రమే చెప్పగలరు. అలా చెప్పే మాటల్ని ప్రజలు విశ్వసిస్తున్నారా లేదా అనే విషయం పక్కనపెడితే వాటిపై పేటెంట్ హక్కు వారికి మాత్రమే సొంతం. 

ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట చంద్రబాబు ఎన్ని నాటకాలు ఆడారో చూశాం. ఇప్పుడు పవన్ కల్యాణ్ ''విస్తృత ప్రయోజనాలు'' అనే పదప్రయోగాన్ని అందుకున్నారు.

''ప్రజాస్వామ్య పరిరక్షణ'' పేరుతో ఆయన ఎంత నీఛ రాజకీయాలు చేశారో అందరికీ తెలుసు. వామపక్షాలతో కలసినా, టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నా, బీజేపీతో కూటమి కట్టినా.. చివరకు తెలుగుదేశం పుట్టుకకు కారణమైన కాంగ్రెస్ కాళ్లు పట్టుకున్నా కూడా అది చంద్రబాబుకి మాత్రమే సాధ్యం. దానికి ఆయన పెట్టిన అందమైన పేరు ప్రజాస్వామ్య పరిరక్షణ.

అవును… ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమంటూ అపవిత్ర పొత్తులన్నిటినీ తనకు అనుకూలంగా చెప్పుకుంటారు చంద్రబాబు. తన అను''కుల'' మీడియాతో వాటిని సమర్థించుకుంటారు. నిన్న తిట్టినవారిని ఈరోజు పొగుడుతారు, మొన్న పొగిడిన వారిని రేపు శత్రువులుగా చూస్తారు. 

ఎక్కడ ఏది చేసినా అది ఆయన రాజకీయ స్వలాభం కోసం అన్నమాట మాత్రం మరచిపోకూడదు. పైకి మాత్రం అది ప్రజాస్వామ్య పరిరక్షణ.

ఇప్పుడు ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ కూడా అలాంటి ''ప్రజా ప్రయోజనాల'' కోసమే తానూ రాజకీయాలు చేస్తున్నానంటూ గొప్పలు చెప్పుకుంటుంటారు. అయితే పవన్ బ్రాండ్ స్లోగన్ వేరే. ''విస్తృత ప్రయోజనాలు'' అనేది పవన్ పడికట్టు పదం.

2014లో ఏపీ-తెలంగాణ విస్తృత ప్రయోజనాల కోసం టీడీపీ-బీజేపీకి మద్దతిచ్చానని చెప్పుకున్నారు పవన్ కల్యాణ్. ఆ ప్రయోజనాలు ఎవరికో, ఎందుకో ఆయనకే తెలియాలి. తాజాగా గ్రేటర్ ఎన్నికల్లో కూడా విస్తృత ప్రయోజనాలు అనే పదం బాగా వాడుకలోకి వచ్చింది. 

గ్రేటర్ బరిలో జనసేన దిగుతుంది అని చెప్పిన నోటితోటే.. రెండు రోజులు తిరక్కుండానే విస్తృత ప్రయోజనాల కోసం బీజేపీని బలపరుస్తున్నాం, మేం పోటీ నుంచి తప్పుకుంటున్నాం అనేశారు జనసేనాని.

2019లో బీజేపీని చెడామడా తిట్టి, పాచిపోయిన లడ్డూలిచ్చారంటూ గేలి చేసింది ఎవరి విస్తృత ప్రయోజనాల కోసమే పవన్ కల్యాణ్ చెబితే వినాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. అప్పుడు ముద్దొచ్చిన వామపక్షాలు, బీఎస్పీ ఇతరత్రా పార్టీలు ఇప్పుడు వెగటు పుట్టాయి. మళ్లీ బీజేపీతో చెట్టపట్టాలేసుకుని విస్తృత ప్రయోజనాలు కాపాడతానంటూ త్యాగమూర్తి అవతారమెత్తారు పవన్ కల్యాణ్.

చంద్రబాబు తన అపవిత్ర పొత్తులకు ప్రజాస్వామ్య పరిరక్షణ అనే అందమైన ముసుగు వేసుకుంటే.. ఇక్కడ జనసేనాని తన అసమర్థతకు విస్తృత ప్రయోజనాలు అనే కలరింగ్ ఇస్తున్నారు. ఎన్నికలు వస్తే చాలు.. తమ రాజకీయ ప్రయోజనాల కోసం మాట తప్పడం, మడమ తిప్పడం అలవాటు చేసుకున్నారు.

నిమ్మగడ్డకు నిఖార్సైన ప్రశ్న