ప‌వ‌న్ చెవిలో క‌మ‌లం పువ్వు

ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న  ఆయ‌న్ను అభాసుపాలు చేసింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. నాదెండ్ల మ‌నోహ‌ర్‌తో క‌లిసి ప‌వ‌న్ ఢిల్లీ వెళ్లారంటే ఏవో కీల‌క అంశాల‌పై చ‌ర్చించ‌డానికే అని అంద‌రూ ఊహించారు. దీంతో ప‌వ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న…

ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న  ఆయ‌న్ను అభాసుపాలు చేసింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. నాదెండ్ల మ‌నోహ‌ర్‌తో క‌లిసి ప‌వ‌న్ ఢిల్లీ వెళ్లారంటే ఏవో కీల‌క అంశాల‌పై చ‌ర్చించ‌డానికే అని అంద‌రూ ఊహించారు. దీంతో ప‌వ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న ఉత్కంఠ క‌లిగించింది. మ‌రీ ముఖ్యంగా జ‌న‌సేన, బీజేపీ శ్రేణుల్లో ఆస‌క్తి రేకెత్తించింది. 

గ్రేట‌ర్ ఎన్నిక‌ల ప్ర‌చారం నిమిత్తం ఢిల్లీ నేత‌లంతా హైద‌రాబాద్ బాట ప‌ట్టిన ప‌రిస్థితుల్లో, ప‌వ‌న్ మాత్రం ఢిల్లీ బాట ప‌ట్ట‌డ‌మే ఉత్కంఠ‌కు కార‌ణ‌మ‌ని చెప్పొచ్చు.

ప‌వ‌న్ ఢిల్లీ వెళ్లిన త‌ర్వాత ఆయ‌న‌కు బీజేపీ అగ్ర‌నేత‌లు వీఐపీ ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించ‌లేదు. స‌ర్వ‌ద‌ర్శ‌న‌మే అయింది. దాదాపు 30 గంట‌లు నిరీక్షించిన త‌ర్వాత బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా అపాయింట్‌మెంట్ ఇచ్చారు. న‌డ్డాతో భేటీ వివ‌రాల‌ను ప‌వ‌న్, నాదెండ్ల మ‌నోహ‌ర్ వివ‌రించారు. 

తిరుప‌తిలో పోటీ చేయాల‌ని గ‌ట్టిగా ప‌ట్టుప‌డుతున్న జ‌న‌సేన‌కు న‌డ్డా నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రాలేదు. పైగా ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థి ఏ పార్టీ తరఫున ఉండాలనే అంశంపై  నడ్డాతో ప్రాథమికంగా చర్చించామని జనసేనాని  తెలిపారు.

దీన్ని బ‌ట్టి మ‌రోసారి జ‌న‌సేనాని చెవిలో క‌మ‌లం పువ్వు పెట్టిన‌ట్టే అర్థ‌మ‌వుతోంది. మ‌రోవైపు తిరుప‌తి ఉప ఎన్నిక‌లో త‌మ అభ్య‌ర్థే పోటీలో ఉంటార‌ని ఏపీ బీజేపీ నేత‌లు స్ప‌ష్టం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అలాంట‌ప్పుడు అభ్య‌ర్థి ఎంపిక‌పై క‌మిటీ వేసినా, అది మొక్కుబ‌డి వ్య‌వ‌హార‌మేన‌ని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. కేవ‌లం ప‌వ‌న్‌ని సంతృప్తి ప‌ర‌చ‌డానికి, జ‌న‌సైనికులు కూడా త‌మ‌కు బీజేపీ విలువ ఇస్తోంద‌ని జ‌నాల్లో చెప్పుకోడానికి ఒక సాకు కోసం ఈ డ్రామా అని అంద‌రికీ అర్థ‌మ‌వుతోంది.

ఇక అమ‌రావ‌తే రాజ‌ధాని అని జ‌న‌సేనాని ఢిల్లీ వెళ్లి చెప్పాలా? ఇప్ప‌టికే కొన్ని వంద‌ల‌సార్లు ఆ విష‌యాన్ని చెప్పారు క‌దా! బీజేపీ అభిప్రాయం కూడా ఇదేన‌ని జ‌న‌సేనాని చెప్ప‌డం ఏంటి?  ‘ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలోనే  కొనసాగాలనేది బీజేపీ-జనసేన కూటమి నిర్ణయం. 

ఈ విషయంలో పూర్తిగా అండగా ఉంటామని నడ్డా స్పష్టమైన హామీ ఇచ్చారు. మా కూటమి రాజధాని రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతుంది. ఇవి నా మాటలు కావు. నడ్డా నోటి నుంచి వచ్చిన మాటలివి. అమరావతి రైతులకు బాసటగా ఉంటాం. చివరి రైతు వరకు న్యాయం జరిగే దాకా పోరాడతాం’ అని ప‌వ‌న్ తెలిపారు.

ఇలాంటి మాట‌లు కామెడీ అనిపించ‌డం లేదా? అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని ఉండాల‌ని నిజంగా బీజేపీ భావిస్తుంటే , కేంద్రంలో అధికారాన్ని వెల‌గ‌బెడుతున్న ఆ పార్టీ అడ్డుకోవ‌చ్చు క‌దా. బీజేపీ అగ్ర‌నేత‌లు త‌న‌ను మ‌భ్య‌పెడుతున్నారా? లేక బీజేపీ-జ‌న‌సేన క‌లిసి అమ‌రావ‌తి రైతుల‌ను మ‌భ్య‌పెట్టాల‌ని అనుకుంటున్నారా? ఈ విష‌యాల‌పై ముందు ప‌వ‌న్ ఓ క్లారిటీకి వ‌స్తే బాగుంటుంది.

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన రెండు రోజుల‌కే మ‌ళ్లీ వెన‌క్కి త‌గ్గిన ప‌వ‌న్‌, మ‌రోసారి తిరుప‌తి విష‌యంలోనూ అట్లే వ్య‌వ‌హ‌రిస్తారా? ఇప్పుడిది జ‌న‌సైనికుల నుంచి వ‌స్తున్న ప్ర‌శ్న‌. ఏపీ జ‌నానికి మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ జ‌న‌సేన‌కు బీజేపీ పోటీ చేసే చాన్స్ ఇవ్వ‌ద‌నే క్లారిటీ ఉంది. మొత్తానికి జ‌న‌సేనాని చెవిలో బీజేపీ ఓ పెద్ద క‌మ‌లం పువ్వు పెట్టి తిరిగి ఢిల్లీ నుంచి సాగ‌నంపింది.