రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ వ్యవహార శైలి రోజురోజుకూ తీవ్ర విమర్శల పాలవుతోంది. ఇంత కాలం అధికార పార్టీ వైసీపీ మాత్రమే నిమ్మగడ్డను టార్గెట్ చేస్తూ వస్తోంది. కానీ ఇప్పుడాయనకు మరో బలమైన శత్రువు పుట్టుకొచ్చాడు. అది కూడా కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రూపంలో అని చెప్పొచ్చు.
నిమ్మగడ్డ పాలనా తీరుపై వైసీపీ నేతల వంద తిట్ల కంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసే ఒక్క విమర్శకు ఎక్కువ విలువని చెప్పక తప్పదు. వైసీపీ విమర్శల కంటే సోము వీర్రాజు నిలదీత ఎక్కువ కిక్ ఇస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. వైసీపీ మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు స్థానిక సంస్థల నిర్వహణకే మొగ్గు చూపుతున్నాయనే నిమ్మగడ్డ అభిప్రాయంలో నిజం లేదని సోము వీర్రాజు తాజా వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి.
సోము వీర్రాజు నుంచి ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతాయని నిమ్మగడ్డ అసలు ఊహించి ఉండరు. అందుకే నిమ్మగడ్డకు సోము షాక్ ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాజమహేంద్రవరంలో బీజేపీ శ్రేణుల శిక్షణా తరగతుల సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడుతూ ఎవరు చెబితే స్థానిక సంస్థల కు ఎన్నికలు నిర్వహించాలని తహతహలాడుతున్నారని నిమ్మగడ్డను నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోతే కొంపలేమీ మునిగిపోవని, కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో హడీవుడిగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏంటని ఆయన గట్టిగా ప్రశ్నించారు. ఇదే ప్రశ్నను ఇంత కాలం వైసీపీ వేస్తుండడం గమనార్హం. ఇప్పుడు వైసీపీ వాదనకు బలం చేకూరినట్టైంది.
స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ, సీపీఐ మినహా మిగిలిన ఏ పార్టీలు కోరలేదు. ప్రభుత్వంతో చర్చించి నిర్ణయించాలని సీపీఎం, కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ కోరిన సంగతి తెలిసిందే. సోము వీర్రాజు తాజా నిలదీతతో స్థానిక సంస్థలకు బీజేపీ వ్యతిరేకమని స్పష్టమైంది.
బీజేపీ మిత్రపక్షమైన జనసేన కూడా ఎన్నికలు నిర్వహించాలని కోరలేదు. ఒకవేళ ఎన్నికలు నిర్వహిస్తే తాము పాల్గొంటామని మాత్రమే జనసేన తన అభిప్రాయాన్ని ఎస్ఈసీకి స్పష్టం చేసింది. మొత్తానికి రోజులు గడిచేకొద్ది రాజకీయ పార్టీల నుంచి నిమ్మగడ్డకు మద్దతు కరువవుతోందని చెప్పొచ్చు.