ప్రజలకి ఏ సమస్య వచ్చినా ఇప్పుడు నాయకుల దగ్గరకు వెళ్లట్లేదు, ముందు సచివాలయానికి వెళ్తున్నారు. సంబంధిత అధికారిని ప్రశ్నిస్తున్నారు. గతంలో సచివాలయాలు లేవా అని చంద్రబాబు వెకిలి మాటలు మాట్లాడినా.. అప్పుడు సచివాలయానికి కేవలం సిబ్బంది మాత్రమే వెళ్లేవారు, జగన్ జమానాలో జనం వెళ్లడం మొదలైంది. రేషన్ రాకపోయినా సచివాలయమే, పింఛన్ రాకపోయినా అక్కడే సమాధానం, రైతు భరోసా సొమ్ముకైనా అదే పరిష్కారం.. ఇలా గ్రామస్తులు మండల కేంద్రాలకు వెళ్లడమే మానేశారు.
దాదాపుగా ఎమ్మార్వో కార్యాలయాలన్నీ జనం లేక బోసిపోతున్నాయంటే నమ్మండి. రిజిస్ట్రేషన్ వ్యవహారాలకు కూడా సచివాలయమే కేంద్ర బిందువుగా మార్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తాజాగా ఆధార్ కార్డుల్లో మార్పులు, చేర్పులు, కొత్త కార్డుల నమోదు.. వంటి సేవలన్నీ గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం ఎంపిక చేసిన పోస్టాఫీస్ లు, బ్యాంక్ లు, ఆధార్ సెంటర్లు, మీసేవా సెంటర్లలో మాత్రమే ఈ సేవలు అందిస్తున్నారు. అక్కడ కూడా సిబ్బంది చేతివాటానికి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నిటికీ చెక్ పెడుతూ ఆధార్ సేవలు ఇకపై సచివాలయాల్లోనే పూర్తిగా ఉచితంగా అందించేందుకు సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
అన్ని పథకాలకూ ఆధార్ కార్డు కీలకమైన దశలో.. దానిలో తప్పుప్పులతో చాలామంది అసలైన లబ్ధిదారులు నష్టపోతున్నారు. ఇటు లబ్ధిదారులకు నష్టం లేకుండా చేయాలన్నా, అటు ఆధార్ తో జనాలకు తిప్పలు తప్పాలన్నా వాటిని పూర్తిగా సామాన్య ప్రజలకు అందుబాటులోకి తేవడమే మేలైన మార్గం. అందుకే గ్రామ/వార్డు సచివాలయాల్లో ఈ సేవలు మొదలు కాబోతున్నాయి.
వాస్తవానికి సచివాలయాల రాకతో మీసేవా కేంద్రాలని పూర్తిగా రద్దు చేయాలని భావించారు జగన్. అయితే కొంతమంది నిర్వాహకులు ఉద్యోగులను అడ్డుపెట్టుకుని నిరసనలకు దిగారు. దీంతో ఒక్కొక్క సేవల్ని మీ-సేవకు దూరం చేస్తూ జగన్ తన ప్రణాళికను అమలులో పెట్టారు. సచివాలయాల వ్యవస్థతో రెవెన్యూ కార్యాలయాల కళ కూడా తప్పింది. అంటే.. రెవెన్యూ ఉద్యోగుల చేతివాటం కూడా తగ్గినట్టే చెప్పాలి. రిజిస్ట్రేషన్ వ్యవహారాలకు కూడా సచివాలయాలే కేంద్రాలైతే.. అక్కడ జరుగుతున్న మామూళ్ల వ్యవహారానికి కూడా చెక్ పెట్టినట్టు అవుతుంది.
అందుకే అప్పటికే ఉన్న కార్యాలయాల్లో అవినీతిని అంతం చేయడానికి సాహసించకుండా.. కొత్తగా సచివాలయాలనే వ్యవస్థను తీసుకొచ్చి.. దానికే పూర్తిగా అధికారాలన్నీ బదలాయిస్తున్నారు. ఇప్పుడు ఆధార్ అప్ డేట్స్ వ్యవస్థ కూడా సచివాలయాలకు వస్తే చాలామందికి ఆధార్ కష్టాలు తప్పుతాయి.