మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టు సాయంత్రం నుంచి జరుగుతున్న ప్రచారంపై జగన్ సర్కార్ అనుమానిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం గుంటూరు రమేశ్ ఆస్పత్రిలో సేద తీరుతున్న అచ్చెన్నాయుడు మరికొంత కాలం అక్కడే తిష్ట వేసేందుకు ఆడుతున్న డ్రామాగా ఏపీ సర్కార్ సందేహిస్తోందని సమాచారం. అచ్చెన్న కరోనా బారిన పడ్డారని జగన్ సర్కార్ నమ్మక పోవడం వల్లే…ప్రభుత్వ అనుకూల పత్రికగా పేరున్న సాక్షి , అలాగే చానల్‌లో ఏ మాత్రం వార్త ఇవ్వలేదు.
ప్రభుత్వ అనుమానించడానికి బలమైన కారణాలు లేకపోలేదు. టీడీపీ అనుకూల పత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి వెబ్‌సైట్‌లలో అచ్చెన్న కరోనా పాజిటివ్ వార్తను చూస్తే….ప్రభుత్వానికే కాదు ఎవరికైనా అనుమానాలు కలిగేలా ఉన్నాయి. ముందుగా ఈనాడు విషయానికి వస్తే వార్త ఎలా క్యారీ చేశారో పరిశీలిద్దాం.
“మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆయన తరఫు న్యాయవాది వెల్లడించారు. ప్రస్తుతం గుంటూరులోకి రమేశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈఎస్ఐ కుంభకోణం ఆరోపణలతో పోలీసులు ఇటీవల అచ్చెన్నాయుడిని అరెస్టు చేయగా.. అనారోగ్యం కారణంగా గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందు తున్నారు. తాజాగా ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయన తరఫు న్యాయవాది వెల్లడిం చారు. ప్రస్తుతం అచ్చెన్నాయుడు ఆరోగ్యం బాగానే ఉందని రమేశ్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు”
ఆంధ్రజ్యోతిలో ఏ విధంగా ఇచ్చారో చూద్దాం.
“మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న అచ్చెన్నకు స్థానికంగా ఉన్న రమేష్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాల్లోకెళితే.. నిన్న ఉదయం నుంచి జలుబు చేయటంతో అచ్చెన్నకు కరోనా పరీక్షలు నిర్వహించగా ఇవాళ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం అచ్చెన్నాయుడుకు రమేష్ ఆస్పత్రి వైద్యులు కరోనా చికిత్స అందిస్తున్నారు”
ఈనాడులో రాసిన వార్తలో ఇంతకూ అచ్చెన్న తరపు న్యాయవాది ఎవరో రాయలేదు. మరోవైపు ఆయనలో ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించాయో, ఎప్పటి నుంచి ఉన్నాయో తదితర వివరాలు కూడా లేవు. నిజానికి అచ్చెన్న ఆరోగ్య వివరాలను ఆస్పత్రి వైద్యులు వెల్లడించాలి. రమేశ్ ఆస్పత్రి వైద్యులు మాత్రం అచ్చెన్నాయుడు ఆరోగ్యం బాగానే ఉందని చెప్పినట్టు వార్తలో ఇవ్వడం కొసమెరుపు. అంతరాత్మకు నచ్చని పనేదో చేస్తున్నట్టు ఈనాడు వార్త చదివితే అర్థమవుతుంది.
ఆంధ్రజ్యోతి రాసిన వార్తలో అచ్చెన్నాయుడికి కరోనా నిర్దారణ అయినట్టు ఎవరు చెప్పారో వివరాలేవీ లేవు. నిన్న ఉదయం నుంచి జలుబు చేసిందని మాత్రం మొక్కుబడిగా ఒక లక్షణాన్ని పేర్కొన్నారు. ఇవన్నీ చూస్తుంటే సహజంగానే అనుమానించ డానికి అవకాశం ఉంది. ఎందుకంటే అచ్చెన్నకు కరోనా పాజిటివ్ అని ఆంధ్రజ్యోతి రాసుకుందని, అందులో తమ ప్రమేయం లేదని రమేశ్ ఆస్పత్రి యాజమాన్యం తప్పించుకునే పన్నాగంగా తోస్తోంది. అలాగే ఈనాడుకు చెప్పిన న్యాయవాది, ఆంధ్రజ్యోతిని ఎందుకు విస్మరించాడో అర్థం కాదు.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్టు, అనారోగ్యం గురించి మాట్లాడుకుందా. ఈఎస్ఐలో భారీ కుంభకోణం కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని జూన్ 12న ఆయన స్వగ్రామం నిమ్మాడలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకు అంతకు రెండురోజుల ముందే పైల్స్‌కు శస్త్ర చేశారని విషయం దర్యాప్తు అధికారులకు తెలిసింది. దీంతో ఆయన్ను కోర్టు ఆదేశాల మేరకు గుంటూరు సర్వజన ఆస్పత్రికి తరలించారు.
సుదీర్ఘ ప్రయాణం కావడంతో సర్జరీ గాయం తిరగబెట్టి తీవ్ర రక్తస్రావమైంది. దీంతో ఆయనకు గుంటూరు ఆసుపత్రిలో జూన్ 18న రెండోసారి పైల్స్‌కు శస్త్ర చికిత్స జరిగింది. ఆయన ఆరోగ్యం మెరుగు పడడంతో జూలై 1న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసి విజయవాడ సబ్‌జైలుకు తరలించారు. అయితే తనకు ఆరోగ్యం కుదుట పడలేదని, మెరుగైన ట్రీట్ మెంట్ కోసం అనుమతించాలని హైకోర్టులో అచ్చెన్నాయుడు పిటిషన్ దాఖలు చేశారు.
అచ్చెన్న ఆరోగ్య విషయం కాబట్టి హైకోర్టు సానుకూలంగా స్పందించి ఆదేశాలిచ్చింది. దీంతో ఆయన జూలై 8న కోరి మరీ గుంటూరు రమేశ్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ ఆస్పత్రి టీడీపీ నేత డాక్టర్ రమేశ్‌కు సంబంధించినదని అందరికీ తెలిసిందే. అంతేకాదు ఇటీవల విజయవాడలో ఈ ఆస్పత్రి యాజమాన్యం పర్యవేక్షణలో ఓ హోటల్‌లో నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్‌లో భారీ అగ్రి ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 10 మంది మృత్యువాత పడ్డారు. అయినప్పటికీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఏ మాత్రం స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఆస్పత్రి కావడం వల్లే ఘోర అగ్ని ప్రమాదంపై చంద్రబాబు నోరు మెదపడం లేదనేది బహిరంగ రహస్యమే.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు దాదాపు 40 రోజులుగా రమేశ్ ఆస్పత్రిలో పైల్స్‌కు ట్రీట్‌మెంట్ తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక అక్కడి నుంచి డిశ్చార్జ్ చేస్తారనే సాకుతో సరికొత్తగా కరోనా పాజిటివ్ డ్రామా ఆడుతున్నారనే అనుమా నం జగన్ సర్కార్ బలంగా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. సహజంగా పైల్స్‌కు ఆపరేషన్ చేసిన తర్వాత వారం రోజులకు డిశ్చార్జ్ చేస్తారని వైద్యులు చెబుతున్నారు.
ఒకవేళ బ్లడ్ బ్లీడింగ్ అవుతుంటే మరో వారం ఆస్పత్రిలో చికిత్స అందిస్తారని వైద్యులు చెబుతున్నారు. అలాంటిది దాదాపు 40 రోజులు రమేశ్ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ ఇవ్వడం ఏంటని వైద్యులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అందుకే రమేశ్ ఆస్పత్రిలో కరోనా సాకుతో మరో రెండు వారాలు ఉండే ఎత్తుగడలో భాగంగానే కొత్త నాటకానికి తెరలేపారనే వార్తలు గుప్పుమంటున్నాయి. మరో వైపు సొంత ప్రసార సాధనాలు కూడా అచ్చెన్నకు కరోనా పాజిటివ్ వార్తను అతికినట్టు రాయకపోవడం కూడా అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
అచ్చెన్న కరొనా బారిన పడకూడదనేది అందరి ఆకాంక్ష. అచ్చెన్నకు కరోనా నెగిటివ్ అని వినాలనేదే ప్రతి ఒక్కరి కోరిక. అదే నిజం కావాలని, అయి ఉంటుందని నమ్మేవాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంది. మరి నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆ దిశగా జగన్ సర్కార్ చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం.