అందరికీ వైద్యం, అందుబాటులోకి వైద్యం అనేది దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి నినాదం. ప్రజారోగ్యానికి పెద్దాయన ఎంతటి ప్రాధాన్యతనిచ్చారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి వైఎస్ కలకు ఆయన తనయుడు, ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరిన్ని మెరుగులు అద్దారు. హైటెక్ సొబగులు సమకూర్చారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీని పూర్తిస్థాయిలో అమలు చేస్తున్న జగన్.. ఇప్పుడు 108, 104లను విస్తృతంగా అందుబాటులోకి తీసుకొచ్చారు.
బ్రిటన్ తరహాలో ఆంధ్రప్రదేశ్ పల్లెల్లో వైద్య విప్లవాన్ని తీసుకొస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి.. అందుకు తగ్గట్టుగానే అత్యాథునిక టెక్నాలజీ, వసతులతో 104, 108 వాహనాలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వాహనాల్లో సౌకర్యాలు, టెక్నాలజీ చూసి నేషనల్ మీడియా కూడా నోరెళ్లబెట్టిందంటే జగన్ సాధించిన విజయం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఈ వాహనాల్లో టెక్నాలజీ విషయానికొస్తే.. 412 అంబులెన్సుల్లో 282 వాహనాల్లో బేసిక్ లైఫ్ సపోర్ట్ ఏర్పాటుచేశారు. అత్యవసర చికిత్సకు అవసరమయ్యే ఎక్విప్ మెంట్ మొత్తం ఇందులో ఉంది. ఇక 105 వాహనాల్లో అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్డ్ ను ఏర్పాటుచేశారు. అడ్వాన్స్ డ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్, పీడియాట్రిక్ అడ్వాన్స్ డ్ లైఫ్ సపోర్ట్ లాంటి ఎన్నో అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ వాహనాలు మినీ ఐసీయూలుగా పనిచేస్తాయన్నమాట.
వీటితో పాటు మరో 26 అంబులెన్సులను అప్పుడే పుట్టిన చిన్నారులకు వైద్యసేవలు అందించేందుకు ఏర్పాటుచేశారు. డెలివరీలు ఎక్కువగా జరిగే హాస్పిటల్స్ కు అనుసంధానిస్తూ ఈ అంబులెన్స్ లు పనిచేస్తాయి. ఇందులో ఇంక్యుబేటర్లు, వెంటిలేటర్లు ఉంటాయి.
ఇన్నాళ్లూ 108 వాహనాలు కేవలం రోగిని హాస్పిటల్ కు తరలించడానికి మాత్రమే ఉపయోగపడ్డాయి. చిన్నచిన్న సౌకర్యాలు ఉన్నప్పటికీ అవి అరకొరగా మాత్రమే అక్కరకొచ్చాయి. చాలా అంబులెన్సుల్లో అసలు సౌకర్యాలే లేకుండా, కేవలం రోగి లేదా యాక్సిడెంట్ జరిగిన వ్యక్తి రవాణా సౌకర్యానికి మాత్రమే పరిమితమయ్యాయి. కానీ అడ్వాన్స్ డ్ లైఫ్ సపోర్ట్ వ్యవస్థ ఉన్న వాహనాల్లో రోగికి ట్రీట్ మెంట్ అందిస్తూనే హాస్పిటల్ కు తరలించే సౌకర్యం ఉంటుంది.
ఇక ఈ వాహనాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు వైద్య ఉపకరణాలు, వస్తువులు ఏర్పాటుచేశారు. వీల్ ఛైర్, మల్టీపారా మానిటర్, బ్యాగ్ మాస్క్ లాంటివన్నీ అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు ఉన్నాయి.
ఇలా ఓవైపు అత్యాధునిక వాహనాలు అందిస్తూనే మరోవైపు క్షేత్రస్థాయిలో మౌలిక వసతుల పెంపుపై దృష్టిసారించారు జగన్. అటు 108 డ్రైవర్లు, టెక్నీషియన్ల జీతాల్ని కూడా భారీగా పెంచి వాళ్లకు కూడా ప్రోత్సాహం అందించారు. ముఖ్యమంత్రి చేపట్టిన తాజా చర్యలతో రాష్ట్రంలో ప్రజారోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు చూడబోతున్నాం.