కరోనా వ్యాప్తి నివారణకు విధించిన లాక్ డౌన్ దాదాపుగా ముగిసిన సమయంలో బెంగళూరు నగరంలో కేసుల సంఖ్య బాగా తక్కువ. మార్చి 21 నుంచి దాదాపుగా మే30 వరకూ సుదీర్ఘ లాక్ డౌన్ కొనసాగిందప్పుడు. మే 30 నాటికి కూడా బెంగళూరు మహానగరంలో కేసుల సంఖ్య వందల్లోనే అనే వార్తలు వచ్చాయి. కోటీ ఇరవై లక్షలకు మించి జనాభా కలిగిన బెంగళూరులో అలా తక్కువ స్థాయిలో కేసుల సంఖ్య నమోదైంది.
ఇక అన్ లాకింగ్ ప్రక్రియ మొదలయ్యాకా కూడా మొదట్లో కేసుల సంఖ్య తక్కువగానే అనిపించింది. మే 30 నుంచి జూన్ 30 వరకూ కూడా పరిస్థితి నియంత్రణలోనే కనిపించింది. అయితే అనూహ్యంగా జూలై మొదటి నుంచి బెంగళూరులో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. జూన్ నెల ముగిసే సమయానికి నాలుగు వేల స్థాయిలో కేసులుండేవి. జూలై ఒకటి నుంచి ప్రతి రోజూ క్రమం తప్పకుండా రోజుకు వెయ్యికి పైగా కేసుల చొప్పున పెరుగుతూ పోతున్నాయక్కడ. రోజువారీ పెరుగుదల 1500 కేసుల స్థాయికి చేరిపోయింది!
ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం పై ఒత్తిడి పెరిగింది. ఇప్పటికే బెంగళూరు నగరంలో కూడా సరైన వైద్య సౌకర్యాలు లేవనే విమర్శలు వస్తున్నాయి. కరోనా నిర్ధారణ అయిన వారిని తీసుకెళ్లడానికి కనీసం అంబులెన్స్ సౌకర్యాలు లేవని వార్తలు ఆ మహానగరం డొల్ల తనాన్ని బయటపెడుతూ ఉన్నాయి. కరోనా ను ఎదుర్కొనడంలో యడియూరప్ప ప్రభుత్వం చేతగాని తనం బయటపడుతూ ఉందని, అక్కడ వ్యవస్థల మధ్య- మంత్రుల మధ్య అస్సలు సమన్వయం లేదనే వార్తలూ వస్తున్నాయి.
ఈ క్రమంలో ప్రతిపక్షాల నుంచి విమర్శలు కూడా తీవ్రం కావడంతో బెంగళూరు లాక్ డౌన్ ను ప్రకటించారు యడియూరప్ప. జూలై 14 నుంచి లాక్ డౌన్ మొదలు కానుంది. వారం రోజుల పాటు కంప్లీట్ లాక్ డౌన్ ను అమలు చేయనున్నట్టుగా ప్రకటించారు. మరి ఆ లాక్ డౌన్ వారంతో ఆగుతుందా? మరి కొన్నాళ్లు కొనసాగుతుందో చూడాల్సి ఉంది.
ఇక మహారాష్ట్రలో కూడా వివిధ నగరాల్లో మళ్లీ లాక్ డౌన్ నిబంధనలను తీవ్రతరం చేస్తున్నారు. ముంబై, పుణే, థానే వంటి చోట్ల లాక్ డౌన్ నిబంధనలను స్ట్రిక్ట్ చేస్తున్నారని సమాచారం. ఈశాన్య రాష్ట్రాల్లోనూ కొన్ని కొన్ని నగరాల్లో లాక్ డౌన్ ప్రకటిస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయని సమాచారం.