హైదరాబాద్‌లో ఓ స్థలం వివాద నేపథ్యంలో ప్రత్యర్థుల కిడ్నాప్, ఆ కేసులో జైలుకు వెళ్లి వచ్చారామె. ఆమె భర్త, తమ్ముడు కూడా అదే కేసులో అసలుసిసలు సూత్రధారులు, పాత్రధారులని పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. చివరికి కోర్టు విచారణ నుంచి తప్పించుకునేందుకు సదరు నాయకురాలి భర్త, తమ్ముడు కలిసి కరోనా పాజిటివ్ డ్రామాకు తెరలేపారు.
అయితే పోలీసుల ముందు వారి నాటకాలు రక్తి కట్టలేకపోయాయి. దీనిపై మరో కేసు. ప్రస్తుతం ఆమె తమ్ముడు, భర్త పరారీలో ఉన్నారు. ఒక వేలు ఎదుటి వాళ్లపై చూపితే, మిగిలిన నాలుగు వేళ్లు తనవైపే చూపుతూ వెక్కిరిస్తున్నాయనే స్పృ, ఆలోచన ఆమెలో కొరవడ్డాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉపోద్ఘాతం చదివిన తర్వాత పేరు చెప్పకుండా, ఆమె ఎవరో తెలుగు సమాజం ఇట్టే గుర్తు పట్టేస్తుంది. ఆ నాయకురాలే మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. రాష్ట్రంలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ జరుగుతోందని భూమా అఖిలప్రియ ఆరోపించారు.
ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం సిగ్గుచేటని ఆమె మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆళ్లగడ్డ మండలంలోని ఆర్.కృష్ణాపురంలో వైసీపీ నేతలు ఎర్రమట్టి దందా సాగిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇలా అనేక అంశాలపై అఖిలప్రియ ఆరోపణలు గుప్పించడం దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎవరినైనా విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అయితే ప్రశ్నించే ముందు తామెంత నిజాయితీగా ఉన్నామో ఒక్కసారి అంతరాత్మను ప్రశ్నించుకుంటే మంచిదని వైసీపీ నేతలు భూమా అఖిలప్రియకు సూచిస్తున్నారు.
ఇటీవల వరుస తప్పుడు ఘటనల్లో కేసులు, జైలుపాలవుతున్న భూమా అఖిలప్రియ తమను విమర్శించడం ఏంటని ఆమె ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌లో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఆళ్లగడ్డ వచ్చిన వాళ్లు కూడా విమర్శించడమేనా? అని వైసీపీ నేతలు వ్యంగ్యంగా ప్రశ్నిస్తుండడం గమనార్హం. ఇదే కలికాల మహత్యం అని దెప్పి పొడుస్తున్నారు.