అర్ధ శతాబ్దం పూర్వం విజయనగరం పూసపాటి రాజుల ఆధ్వర్యాన మాన్సాస్ ట్రస్ట్ ఏర్పడింది. ఇపుడు ఆ ట్రస్ట్ లో వివాదాలు ఒక లెక్కన సాగుతున్నాయి. ఆ మాటకు వస్తే ఇపుడు అటూ ఇటూ సమరం సాగుతోంది కాబట్టే చాలా విషయాలు బయటకు వస్తున్నాయి అనే వాళ్ళూ ఉన్నారు.
మాన్సాస్ ట్రస్ట్ కు ఉన్న వేలాది ఎకరాల భూములు అన్నీ కూడా ప్రభుత్వానివేనని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తాజాగా లా పాయింట్ ఒకటి తీశారు. అదెలా అంటే 45 సంవత్సరాల క్రితం మాన్సాస్ సంస్థ భూములను విజయనగరం జిల్లా కోర్టు ప్రభుత్వానికి అప్పజెప్పాలని కోర్టు తీర్పులో ఉందని, కానీ ఇప్పటికీ ఆ ప్రక్రియ జరగలేదని ఆయన గుర్తు చేస్తున్నారు.
అలాగే మాన్సాస్ సంస్థ భూములు అమ్మకాలు కొనుగోలు తనఖాలు చేయరాదని ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లో ఉందని ఆయన గట్టిగా చెబుతున్నారు. అయినప్పటికీ కూడా కొన్ని భూములు అమ్మకాలు జరిగాయని బెల్లాన చంద్రశేఖర్ ఆరోపిస్తున్నారు.
నిజానికి ఈ భూములన్నీ పేద ప్రజలకు ప్రభుత్వానికి చెందాలని ఆయన పేర్కొంటూ వాటిని సాగు చేసే రైతులకు హక్కు కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. మొత్తం మీద చూసుకుంటే మాన్సాస్ భూముల విషయంలో ఏదో ఒకటి తేల్చి ప్రజోపయోగం చేయాలని ఆయన కోరుతున్నారు.
మరో వైపు వామపక్షాలకు చెందిన నాయకులు ఇదే రకమైన డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ ట్రస్ట్ వివాదం ముదిరి పాకాన పడుతున్న వేళ ఇలాంటి సంచలన నిర్ణయాలు ఏమైనా చోటు చేసుకుంటాయా అన్న డౌట్లు అయితే చాలా మందిలో ఉన్నాయి మరి.