మరోసారి బకరాలు కాబోతున్న ‘దేశం’ నేతలు..!

2019లో టీడీపీ గెలిచిన 23 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు దారుణంగా ఉందని ఇటీవల ఓ సర్వే కుండబద్దలు కొట్టింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే బాబు సహా.. మిగతా ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరూ గెలవరని తేల్చిచెప్పింది…

2019లో టీడీపీ గెలిచిన 23 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు దారుణంగా ఉందని ఇటీవల ఓ సర్వే కుండబద్దలు కొట్టింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే బాబు సహా.. మిగతా ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరూ గెలవరని తేల్చిచెప్పింది కూడా. రాగా పోగా మిగతా 151 నియోజకవర్గాల్లోనే టీడీపీ నేతలు కొద్దో గొప్పో కష్టపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అయినా గెలవాలనే తాపత్రయంతో ఉన్నారు.

ఈ సంగతి పక్కనపెడితే అసలు వచ్చే ఎన్నికలనాటికి టీడీపీలో ఎంతమందికి పార్టీ టికెట్లు ఇస్తుంది, జనసేనతో పొత్తు ఖరారైతే టీడీపీ చేయాల్సిన త్యాగం విలువ ఎంత..? బీజేపీ కూడా కలిసొస్తే టీడీపీ కోల్పోయే సీట్ల సంఖ్య ఎంత..? ఎవరెవరి సీట్ల కిందకు నీళ్లొస్తున్నాయనేది ఆ పార్టీలో ఇప్పట్నుంచే చర్చనీయాంశమైంది.

ఎంతకైనా దిగజారతాం..

జనసేనతో పొత్తు కోసం, పవన్ మద్దతు కోసం ఎంతకైనా దిగజారేందుకు బాబు రెడీగా ఉన్నారు. పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి జనసేన పార్టీ.. టీడీపీ-బీజేపీ కూటమికి బేషరతుగా మద్దతిచ్చింది. కనీసం ఒక్క ఎంపీ సీటు కానీ, ఒక్క ఎమ్మెల్యే సీటు కానీ తీసుకోలేదు. అసలు విజయవాడలో పీవీపీకి సీటు ఎగ్గొట్టినా.. పవన్ సైలెంట్ గా ఉన్నారే కానీ ఎదిరించలేదు. అలాంటిది ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

జనసేన త్యాగాలు చేసే స్టేజ్ దాటింది. డిమాండ్ చేసి సీట్లు తీసుకునే స్టేజ్ కి వచ్చేసింది. వచ్చేసిందని ఆ పార్టీ నేతలు ఫీలవుతున్నా, దానివల్ల ఉపయోగం ఎంతనేది తేలాల్సి ఉంది. సో.. కచ్చితంగా టీడీపీలో ఈసారి ఆశావహులకు పవన్ కల్యాణ్ షాకివ్వబోతున్నారు. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీడీపీ నేతలు జనసైనికుల కోసం త్యాగాలు చేయాల్సిన పరిస్థితి రావొచ్చు. 

ఇప్పటికే ఆ రెండు జిల్లాల్లో మార్పు రావాలంటున్న పవన్, పట్టుబట్టి అక్కడ ఎక్కువ సీట్లు అడిగే అవకాశముంది. కాదు కూడదంటే ఒంటరిగా బరిలో దిగుతాం అంటూ పవన్ మారాం చేయొచ్చు. అది ఇద్దరికీ మంచిది కాదనే విషయం పవన్ కంటే బాబుకి బాగా ఎక్కువగా తెలుసు. అందుకే ఆయన తెగేదాకా లాగరు. కనీసం 50 అసెంబ్లీ స్థానాలైనా జనసేనకు త్యాగం చేయాల్సి రావొచ్చు. పవన్ మరీ పట్టుబడితే ఈ సంఖ్య ఇంకాస్త పెరుగుతుంది. సో.. ఆమేరకు టీడీపీలో బలిపశువులు ముందే రెడీ కావాలన్నమాట.

''సర్దుకునే'' టైమ్ ఇస్తారా..?

గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రజల్లో ఉంటూ, వచ్చే ఎన్నికల కోసం ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్న టీడీపీ నేతలు, చంద్రబాబు పొత్తు ధర్మానికి బలికాబోతున్నారు. అయితే వారు ఎవరు, ఆ నియోజకవర్గాలు ఏంటి అనేదానిపై ఎన్నికల ముందే ఓ క్లారిటీ వస్తుంది. 

అప్పటి వరకూ ఆశలు పెట్టుకుని, ఆ తర్వాత త్యాగం అంటే అది రాజకీయాల్లో ఆత్మహత్యతో సమానం. అందుకే టీడీపీ నేతల్లో గుబులు మొదలైంది, ఎవరిపై వేటు పడుతుందో, ఎవరు బలిపశువులు కావాలో ముందే చెబితే ఆ మేరకు ఇప్పటినుంచే సర్దుకుంటామని అధిష్టానాన్ని కోరుతున్నారు.