ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు జ్ఞాపకశక్తి ఎక్కువే. తన బాగు కోసం పని చేసిన వాళ్లను ఆయన ఎప్పటికీ మరిచిపోరు. తగిన సమయం చూసుకుని సరైన పదవి కట్టబెడతారనేందుకు తాజా ఉదాహరణ ఇది. కడప జెడ్పీ చైర్మన్ పీఠానికి మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పేరును స్వయంగా సీఎం జగన్ ప్రకటించడం విశేషం. వైఎస్ జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి వెన్నంటి ఉన్నారు.
దివంగత వైఎస్సార్ హయాంలో ఆకేపాటి అమరనాథరెడ్డి కడప జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశారు. 2009లో ఆయన రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారి పోటీ చేసి గెలుపొందారు. వైఎస్సార్ మరణానంతరం ఏపీలో రాజకీయంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. నాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానికి మద్దతు ప్రకటించిన అమరనాథ్‌రెడ్డిపై అనర్హత వేటు పడింది.
దీంతో 2012లో జరిగిన ఉప ఎన్నికలో తిరిగి ఆయన వైసీపీ తరపున గెలుపొందారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో కడప జిల్లాలో వైసీపీ ఓడిన ఏకైక అసెంబ్లీ నియోజకవర్గం రాజంపేటే కావడం గమనార్హం. అక్కడ టీడీపీ అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డి చేతిలో ఆకేపాటి ఓడిపోయారు. 2019లో మేడా మల్లికార్జునరెడ్డి వైసీపీలోకి వచ్చారు. దీంతో ఆకేపాటికి రాజంపేట సీటు దక్కలేదు. మేడా వైసీపీ తరపున గెలుపొందారు.
తన మాటను గౌరవించి వైసీపీ గెలుపు కోసం పనిచేసిన ఆకేపాటికి తగిన ప్రాధాన్యం ఇస్తానని అప్పట్లో జగన్ ప్రకటించారు. ఆ సమయం ఇప్పుడు రానే వచ్చింది. రాజంపేట జెడ్పటీసీ సభ్యుడిగా ఎన్నికైన ఆకేపాటిని జెడ్పీ చైర్మన్‌గా జగన్ ప్రకటించడం విశేషం. నమ్మిన వాళ్ల కోసం జగన్ ఎప్పటికీ వెన్నంటి ఉంటారనేందుకు ఇదో ఉదాహరణగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.