‘డోంట్ టాక్ రబ్బిష్’ నిప్పులు చెరిగిన అమిత్ షా!

భారతీయ జనతా పార్టీని అమరావతి రైతులు నమ్మచ్చు నమ్మకపోవచ్చు. కానీ.. హోమ్ మంత్రి అమిత్ షా మాత్రం అమరావతి పోరాటానికి అనుకూలంగా చాలా గట్టి స్టాండ్ తీసుకున్నారు. అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా బీజేపీ…

భారతీయ జనతా పార్టీని అమరావతి రైతులు నమ్మచ్చు నమ్మకపోవచ్చు. కానీ.. హోమ్ మంత్రి అమిత్ షా మాత్రం అమరావతి పోరాటానికి అనుకూలంగా చాలా గట్టి స్టాండ్ తీసుకున్నారు. అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా బీజేపీ అడుగు కలపకపోవడం గురించి.. ఆయన ఒక రేంజిలో మండిపడ్డారు. 

ఈ విషయంలో దాదాపు కీలక నేతలందరికీ తలంటేశారు. అమరావతి అంశం మొదలైనప్పటినుంచి సీరియస్ గానే మాట్లాడుతూ వచ్చిన అమిత్ షా.. ఒక దశలో ‘డోన్ట్ టాక్ రబ్బిష్’ అంటూ నిప్పులు చెరిగినట్లుగా తెలుస్తోంది.

విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారం మేరకు.. పార్టీ నాయకుల కీలక భేటీలో అమరావతి అంశం మొదలైన తర్వాత..  ముందుగా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దియోధర్ కు క్లాస్ పీకినట్టు సమాచారం. అసలు రైతులు ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తోంటే.. దానికి మద్దతు ఇవ్వవద్దు అని చెప్పడానికి నువ్వెవరు.. అంటూ అమిత్ షా దియోధర్ ను ప్రశ్నించారు. 

ఆయన నీళ్లు నమలాల్సి వచ్చింది. ‘ఇంతకీ అమరావతి రాజధానికి అనుకూలంగా మన పార్టీ తీర్మానం చేసిందా లేదా’ అని అడిగారు. ‘చేశాం’ అనే సమాధానం వచ్చింది. మరి తీర్మానం చేసిన తర్వాత.. దానికి కట్టుబడి ఉండాల్సిందే కదా.. పోరాటానికి మద్దతివ్వాల్సిందే కదా.. అని అమిత్ షా అడిగారు. 

ఆ వెంటనే పురందేశ్వరి జోక్యం చేసుకుని, తీర్మానం చేసిన క్రమం, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు అన్నింటినీ ఏకరవు పెట్టారు. వాటిని సావధానంగాన వింటూ.. రైతులు పోరాటం చేస్తున్నప్పుడు మనం మద్దతివ్వాల్సిందే కదా.. అంటూ ఆయన అడిగారు. అప్పటికే ఆయన అమరావతి అనుకూల ధోరణిలోకి పూర్తిగా వెళ్లిపోయారు. 

అయితే.. ఆయన ‘వారందరూ రైతులే కదా’ అని అడిగినప్పుడు.. ఆయన అనుకూల ధోరణిని పట్టించుకోకుండా.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు జోక్యం చేసుకుని.. ‘వాళ్లందరూ కాంట్రాక్ట్ ఫార్మర్స్’ అని వ్యాఖ్యానిస్తూ.. అమరావతి ఉద్యమకారుల్ని పలుచన చేసి మాట్లాడారని సమాచారం. 

దానికి ఆగ్రహంగా స్పందించిన అమిత్ షా , సోము వీర్రాజును ఉద్దేశించి ‘డోన్ట్ టాక్ రబ్బిష్’ అంటూ నిప్పులు చెరిగారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఆయన ఆగ్రహంతో నేతలంతా ఖంగుతిన్నారు. రాష్ట్ర బీజేపీ హఠాత్తుగా అమరావతి విషయంలో తమ నిజమైన విధానం మార్చుకుంది. పార్టీ నేతలు పాదయాత్రలో పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తోంది.