Advertisement

Advertisement


Home > Politics - Analysis

కేసీఆర్, చంద్రబాబు ఇద్దరిలో ఒక్కొక్క రకం భయం!

కేసీఆర్, చంద్రబాబు ఇద్దరిలో ఒక్కొక్క రకం భయం!

కేంద్రంలో మోడీ సర్కారును గద్దె దించడానికి కాంగ్రెస్ సహా అన్ని పార్టీలూ ఏకం కావాలనే వాదన ఇప్పుడు బలం పుంజుకుంటోంది. ఫతేహాబాద్ లో దేవీలాల్ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటుచేసిన మెగా ర్యాలీలో అనేక విపక్ష పార్టీల సమక్షంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ వాదనను చాలా బలంగా వినిపించారు. 

ఆదివారం రోజునే సోనియాతో కూడా విడిగా భేటీ అయిన నితీశ్ కుమార్.. కాంగ్రెస్ తో ఉన్న విభేదాలను ఇతర పార్టీలన్నీ పరిష్కరించుకోవాలని.. మోడీని గద్దె దించడానికి అందరూ కలిసి రావాలని పిలుపు ఇవ్వడం విశేషం. కాంగ్రెస్ వామపక్షాలు లేని జాతీయ కూటమిని ఊహించుకోవడం చాలా కష్టం అని నితీశ్ అభివర్ణించడం చాలా పెద్ద సంగతి. ఇది వర్తమాన రాజకీయ సమీకరణాల్లోకి చాలా సంకేతాలు పంపుతోంది. 

అయితే ఈ భారీ కార్యక్రమానికి ఆహ్వానించిన చాలా మంది విపక్ష నాయకులు హాజరు కాలేదు. వారిలో మమతా బెనర్జీ, కేసీఆర్, చంద్రబాబు తదితరులు ఉన్నారు. ఈ కూటమి అధికారంలోకి వస్తే.. ప్రధాని కాగల నాయకుల జాబితాలో కొత్తగా నితీశ్ కుమార్, శరద్ పవార్ పేర్లు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో మమతా బెనర్జీ గైర్హాజరు గమనించదగినది. అయితే అదే సమయంలో తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు వెళ్లకపోవడం తమాషా. వారు ఆహ్వానించినా కూడా డుమ్మా కొట్టిన చంద్రబాబు,కేసీఆర్ లలో ఒక్కొక్కరిలో ఒక్కో భయం వారిని వెళ్లకుండా ఆపినట్లుగా కనిపిస్తోంది. 

మోడీ వ్యతిరేక ఎజెండాతో ఎవరు ఏ సమావేశం పెట్టినా అక్కడకు వెళ్లడానికి భయపడే పరిస్థితిలో చంద్రబాబునాయుడు ఉన్నారు. ఏపీలో రాబోయే ఎన్నికల్లో పవన్ తో పొత్తుకు ఆల్రెడీ రంగం సిద్ధం చేసుకున్న చంద్రబాబునాయుడు, వీలైతే భాజపాను కూడా తమతో కలుపుకుని.. వారికి కొన్ని సీట్లు పంచేసి అయినా సరే.. జగన్ వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకోవాలని అలా మళ్లీ తాను గద్దె ఎక్కాలని కలగంటున్నారు. అలాంటి నేపథ్యంలో మోడీ వ్యతిరేక కూటమి పెట్టే సమావేశానికి ఆయన హాజరవడం కల్ల అని ఆహ్వానం వచ్చినప్పుడే తేలిపోయింది. ఆ భయంతోనే చంద్రబాబు డుమ్మా కొట్టారు. 

కేసీఆర్ లోని భయం వేరు. ఆయన తలపెట్టిన మూడో కూటమి ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ను కూడా కలుపుకుని రాజకీయం చేసే దిశగా సాగుతోంది. జాతీయ రాజకీయాల వరకే పరిమితం కావొచ్చు గాక, కానీ కాంగ్రెసుతో కలిసి అడుగులు వేయడం అనేది తెలంగాణలో తెరాసకు ఆత్మహత్యా సదృశం అవుతుంది. అందుకే ఆయన డుమ్మా కొట్టారు. అసలే మునుగోడు ఎన్నికలు ముంగిట్లో ఉన్నాయి. ఆ సభకు వెళ్లడం ద్వారా కాంగ్రెసుతో కలిసి ఏర్పడబోయే కూటమికి తాను అనుకూలంగా ఉన్నట్టు ప్రజల్లోకి సంకేతాలు వెళితే చాలా కష్టం అని కేసీఆర్ భావించారు. 

ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే.. భాజపా, కాంగ్రెస్ రెండింటికీ సమాన దూరం పాటించే కూటమి సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లబోతున్నట్లుగా అనేకానేక ప్రకటనలతో ఇప్పటికే చాలా దూరం వచ్చేసిన కేసీఆర్.. ఆ కూటమిలోకి వెళ్లకుండా ఏం చేయగలరు? ఒకవేళ రెండుకూటములను పట్టించుకోకుండా దేశమంతా పోటీచేసినా, పనిచేసినా.. అది పరోక్షంగా మోడీకి మేలు అవుతుంది కదా? మొత్తానికి కేసీఆర్ పరిస్థితి ఇబ్బందికరంగానే తయారైంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?