Advertisement

Advertisement


Home > Politics - Analysis

జ‌గ‌న్ కావాలా? వ‌ద్దా?

జ‌గ‌న్ కావాలా? వ‌ద్దా?

రాజ‌కీయాల్లో గెలుపోట‌ములు స‌హ‌జం. తెలంగాణ‌లో ప‌దేళ్లకు అధికార మార్పిడి జ‌రిగింది. ఇదే ఆంధ్రా విష‌యానికి వ‌స్తే ఐదేళ్ల‌కే పాల‌కుడిని మార్చిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌లో అధికార మార్పిడి నేప‌థ్యంలో ఇప్పుడు చ‌ర్చంతా ఆంధ్రప్ర‌దేశ్‌పైనే. ఆంధ్రాలోనే తెలంగాణ ఫ‌లిత‌మే పున‌రావృతం అవుతుంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

ఇదే సంద‌ర్భంలో తెలంగాణ‌లో అధికార పార్టీ ఓట‌మి ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు గుణ‌పాఠ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ప్ర‌ధానంగా తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న పార్టీ ఎమ్మెల్యేల‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వ‌క‌పోవ‌డం, స‌చివాల‌యానికి వెళ్ల‌క‌పోవ‌డం, ప్ర‌జ‌ల‌తో నేరుగా క‌ల‌వ‌క‌పోవ‌డం, ప్ర‌శ్నించే గ‌ళాల‌పై అణ‌చివేత‌కు పాల్ప‌డ‌డం, అహంకారంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే భావ‌న బ‌ల‌ప‌డ‌డంతో జ‌నం మార్పు కోరుకున్నారు. 

కేసీఆర్‌ను గ‌ద్దె దించ‌డానికి ప్ర‌ధాన కార‌ణాల్లో వైసీపీ ప్ర‌భుత్వానికి కూడా వ‌ర్తించేవేవో సీఎం జ‌గ‌న్ గుర్తించాల్సిన అవ‌స‌రం వుంది. మొట్ట‌మొద‌ట‌గా పార్టీ కేడ‌ర్‌ను ఈ నాలుగున్న‌రేళ్ల‌లో గాలికొదిలేశార‌నే విమ‌ర్శ బ‌లంగా వుంది. స‌చివాల‌య వ్య‌వ‌స్థ తీసుకొచ్చి దిగువ‌స్థాయిలో రాజ‌కీయ నాయ‌క‌త్వాన్ని చంపేశార‌ని, దీంతో ఓట‌ర్ల‌ను పోలింగ్ బూత్‌ల‌కు తీసుకెళ్లాల‌న్న ఆస‌క్తి వైసీపీ నేత‌ల్లో త‌గ్గింద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

అలాగే సొంత పార్టీకి చెందిన ప్ర‌జాప్ర‌తినిధుల‌కు జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ ఇచ్చిన దాఖ‌లాలే లేవు. దీంతో త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో తిష్ట వేసిన స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లి ప‌రిష్క‌రించ‌లేక‌పోయామ‌నే ఆరోప‌ణ ఎమ్మెల్యేల నుంచి వ‌స్తోంది. గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌తిరోజూ తెల్ల‌వారుజామున ప్ర‌జ‌ల నుంచి విన‌తులు స్వీక‌రిస్తూ, వారితో ముచ్చ‌టించ‌డం సానుకూల‌త క్రియేట్ చేసింది.

ఇదే జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే, ఎమ్మెల్యేలు, ఎంపీల‌కే దిక్కులేద‌ని, ఇక ప్ర‌జ‌ల్ని క‌లిసే అవ‌కాశం ఎక్క‌డుంద‌నే మాట వినిపిస్తోంది. ఇక మీడియాతో జ‌గ‌న్‌కు అస‌లు సంబంధాలు లేవు. సీఎం అయ్యాక ఇంత వ‌ర‌కూ ఆయ‌న మీడియాను అడ్ర‌స్ చూసిన ప‌రిస్థితి లేదు. మీడియాతో ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పటి నుంచి కొన‌సాగిస్తున్న ఘ‌ర్ష‌ణ, అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మ‌రింత పెరిగింది. ఒక వ‌ర్గంపై మీడియాపై కోపంతో మొత్తం జ‌ర్న‌లిస్టుల‌తోనే త‌గువు పెట్టుకున్నార‌న్న అభిప్రాయం వుంది. అధికారంలో ఉన్నారు కాబ‌ట్టి న‌ష్టం ఏంటో జ‌గ‌న్‌కు తెలియ‌డం లేదు. ఒక‌వేళ ప్ర‌తిప‌క్షంలోకి వెళితే జ‌గ‌న్ ఒంటరి కావ‌డం ఖాయం.

తెలంగాణ‌లో కేసీఆర్ స‌ర్కార్ ఓడిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం.. అహంకారం. జనానికి సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధి క‌లిగిస్తూ, అప్పుడ‌ప్పుడు బ‌హిరంగ స‌భ‌ల్లో మాట్లాడుతూ.. నా ఎస్సీలు, ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని జ‌గ‌న్ అన‌డం వ‌ర‌కు బాగుంది. అయితే క్షేత్ర‌స్థాయిలో ఇటీవ‌ల కాలంలో ఆ సామాజిక వ‌ర్గాల‌పై దాడులు జ‌రుగుతున్నాయ‌న్న ప్ర‌చారం ఊపందుకుంది. దీన్ని పోగొట్టుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం లేదు.

అలాగే ఏపీలో అయిన దానికి, కానిదానికి ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియా ముందుకొస్తున్నారు. దీంతో జ‌గ‌న్‌ను స‌జ్జ‌ల స‌ల‌హాదారుడా? లేక స‌జ్జ‌ల‌కు జ‌గ‌న్ స‌ల‌హాదారుడా? అనే అనుమానం క‌లుగుతోంది. ప్ర‌భుత్వ విధానాల‌ను, ప‌రిపాల‌నాప‌ర‌మైన నిర్ణ‌యాల‌ను సీఎం జ‌గ‌న్ మీడియా ముందుకొచ్చి వివ‌రిస్తే న‌ష్టం ఏంట‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. ఎవ‌రితోనూ క‌ల‌వ‌కుండా సీఎం క్యాంప్ కార్యాల‌యంలో వుంటూ, ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల‌తో క‌లిసి నిర్ణ‌యాలు తీసుకుంటూ పాల‌న సాగిస్తున్నార‌నే అభిప్రాయం వుంది.

ప్ర‌జ‌ల‌తో ఎన్నుకోబ‌డిన ప్ర‌జాప్ర‌తినిధుల‌తో మాట్లాడుతూ స‌మ‌స్య‌ల‌పై ప‌రిష్కారాల‌ను చూపించి వుంటే బాగుండేద‌నే టాక్ వినిపిస్తోంది. సీఎం జ‌గ‌న్ విష‌యంలో అంద‌రి నోట ఒక‌టే మాట‌... ఆయ‌న ఎవ‌రితోనూ మాట్లాడ్డం లేద‌ని. ఇప్ప‌టికీ ప్ర‌జ‌ల్ని నేరుగా క‌ల‌వ‌క‌పోతే, మ‌రెప్పుడు అనే ప్ర‌శ్న‌, నిల‌దీత వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధుల నుంచే వ‌స్తోంది. రానున్న ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ వ్యూహం ఏంటో ఎవ‌రికీ అంతుచిక్క‌డం లేదు. 

మ‌రోవైపు టీడీపీ, జ‌న‌సేన క‌లిసి ముందుకెళుతున్నాయి. ఎంతైనా ఈ కూట‌మితో వైసీపీకి ఇబ్బందిక‌ర ప‌రిస్థితే. సంక్షేమ ప‌థ‌కాలు మాత్ర‌మే జ‌గ‌న్‌ను గ‌ట్టెక్కించే ప‌రిస్థితి లేదు. ప్ర‌జ‌లు చాలా తెలివైన వాళ్లు. ప‌రిపాల‌న అంటే చాలా విష‌యాల‌ను ఆలోచిస్తారు. క్షేత్ర‌స్థాయిలో వైసీపీ ప్ర‌భుత్వంపై ఏమంత అద్భుత‌మైన అభిప్రాయ‌మేమీ లేదు. రాష్ట్ర అభివృద్ధికి ఈ ప్ర‌భుత్వం చేస్తున్న‌దేమీ లేద‌న్న విమ‌ర్శ వుంది. క‌క్ష‌పూరిత పాల‌న సాగుతోంద‌న్న అభిప్రాయం జ‌నంలో వుంది. ఇలాంటి ప్ర‌తికూల‌త‌ల‌ను అధిగ‌మిస్తేనే జ‌గ‌న్‌కు మ‌రోసారి అధికారం. 

చంద్ర‌బాబు ఐదేళ్ల పాల‌న‌పై ప్ర‌జాతీర్పు ఏంటో జ‌గ‌న్ చూశారు. టీడీపీకి ఏ ప‌రిస్థితిలో ఘోర ఓట‌మి వ‌చ్చిందో జ‌గ‌న్ గుర్తిస్తే, చాలా త‌ప్పుల్ని స‌రిదిద్దుకోవ‌చ్చు. క్షేత్ర‌స్థాయిలో ఎమ్మెల్యేల‌పై పెద్ద‌గా సానుకూల‌త లేదు. అందిన‌కాడికి దోచుకుంటున్నారు. మ‌ట్టి, ఇసుక‌, మందు.. ఇలా ఏదీ వ‌ద‌ల‌డం లేదు. చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకుంటామ‌నుకుంటే కుద‌ర‌దు. ఇక స‌మ‌యం కూడా లేదు. జ‌గ‌న్ కావాలా? వ‌ద్దా? అనేదానిపైనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మ‌రోసారి రాష్ట్రానికి జ‌గ‌న్ అవ‌స‌ర‌మ‌ని వైసీపీ చెప్ప‌డం కాదు. ఆ మాట జ‌నం అనుకోవాలి. మ‌ళ్లీ జ‌గ‌నే కావాలి అనేంత‌గా జ‌న‌రంజ‌క పాల‌న సాగిందా? అనే అంశంపైనే ప్ర‌జాతీర్పు ఇవ్వ‌నున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?