Advertisement

Advertisement


Home > Politics - Analysis

నిస్సందేహంగా ఈ ఓట‌మికి కార‌ణం జ‌గ‌న్!

నిస్సందేహంగా ఈ ఓట‌మికి కార‌ణం జ‌గ‌న్!

ప్ర‌జ‌లు, దేవుడు.. వీళ్ల‌నే త‌ను న‌మ్ముకున్న‌ట్టుగా ప్ర‌క‌టించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో చిత్తుగా ఓట‌మి పాల‌య్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నిక‌ల్లో ఓడిపోతుంద‌ని అంచ‌నా వేసిన వారిలో కూడా బ‌హు త‌క్కువ మంది ఆ పార్టీకి మ‌రీ ఇన్ని త‌క్కువ సీట్లు ద‌క్కుతాయ‌నే అంచ‌నాల‌ను వేశారు! తెలుగుదేశం, జ‌న‌సేన‌, బీజేపీలు కూట‌మిగా గ‌ట్ట‌డం జ‌గ‌న్ ఇంట్లోనే ముస‌లం పుట్టి ష‌ర్మిల కాంగ్రెస్ లోకి చేరి కొన్ని ఓట్ల‌నైనా చీల్చ‌డం వంటి కార‌ణాల రీత్యా జ‌గ‌న్ కు ఓట‌మి త‌ప్ప‌ద‌ని న‌మ్మిన తెలుగుదేశం వీరాభిమాన వ‌ర్గంలో కూడా కూట‌మికి ఇన్ని సీట్లు ద‌క్కుతాయ‌ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతలా చిత్త‌వుతుంద‌ని ఊహించి ఉండ‌రు! 

అలాంటి అనూహ్య‌మైన ఎన్నిక‌ల ఫ‌లితాలను ఇచ్చారు ఏపీ ప్ర‌జ‌లు! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట‌మి త‌ర్వాత‌.. కారణాల‌ను విశ్లేషించ‌డం మొద‌లుపెడితే .. ముందుగా క‌నిపించే అంశం జ‌గ‌న్ వైరి ప‌క్షాలు కూట‌మి గ‌ట్ట‌డం! 2014 లోనే ఆ కూట‌మి విజ‌యాన్ని సాధించింది. అలాంటి కూట‌మి మ‌రోసారి ఏర్ప‌డ‌టం సైక‌లాజిక‌ల్ గా టీడీపీకి అడ్వాంటేజీని ఇచ్చింది. చంద్ర‌బాబు రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఏనాడూ సొంతంగా గెలిచిన చ‌రిత్ర లేదు! ఏదో ఒక కూట‌మిని గ‌ట్టి అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌డం చంద్ర‌బాబు రాజ‌కీయ జీవితంలో కీల‌కం. ఇలా కూట‌మి టీడీపీకి ఐదేళ్ల అధికారాన్ని ప్ర‌సాదించింది!

మ‌రి ఈ కూట‌మిని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెంబేలెత్తిపోలేదు! గ‌ట్టిగా పోరాడింది. ఈ పోరాటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40 శాతం ఓట్ల‌ను తెచ్చిపెట్టింది! అయితే.. అధికారానికి మాత్రం ఆమ‌డ దూరంలో నిల‌ప‌డ‌మే కాదు, 2014 లో ద‌క్కిన‌న్ని ఎమ్మెల్యే సీట్ల‌ను కూడా తెచ్చిపెట్ట‌లేక‌పోయింది! ఇదే అస‌లు క‌థ ఈ ఎన్నిక‌ల్లో! ఒక‌వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నిక‌ల్లో 60 నుంచి 70 సీట్ల వ‌ర‌కూ సాధించి ఉంటే, కేవ‌లం గుంపుగా రావ‌డం వ‌ల్ల‌నే ఆ కూట‌మి నెగ్గింది త‌ప్ప మ‌రో కార‌ణ‌మే లేద‌ని చెప్పొచ్చు!

ఈ సారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నిక‌ల్లో త‌న‌కు ద‌క్కిన వాటిల్లో కూడా ఆరేడు శాతం ఓట్ల‌ను కోల్పోయింది! ఇదే ఆ పార్టీని చిత్తుగా ఓడిపోయేలా చేసింది. 2019 నాటి ఓట్ల శాతాన్ని ద‌క్కించుకోవ‌డం మాట అటుంచి, 2014 నాటి ఓట్ల శాతాన్ని కూడా జ‌గ‌న్ పార్టీ పొంద‌లేక‌పోయింది. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం.. అధికారంలో చేసిన త‌ప్పులు, పొర‌పాట్లే కార‌ణాలు! దారిన పోయే వ‌ర్గాల‌ను కూడా జ‌గ‌న్ శ‌త్రువులుగా చేసుకున్నాడు, అదే పెను ప్ర‌భావాన్ని చూపింది!

మ‌ద్య‌పాన నిషేధం అంటూ కంగాళీ చేయ‌డం, ప్ర‌భుత్వ ఉద్యోగుల‌తో వ్య‌వ‌హారం, రోడ్లు - అభివృద్ధి లేద‌నే ప్ర‌చారాన్ని స‌మ‌ర్థ‌వంతంగా హ్యాండిల్ చేయ‌లేక‌పోవ‌డం,  కార్య‌క‌ర్త‌ల‌ను పూర్తిగా విస్మ‌రించ‌డం -అలాంటి వారి అక్క‌రే లేద‌ని జ‌గ‌న్ భావించ‌డం.. ఇవే జ‌గ‌న్ కు అస‌లు న‌ష్టాన్ని క‌లిగించాయి!

ప్రస్తుత రోజుల్లో క‌నీసం ఐదొంద‌ల ఓట‌ర్లున్న ప్ర‌తి ఊర్లోనూ.. యాభై అర‌వై మంది మ‌ద్య‌పాన ప్రియులుంటారు. ప్ర‌త్యేకించి క‌రోనా వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం రోజుల్లో.. అనేక మంది ప‌ట్ట‌ణాల్లోనూ, ప‌ల్లెల్లో ఉంటూ ప‌నులు చేసుకునే స‌మ‌యంలో.. తాము డ‌బ్బు పెట్టినా కోరుకున్న మ‌ద్యం ద‌క్క‌క‌పోవ‌డం అనేది వారిలో తీవ్ర‌మైన అస‌హ‌నాన్ని క‌లిగించింది! ఇది త‌మ‌కు ఎంత న‌ష్టం క‌లిగిస్తుంద‌నే అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లైట్ తీసుకుంది. త‌మ ఓటు బ్యాంకులో తాగుబోతులు లేరు అని స‌జ్జ‌ల లాంటి వారు వాదించారు కూడా! చంద్ర‌బాబు.. త‌న ఎన్నిక‌ల హామీల్లో నాణ్య‌మైన మ‌ద్యం ఇస్తా.. అని ఓపెన్ గా ప్ర‌క‌టించాడంటే.. ఈ వ‌ర్గం ప్ర‌భావాన్ని టీడీపీ ఎంత ప‌సిగ‌ట్టిందో అర్థం చేసుకోవ‌చ్చు!

నాణ్య‌మైన మ‌ద్యం ఇస్తానంటూ చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన‌ప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ట్రోల్ చేశారు! బుగ్గ‌లు నొక్కుకున్నారు! అయితే.. ఇదొక్క వ్య‌వ‌హార‌మే మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క‌నీసం రెండు మూడు శాతం ఓట్ల‌ను దూరం చేసింది! ఒక‌వేళ మ‌ద్య‌పాన నిషేధం అనుకుంటే పూర్తిగా చేయాల్సింది, లేదంటే కామ్ గా ఉండాల్సింది! అరొక‌ర ప‌నులు చేసి జ‌గ‌న్ తీవ్ర‌మైన చేటును చేసుకున్నాడు! ఎంత త‌క్కువ అంచ‌నా వేసినా.. మ‌ద్యం ఒక్క‌టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు మూడు శాతం ఓట్ల‌ను దూరం చేసింద‌నడంలో ఎలాంటి ఆశ్చ‌ర్యం లేదు! నాణ్య‌మైన మ‌ద్యం దొర‌క‌లేద‌ని తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో ప్ర‌స్తావించిన రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేల్కొని ఉన్నా.. ఈ న‌ష్టం జ‌రిగేది కాదు! అయితే జ‌గ‌న్ మూర్ఖ‌పు ప‌ట్టుద‌ల ఇప్పుడు ఆయ‌నకే చేటును చేసింది!

ఇక తాడేప‌ల్లిలో హార్డ్ కోర్ కార్య‌క‌ర్త‌ల మీటింగ్ లో జ‌గ‌న్ మాట్లాడుతూ.. నేను ప్ర‌జ‌లనే న‌మ్ముకున్నానంటూ ప్ర‌క‌టించుకున్నారు! అది కార్య‌క‌ర్త‌ల‌తో మాత్ర‌మే ఏర్పాటు చేసిన మీటింగ్. అక్క‌డ ఏం మాట్లాడాల‌నే ఇంగితం కూడా జ‌గ‌న్ కు లేద‌నే అనుకోవాలి! మాట‌ల సంగ‌తెలా ఉన్నా.. క్యాడ‌ర్ ను జ‌గ‌న్ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు! వారి అవ‌స‌రం లేద‌ని, పెదరాయుడు అటు ధ‌నుష్‌, ధ‌నుష్ టు పెద‌రాయుడు అన్న‌ట్టుగా.. త‌ను ప్ర‌జ‌లు, మ‌ధ్య‌లో ఎవ్వ‌రూ వ‌ద్ద‌నుకున్నాడు! అందుకు ఫ‌లితం అనుభ‌విస్తున్నాప్పుడు! ఐదొంద‌ల జ‌నాభా ఉన్న ప్ర‌తి ప‌ల్లెల్లోనూ 2014-19 ఎన్నిక‌లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ఒళ్లొంచి క‌ష్ట‌ప‌డ్డ కార్య‌క‌ర్త‌ల కుటుంబాల్లో క‌నీసం నాలుగైదు కుటుంబాలు దూరం అయ్యాయి. అవి సూటిగా తెలుగుదేశం వైపు వెళ్లిపోయాయి. కేవ‌లం త‌మ‌కు ఏం చేయ‌లేదు, ఏం ద‌క్క‌లేదు అనే భావ‌న‌తో వెళ్లిపోయిన వారు వారంతా!

రాయ‌ల‌సీమ ప్రాంతంలోనే ఇలాంటివి జ‌రిగాయి, ఇక కోస్తాంధ్ర సంగ‌తి చెప్ప‌న‌క్క‌ర్లేదు! ఇలా ప్ర‌తి ఐదు వంద‌ల ఓట్ల‌కూ క‌నీసం మ‌రో ఇర‌వై ముప్పై ఓట్ల‌ను జ‌గ‌న్ కోల్పోయాడు! దీని వ‌ల్ల కూడా న‌ష్టం లేద‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించింది, కొంద‌రు ఇటు నుంచి అటు వెళితే, అటు నుంచి కూడా ఇటు వ‌చ్చి ఉంటారు క‌దా, సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధిదారులు ఉన్నారు క‌దా.. అనే లెక్క‌లేసింది! ఇటు నుంచి వెళ్ల‌డ‌మే కానీ, అటు నుంచి వ‌చ్చింది లేదు! జ‌గ‌న్ పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడే ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు ఆ పార్టీని వీడుతున్నారంటే, అక్క‌డ బావుకునేది ఏమీ లేద‌నే క్లారిటీ అవ‌త‌లి వాళ్ల‌కూ వ‌స్తుంది. అలాంట‌ప్పుడు వాళ్లు ఇటు ఎందుకు జంప్ చేస్తారు? ఇలా రెండు ఎన్నిక‌ల్లో త‌న‌పై విప‌రీత‌మైన అభిమానంతో వ‌ర్క్ చేసిన చాలా మందిని జ‌గ‌న్ దూరం చేసుకున్నాడు. దీని వ‌ల్ల ఇంకో రెండు మూడు శాతం ఓట్లు పోయాయి!

ఇక అభివృద్ధి, రాజ‌ధాని అంశంలో జ‌గ‌న్ త‌న అభిప్రాయాలు ఏవైనా, త‌ను చేసింది ఏదైనా.. దాన్ని పాజిటివ్ గా ప్రొజెక్ట్ చేసుకోవ‌డంలో దారుణంగా విఫ‌లం అయ్యాడు! మూడు రాజ‌ధానుల ఫార్ములా ఏ ఒక్క ప్రాంతాన్నీ ఆక‌ట్టుకోలేక‌పోయిందని ఫ‌లితాల‌తో పూర్తిగా రుజువు అయ్యింది. అమ‌రావ‌తి రూపంలో చంద్ర‌బాబు ఎన్ని అక్ర‌మాల‌కు పాల్ప‌డి ఉన్నా.. ఫ‌ర్వాలేద‌నే ప్ర‌జ‌లు అనుకున్నారు కానీ, రాజ‌ధాని అంటూ ఒక‌టి ఉండాల‌నే తీరునే వారు వ్య‌క్త ప‌రిచారు, ఇది ఓట‌మి త‌ర్వాత కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోలేక‌పోయింది. అలాగే రోడ్ల విష‌యంలో ప‌చ్చ‌బ్యాచ్ చేసిన యాగీని నియంత్రించ‌లేక‌పోయింది. ఆఖ‌రి వ‌ర‌కూ చిన్న చిన్న రిపేర్ల‌ను కూడా పెండింగ్ లో పెట్టి.. సోష‌ల్ మీడియా ప్ర‌చారాల‌ను న‌మ్మే వాళ్ల చేతిలో ఎదురుదెబ్బ‌లు ఎదుర్కొంది. 

చంద్ర‌బాబు చేసిందీ అప్పులే, జ‌గ‌న్ చేసిందీ అప్పులే.. అయితే చంద్ర‌బాబు అప్పులు చేసి నీరుచెట్టు అంటూ ప‌ప్పు బెల్లాలు పంచినా మ‌ళ్లీ అలాంటి హామీలే ఇవ్వ‌గ‌లుగుతున్నారు! జ‌గ‌న్ మాత్రం అప్పుల విష‌యంలో మాత్రం విప‌రీత‌మైన నెగిటివ్ ప‌బ్లిసిటీ జ‌రిగింది. ఇదీ కూడా తీవ్ర‌మైన న‌ష్టాన్నే క‌లిగించింది.

లెక్క‌లేన‌న్ని సంక్షేమ ప‌థ‌కాల‌ను పెట్టినా, ప్ర‌జ‌ల‌కే డైరెక్టుగా ప‌థ‌కాల ల‌బ్ధి క‌లిగే ఏర్పాటు చేసినా, వాటిపై అతి విశ్వాసంతో, న‌ష్టం క‌లుగుతున్న విష‌యాల‌ను పూర్తిగా లైట్ తీసుకుని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణ ప‌రాజ‌యాన్ని ఎదుర్కొంది. త‌న పాల‌న లో మంచి జ‌రిగి ఉంటేనే త‌న‌కు ఓటేయాల‌ని జ‌గ‌న్ బాహాటంగా చెప్పాడు, ఆయ‌న పార్టీ ఎంత ఓట్ల శాతాన్ని పొందినా, చిత్తుగా ఓట‌మి పాలైంది! కాబ‌ట్టి.. జ‌గ‌న్ పాల‌న న‌చ్చ‌లేదంతే! కాబ‌ట్టి త‌న పాల‌న పై జ‌గ‌న్ కు ఏవైనా భ్ర‌మ‌లు ఉండినా, అవి పూర్తిగా తొల‌గిపోవాలి! ఇక ఈ పాల‌న గురించి మాట్లాడ‌కుండా.. ప్ర‌తిప‌క్షంగా త‌నేం చేయాలో జ‌గ‌న్ ఆలోచించుకోవాలి! గ‌త ఐదేళ్ల ఊసే ఎత్తే కొద్దీ అది జ‌గ‌న్ కు మ‌రింత న‌ష్ట‌మే త‌ప్ప లాభం లేదు!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?