కుమ్మి..కుమ్మి వదిలిన ఉండవల్లి

తమ వాదనకు, తమ పాయింట్లకు అనుగుణంగా వాదనలు నిర్మించుకుంటూ మాట్లాడడం వేరు. అసలు పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ, అస్సలు ఇక అప్పీలే లేదన్నట్లు ఫుల్ క్లారిటీగా మాట్లాడడం వేరు. ఉండవల్లి అరుణ్ కుమార్…

తమ వాదనకు, తమ పాయింట్లకు అనుగుణంగా వాదనలు నిర్మించుకుంటూ మాట్లాడడం వేరు. అసలు పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ, అస్సలు ఇక అప్పీలే లేదన్నట్లు ఫుల్ క్లారిటీగా మాట్లాడడం వేరు. ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడితే అవతలి వారు మరి నోరెత్తడానికి అవకాశం వుండదు. అనర్గళంగా గంటకు పైగా పాయింట్ టు పాయింట్, సోదాహరణంగా మాట్లాడితే ఎలా వుంటుంది. ఈ రోజున ఉండవల్లి అలాగే మాట్లాడారు. 

రామోజీ రావు, మీడియా వ్యవహారాలు, మార్గదర్శి, రామోజీ ఫిలిం సిటీ, ఇలా ఇవన్నీ కలిపి మొత్తం బతుకులు బయటకు లాగారు. ప్రభుత్వాలు, చట్టాలు, న్యాయస్థానాలు రామోజీ ముందు ఎలా లొంగిపోతున్నాయో పక్కాగా వివరించారు.

తిరుపతి వెంకటేశ్వరస్వామికి చట్టాలు వర్తించినపుడు రామోజీకి ఎందుకు వర్తించకూడదు? విజయసాయిరెడ్డి చార్టెడ్ అక్కౌంటెట్ అని మరి ఆయనను అరెస్ట్ చేసినపుడు, బ్రహ్మయ్య అండ్ కో వాళ్లని ఎందుకు చేయకూడదు? అయిదు గంటలకు కోర్టు సమయం అయిపోతే ఎనిమిది గంటల వరకు రామోజీ కేసును ఎలా విచారించారు? రామోజీ ఫిలిం సిటీకి లాండ్ సీలింగ్ యాక్ట్ ఎందుకు వర్తించదు? అగ్రిగోల్డ్ కేసుకు-మార్గదర్శి కేసుకు ఏమిటి తేడా? ఫిర్యాదు లేకుండా చర్య తీసుకోకూడదు అన్నది ఎంత వరకు చట్టబద్దం? ఇలా మొదలుపెట్టి దాదాపు గంటంపావు సేపు సుదీర్ఘంగా ఉండవల్లి మాట్లాడింది వింటే, అస్సలు కౌంటర్ ఇవ్వడానికి రామోజీ లాయర్లకు కూడా పాయింట్లు వుండవు అనిపిస్తుంది.

అసలు పోలీసులు అడిగిన ప్రశ్నలేమిటి? సమాధానాలేమిటి? అన్నీ ఈనాడులో ఓ ఫుల్ పేజీ వేసేయవచ్చు కదా? ట్రాన్సపరెన్సీ గురించి పదే పదే మాట్లాడే రామోజీ రావు తాను తీసుకున్న డిపాజిట్లు, వెనక్కు ఇచ్చినవి అన్నీ ఓ చిన్న పుస్తకం వేసేయవచ్చు కదా? అసలు చిట్ ఫండ్ కంపెనీల పాటించాల్సిన నిబంధనలు ఏవీ రామోజీ ఎందుకు పాటించడం లేదు. 

ఇలా ఒకటి కాదు, రెండు కాదు డజన్ల కొద్దీ ప్రశ్నలు ఉండవల్లి సంధించారు. ఏ ఒక్కదానికి రామోజీ దగ్గర నుంచి సమాధానం వుండదని అర్థం అయిపోతుంది.

అసలు ఉండవల్లి ప్రసంగం వింటే ఈ దేశంలో రామోజీరావు అనే పెద్దాయిన ఎంత బలమైన శక్తి అన్నది, ఈ దేశ చట్టాలు ఏ విధంగానూ రామోజీని ఏమీ చేయలేవనీ అర్థం అయిపోతుంది. బహుశా ఇంతలా అరటిపండు వలిచినట్లు ఉండవల్లి చెప్పుకు వచ్చినా కంఠ శోష తప్ప మరేం కాదు. 

జగన్ కక్షసాధింపు అనే అంటారు తప్ప రామోజీ చేసిన తప్పులకు వివరణ వుండదు. పైగా తెలుగుదేశం అనుకూల కుల మీడియా రెడీగా వుంటుంది రామోజీ తరపున వకాల్తా తీసుకోవడానికి.